Hit-and-Run
-
పాక్‌లో భారతీయ అధికారుల అరెస్ట్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హై కమిషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు అదృశ్యమైన ఘటన సోమవారం కలకలం రేపింది. అధికారిక విధుల్లో భాగంగా సోమవారం ఉదయం కారులో బయటకు వెళ్లిన వారిద్దరు గమ్యస్థానానికి చేరుకోలేదు. కారులో వేగంగా వెళ్తూ ఒక వ్యక్తిని ఢీకొట్టి, తీవ్రంగా గాయపర్చడంతో ఆ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారని స్థానిక మీడియా వెల్లడించింది. దాంతో, భారత్ ఘాటుగా స్పందించింది. న్యూఢిల్లీలోని పాక్ హై కమిషన్ చీఫ్‌ను పిలిపించి, తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆ ఇద్దరు అధికారుల భద్రత బాధ్యత పాక్‌దేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, సోమవారం సాయంత్రం ఆ ఇద్దరు అధికారులను పాక్ విడిచిపెట్టింది. వారిద్దరు అక్కడి భారత హై కమిషన్‌కు చేరుకున్నారని భారత ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. హిట్ అండ్ రన్! ఇస్లామాబాద్‌లోని ఎంబసీ రోడ్లో ఉదయం నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు ఢీ కొట్టిందని, ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని జియో న్యూస్ ప్రకటించింది. పారిపోయేందుకు ప్రయత్నించిన కారులోని వ్యక్తులను స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారని వెల్లడించింది. ఆ తరువాత, కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు భారత హై కమిషన్‌లో అధికారులని తేలిందని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ పేర్కొంది. కారులో అతివేగంగా వెళ్తూ నియంత్రణ కోల్పోయి ఫుట్‌పాత్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టారంది. ఆ ఇద్దరు అధికారులు సిల్వదాస్ పౌల్, దావము బ్రహములుగా గుర్తించారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక వెల్లడించింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు విదేశాంగ అధికారులకు సమాచారమిచ్చారని తెలిపింది. అయితే, ఈ యాక్సిడెంట్‌కు సంబంధించి పాకిస్తాన్ అధికారులు కానీ, స్థానిక భారతీయ హై కమిషన్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, అంతకుముందు, భారతీయ అధికారులను అరెస్ట్ చేయడంపై న్యూఢిల్లీలోని పాక్ హై కమిషన్ చీఫ్‌ను పిలిపించిన విదేశాంగ శాఖ.. ఆయనకు తీవ్ర నిరసన తెలిపింది. ఆ అధికారులను ఇంటరాగేషన్ పేరుతో వేధించవద్దని, వారి భద్రత బాధ్యత పాక్ అధికారులదేనని స్పష్టం చేసింది. ఆ ఇద్దరు అధికారులతో పాటు, వారు ఉపయోగించిన కారును వెంటనే హై కమిషన్‌కు అప్పగించాలని స్పష్టం చేసింది. గూఢచర్యం ఆరోపణలపై భారత్‌లోని పాక్ హై కమిషన్ అధికారులు ఆబిద్ హుస్సేన్, మొహ్మద్ తాహిర్‌లను ఇండియా నుంచి పంపించివేసిన రెండు వారాల తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ఇండియన్ నుంచి ఆర్మీ దళాల కదలికలపై రహస్య సమాచారం తీసుకుంటూ వారిద్దరూ దొరికిపోయారని భారత్ ఆరోపించింది. అప్పటినుంచి, పాక్‌లోని భారతీయ హై కమిషన్ చీఫ్ గౌరవ్ అహ్లువాలియా సహా పలువురు అధికారులకు పాకిస్తాన్ ఏజెన్సీల నుంచి పలుమార్లు వేధింపులు ఎదురవుతూ వచ్చాయి. -
ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో కీలక మలుపు
న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న మెర్సిడైస్ హిట్ అండ్ రన్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. యాక్సిడెంట్ చేసిన సమయంలో బాల నేరస్తునిగా ఉన్న ఓ కుర్రాడు ప్రస్తుతం మేజర్ కావడంతో అతన్ని ట్రయల్ కోర్టులో విచారించేందుకు జువైనల్ జస్టిస్ బోర్డు ఢిల్లీ పోలీసులకు అనుమతినిచ్చింది. ఈ కేసులో మైనర్ గా ఉన్న నేరస్ధుడు ఏప్రిల్ 4 న ఢిల్లీలో కారు డ్రైవింగ్ చేస్తుండగా సిద్ధార్థ శర్మ(32) అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆక్సిడెంట్ జరిగిన నాలుగు రోజుల తర్వాత అతను మేజర్ అవుతాడని, కేసును నమోదు చేసేప్పుడు ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని చార్జిషీట్ లో నమోదు చేశారు. నేరస్థనిపై దోషపూరిత హత్యగా కేసును నమోదు చేశారు. నిందితుని తండ్రి, డ్రైవరుపై కూడా కేసును నమోదు చేశారు. అప్పుడు నేరస్థుడు మైనర్ కావడంతో అతనికి బెయిల్ లభించింది. ప్రస్తుతం అతన్ని మేజర్ గా గుర్తించాలని పోలీసులు విజ్ఞప్తిని జువైలిన్ బోర్డు అంగీకరించడంతో హత్య గా కేసును నమోదు చేసిన పోలీసులు మళ్లీ నిందితున్ని అరెస్టు చేయనున్నారు. -
బీఎండబ్ల్యూతో ఢీ కొట్టి..తుపాకీతో బెదిరించి..
నోయిడా(ఢిల్లీ): బీఎండబ్ల్యూ కారుతో మరో కారు, బైక్‌ను ఢీకొట్టి అనంతరం తుపాకీతో బెదిరించి పారిపోయిన ఘటనలో ఒకరు మృతిచెందారు. నోయిడాలో హిట్ అండ్ రన్ ఘటనలో తీవ్రగాయాలై చికిత్స పొందుతున్న గుల్ఫామ్ అలీ (20) చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. నోయిడాలోని సెక్టార్ 24లో ఏడవ గేట్ వద్ద బీఎండబ్ల్యూ కారు మరోకారుతో పాటూ బైక్‌ను శనివారం ఢీకొంది. ఈ ప్రమాదంలో గుల్ఫామ్ అలీ (20)తో పాటూ మరో ముగ్గురుకి తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అలీ మృతి చెందగా.. మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. బీఎండబ్ల్యూ కారు మరో కారుతో రేసింగ్ పెట్టుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ కారు స్థానికంగా ఉండే నీతు అనే మహిళదిగా పోలీసులు గుర్తించారు. అయితే ఘటన జరిగిన సమయంలో వినోద్ అనే వ్యక్తి కారును నడిపినట్లు నీతు తెలిపారు. కారును ఢీకొట్టిన అనంతరం వినోద్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అతడు తుపాకీతో బెదిరించి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
సల్మాన్‌కు వ్యతిరేకంగా సుప్రీంకు..!
