ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హై కమిషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు అదృశ్యమైన ఘటన సోమవారం కలకలం రేపింది. అధికారిక విధుల్లో భాగంగా సోమవారం ఉదయం కారులో బయటకు వెళ్లిన వారిద్దరు గమ్యస్థానానికి చేరుకోలేదు. కారులో వేగంగా వెళ్తూ ఒక వ్యక్తిని ఢీకొట్టి, తీవ్రంగా గాయపర్చడంతో ఆ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారని స్థానిక మీడియా వెల్లడించింది. దాంతో, భారత్ ఘాటుగా స్పందించింది. న్యూఢిల్లీలోని పాక్ హై కమిషన్ చీఫ్‌ను పిలిపించి, తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆ ఇద్దరు అధికారుల భద్రత బాధ్యత పాక్‌దేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, సోమవారం సాయంత్రం ఆ ఇద్దరు అధికారులను పాక్ విడిచిపెట్టింది. వారిద్దరు అక్కడి భారత హై కమిషన్‌కు చేరుకున్నారని భారత ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి.
హిట్ అండ్ రన్!
ఇస్లామాబాద్‌లోని ఎంబసీ రోడ్‌లో ఉదయం నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు ఢీ కొట్టిందని, ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని జియో న్యూస్ ప్రకటించింది. పారిపోయేందుకు ప్రయత్నించిన కారులోని వ్యక్తులను స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారని వెల్లడించింది. ఆ తరువాత, కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు భారత హై కమిషన్‌లో అధికారులని తేలిందని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ పేర్కొంది. కారులో అతివేగంగా వెళ్తూ నియంత్రణ కోల్పోయి ఫుట్‌పాత్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టారంది. ఆ ఇద్దరు అధికారులు సిల్వదాస్ పౌల్, దావము బ్రహములుగా గుర్తించారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక వెల్లడించింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు విదేశాంగ అధికారులకు సమాచారమిచ్చారని తెలిపింది.
అయితే, ఈ యాక్సిడెంట్‌కు సంబంధించి పాకిస్తాన్ అధికారులు కానీ, స్థానిక భారతీయ హై కమిషన్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, అంతకుముందు, భారతీయ అధికారులను అరెస్ట్ చేయడంపై న్యూఢిల్లీలోని పాక్ హై కమిషన్ చీఫ్‌ను పిలిపించిన విదేశాంగ శాఖ.. ఆయనకు తీవ్ర నిరసన తెలిపింది. ఆ అధికారులను ఇంటరాగేషన్ పేరుతో వేధించవద్దని, వారి భద్రత బాధ్యత పాక్ అధికారులదేనని స్పష్టం చేసింది. ఆ ఇద్దరు అధికారులతో పాటు, వారు ఉపయోగించిన కారును వెంటనే హై కమిషన్‌కు అప్పగించాలని స్పష్టం చేసింది. గూఢచర్యం ఆరోపణలపై భారత్‌లోని పాక్ హై కమిషన్ అధికారులు ఆబిద్ హుస్సేన్, మొహ్మద్ తాహిర్‌లను ఇండియా నుంచి పంపించివేసిన రెండు వారాల తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ఇండియన్ నుంచి ఆర్మీ దళాల కదలికలపై రహస్య సమాచారం తీసుకుంటూ వారిద్దరూ దొరికిపోయారని భారత్ ఆరోపించింది. అప్పటినుంచి, పాక్‌లోని భారతీయ హై కమిషన్ చీఫ్ గౌరవ్ అహ్లువాలియా సహా పలువురు అధికారులకు పాకిస్తాన్ ఏజెన్సీల నుంచి పలుమార్లు వేధింపులు ఎదురవుతూ వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment