ఐఎస్కు ఇండియా నుంచి ఏడు సంస్థల సాయం
లండన్: ప్రపంచాన్ని వేధిస్తున్న ఉగ్రభూతం ఇస్లామిక్ స్టేట్ కు సహాయం అందించే సంస్థల్లో ఇండియా నుంచి కూడా కొన్ని సంస్థలు ఉన్నట్లు యూరోపియన్ యూనియన్ కు చెందిన కాన్ఫ్లిక్ట్ అర్మనెంట్ రిసెర్చ్(కార్) అనే అధ్యయన సంస్థ తెలిపింది. మొత్తం 20 దేశాల్లోని సంస్థలు ఇస్లామిక్ స్టేట్ను పెంచి పోషిస్తుండగా భారత్కు చెందిన ఏడు సంస్థల అండదండలు దీనికి ఉన్నట్లు వెల్లడించాయి. ఐఎస్ తయారు చేసే బాంబులకు కావాల్సిన రసాయన పదార్థాలు ఇతర వస్తువులు భారత్నుంచి వెళుతున్నట్లు, వాటిని పట్టుకునేందుకు చాలా జాగ్రత్తగా వ్యూహం పన్నాల్సిన అవసరం ఉందని కూడా సూచించింది.
20 దేశాల్లోని 51 కంపెనీలు ఈ సంస్థకు సహాయపడుతున్నట్లు పేర్కొంది. అమెరికా, బ్రెజిల్, టర్కీ, రోమానియా, రష్యా, నెదర్లాండ్, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, భారత్ వంటి దేశాల నుంచి మొత్తం 700 రకాల సామాగ్రి ఐఎస్కు పంపిణీ అవుతుండగా వీటిలో ఎక్కువగా టర్కీ నుంచే 13 సంస్థలు ఐఎస్ కు బాంబు తయారీ సామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లు వివరించింది. వీటిని తీవ్ర ప్రభావాన్ని చూపగల ఐఈడీ బాంబులకు ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా, ఈ సంస్థ బాంబులను పేల్చివేసేందుకు ఎక్కువగా నోకియా 105 మోడల్ ఫోన్లను ఉపయోగిస్తున్నట్లు కూడా తెలిపింది.