-
ఆమె ఇక జీవితంలో డ్రైవింగ్ చేయకూడదట
ముంబై: తప్ప తాగి ఇద్దరి మృతికి కారకురాలైన మహిళా లాయర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను ముంబై ఆర్టీవో జీవిత కాలం రద్దు చేశారు. వివరాలు... మద్యం మత్తులో జాహ్నవి గడ్కర్ (35) అనే న్యాయవాది తన ఆడి క్యూ3 మోడల్ కారును రాంగ్ రూట్లో నడిపి ఓ టాక్సీని ఢీకొట్టింది. గత ఏడాది జూన్ 10న జరిగిన ఈ సంఘటనలో టాక్సీలో వెళ్తున్న మహ్మద్ సలీం సాబూవాలా (50), మహ్మద్ హుస్సేన్ సయీద్ (57) అనే ఇద్దరు మరణించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో వైస్ ప్రెసిడెంట్ (లీగల్)గా పనిచేస్తున్న గడ్కర్పై పలు సెక్షన్ల కింద కేసులు కోర్టులో నడుస్తున్న విషయం తెలిసిందే. -
హిట్ అండ్ రన్: కారులోంచి కాల్పులు జరిపి వీరంగం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అధికార తృణమాల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు పవిత్రా రాయ్‌ను హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం మాల్దాలో పవిత్రా రాయ్ ప్రయాణిస్తున్న కారు.. సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ టీనేజర్ (18) అక్కడిక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తి (20) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత కారును ఆపకుండా పవిత్రా రాయ్ డ్రైవర్ వేగంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం గమనించిన స్థానికులు చుట్టుముట్టి కారును ఆపారు. పవిత్రా రాయ్ కారు దిగకుండా వీరంగం సృష్టించాడు. కారు లోపల నుంచే జనంపై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో కారులో పవిత్రా రాయ్‌తో పాటు ఐదుగురు ఉన్నారు. ఆదివారం రాత్రి పోలీసులు టీఎంసీ నేతను అరెస్ట్ చేశారు. ఆయనతో కలసి కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు పరారీలో ఉన్నారు. కాగా పవిత్రా రాయ్ కాల్పులు జరిపిన ఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. -
న్యాయాన్యాయాలు
మద్యం సేవించి కారు నడిపి ఒకరి ప్రాణం తీసి, మరో నలుగురిని గాయపరిచిన కేసు నుంచి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఈ కేసులో ఆయన నిర్దోషని బొంబాయి హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. సల్మాన్‌పై అభియోగాలను సందేహాతీతంగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్తుందా, లేదా అన్నది మరి కొన్ని రోజుల్లో తేలుతుంది. పదమూడేళ్ల సుదీర్ఘ కాలం నడిచిన ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. ఎన్నెన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొన్న మే నెలలో ఇదే కేసులో సల్మాన్‌ఖాన్‌కు అయిదేళ్ల జైలు శిక్ష పడింది. ఆ తీర్పు వెలువడిన రెండు గంటల్లోనే ఆయన తరఫున బొంబాయి హైకోర్టులో అప్పీల్ దాఖలు కావడం, పర్యవసానంగా రెండు రోజుల తాత్కాలిక బెయిల్ లభించడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత అది రెగ్యులర్ బెయిల్‌గా మారింది. సల్మాన్ దాఖలు చేసుకున్న అప్పీల్‌పైనే ప్రస్తుత తీర్పు వెలువడింది. బొంబాయి హైకోర్టు తీర్పుపై ఎన్నో వ్యాఖ్యానాలు వస్తున్నాయి. వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు...ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది న్యాయ శాస్త్ర సిద్ధాంత మౌలిక సూత్రం. కనుక తన ముందుకొచ్చిన కేసులో నిందితుడిపై సందేహాతీతమైన రీతిలో సాక్ష్యాలున్నప్పుడు మాత్రమే న్యాయస్థానం శిక్ష విధిస్తుంది. సాక్ష్యాలను ఎవరూ పుట్టించలేరు...ఉన్న సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ పకడ్బందీగా ఒక క్రమపద్ధతిలో అమర్చగలిగినప్పుడే నిందితులకు శిక్షపడటం సాధ్యమవుతుందని న్యాయ నిపుణులు చెప్పే మాట. సల్మాన్ సెలబ్రిటీ గనుకనే...ఆయనకు డబ్బూ, పలుకుబడీ ఉన్నాయి గనుకనే పోలీసులు, ప్రాసిక్యూషన్ కూడా ఈ కేసుపై తగినంత శ్రద్ధ పెట్టలేదని కొందరూ...ప్రవేశపెట్టిన కొన్ని సాక్ష్యాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదని మరికొందరూ అంటున్నారు. సుప్రీంకోర్టులో ఇంకా అప్పీల్‌కు అవకాశం ఉన్నది గనుక ఇలాంటి వాదనలకు అక్కడ తగిన జవాబు లభించగలదని ఆశించాలి. ఒకటి మాత్రం నిజం- ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు మొదటినుంచీ అనుమానాలకు తావిచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్‌ఖాన్ మద్యం సేవించి కారును వేగంగా నడిపాడని, తాను నివారించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని అదే కారులో ప్రయాణించిన సల్మాన్ అంగరక్షకుడు రవీంద్ర పాటిల్ చెప్పాడు. తమ సహచరుడే అయినా అతనికి రక్షణ కల్పించడంలో ముంబై పోలీసులు విఫలమయ్యారు. ఈలోగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా పాటిల్ మానసికంగా కుంగిపోయాడు. ఫలితంగా విధులకు సరిగా హాజరుకాకపోవడంతోపాటు నిలకడగా సాక్ష్యం ఇవ్వలేకపోయాడు. జబ్బుపడ్డాడు. చివరికి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. అతనిచ్చిన సాక్ష్యం విశ్వసనీయంగా లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. సల్మాన్ రక్త నమూనాలను సేకరించడంలో సైతం పోలీసులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదని న్యాయస్థానం భావించింది. అలాగే ఈ ప్రమాదం జరగడానికి ముందు ఒక బార్లో సల్మాన్, అతని స్నేహితులు మద్యం సేవించారనడానికి సమర్థనగా ప్రాసిక్యూషన్ చూపిన బార్ బిల్లులను సాక్ష్యంగా పరిగణించడానికి న్యాయమూర్తి నిరాకరించారు. వీటి సేకరణలో తగిన పంచనామా జరగలేదని ఎత్తిచూపారు. అలాగే ప్రమాదం జరిగిన సమయంలో కారులోనే ఉన్న సల్మాన్ మిత్రుడు కమాల్ ఖాన్‌ను వెనువెంటనే ఎందుకు ప్రశ్నించలేకపోయారో, అతని సాక్ష్యాన్ని ఎందుకు సేకరించలేకపోయారో పోలీసులు చెప్పలేకపోయారు. ఆ తర్వాతనైనా అతణ్ణి రప్పించడానికి ముంబై పోలీసులు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. కీలక సాక్షుల సాక్ష్యాలను తీసుకోలేకపోవడమే కాదు...గాయపడినవారి వాంగ్మూలాల్లో వైరుధ్యాలు లేకుండా చూడటంలోనూ విఫలమయ్యారు. ఘటన జరిగినప్పుడు సహజంగా ఏర్పడే దిగ్భ్రమలో బాధితులు తలొకరకంగా చెప్పవచ్చు. కానీ వాటిని సరిచూసుకోవడంలో పోలీసులు, ప్రాసిక్యూషన్ కూడా శ్రద్ధపెట్టాలి. ఈ కేసులో అది జరగలేదు. పోలీసులు, ప్రాసిక్యూషన్ వైపున ఇన్ని లోపాలుండటంతోపాటు సల్మాన్ తరఫున ఉద్దండులైన న్యాయవాదులు వివిధ దశల్లో సల్మాన్ కేసు వాదించారు. మన న్యాయస్థానాల్లో నానాటికీ అసంఖ్యాకంగా కేసులు పెరిగిపోవడాన్ని కూడా ఈ సందర్భంగా చర్చించుకోవాలి. సివిల్ కేసుల సంగతలా ఉంచి క్రిమినల్ కేసులు ఇలా ఏళ్లతరబడి పెండింగ్ పడటంవల్ల వాటి తీవ్రత, ఔచిత్యం మరుగునపడుతున్నాయి. ఇది ఆందోళనకరమైన విషయం. కింది కోర్టుల్లో దాదాపు రెండు కోట్ల క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఒక అధ్యయనం వెల్లడిస్తోంది. ఈ కేసుల్లో 2 కోట్ల 22 లక్షలమంది విచారణను ఎదుర్కొంటున్నారు. ఇది నెదర్లాండ్స్, కజకిస్థాన్ వంటి దేశాల జనాభా కంటే ఎక్కువ! సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో క్రిమినల్ కేసులు 19శాతం ఆక్రమిస్తున్నాయి. హైకోర్టులకొచ్చేసరికి ఇది 23 శాతంగా ఉంది. ఒకపక్క ఇవి ఇలా పెండింగ్‌లో ఉండగానే కొత్త కేసులు నిత్యం వరదలా వచ్చి పడుతుంటాయి. వెనువెంటనే క్రిమినల్ కేసుల్ని విచారించే వ్యవస్థ లేనప్పుడు, అంతులేని జాప్యం చోటు చేసుకున్నప్పుడు బాధితులకు న్యాయం లభించకపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. సల్మాన్ దోషా, కాదా అన్న సంగతిని అలా ఉంచితే...సుదూరంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌నుంచి పొట్టచేతబట్టుకుని ముంబై వచ్చిన కూలీలు మాత్రం అన్యాయమైపోయారు. గాయపడిన నలుగురూ కూలీ చేయడం, కుటుంబాలను పోషించుకోవడం మాటలా ఉంచి తమ పనులు తాము చేసుకోవడానికే ఇబ్బందులు పడుతున్నారు. వారికి తగిన పరిహారం లభించేలా చూడటం అందరి బాధ్యత. -
సల్మాన్ కేసు జూలై 13 కి వాయిదా
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన పై తదుపరి విచారణను బాంబే హైకోర్టు జులై 13కు వాయిదా వేసింది. 2002 హిట్ అండ్ రన్ కేసులో దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సెషన్స్ కోర్టు తీర్పుపై ఆయన అప్పీలుకు వెళ్లారు. అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను, పరిశీలించడానికి మూడు వారాల గడువు కావాలని సల్మాన్ తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ కోరారు. దీనిపై స్పందించిన కోర్టు బుధవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సల్మాన్ అభ్యర్థనను తప్పుబట్టారు. మరింత కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తున్నారని వాదించారు. కాగా ముంబై నడివీధుల్లో తాగి కారు నడిపి ఇద్దరు వ్యక్తుల మరణానికి దారి తీసిన కేసులో నటుడు సల్మాన్ ఖాన్ ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే సెషన్స్ కోర్టు తీర్పును సస్పెండ్ చేసి, కేసును మళ్లీ విచారించాలని ఆదేశించిన బాంబే హైకోర్టు.. మే 8న సల్మాన్‌కు బెయిల్ మంజూరుచేసింది. -
పోలీస్ స్టేషన్ ఎదుటే హిట్ అండ్ రన్: టీసీఎస్ ఉద్యోగిని మృతి
ముంబై: పోలీస్ స్టేషన్ ఎదుటే వాహనంతో ఓ యువతిని ఢీకొట్టి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ప్రమాద స్థలంలోనే పడిఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. 20 నిమిషాల తర్వాత పోలీసులకు సమాచారం రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. బుధవారం రాత్రి ముంబై గోర్గాన్ ప్రాంతం (తూర్పు)లోని వన్రాయ్ పోలీస్ స్టేషన్ ఎదుట జరిగిన ఈ హిట్ అండ్ రన్ ఘటనలో టాటా కన్సల్టెన్సీ ఉద్యోగిని అర్చనా పాండ్య (22) మరణించింది. అందేరిలో నివసిస్తున్న అర్చన విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం వేచి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆమెను ఢీకొట్టిన వాహనం వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసుల ఫోన్ చేసి ప్రమాద జరిగిన విషయాన్ని తనకు చెప్పారని అర్చన సోదరుడు సిద్ధార్థ పాండ్య చెప్పారు. తానుఏ ఆస్పత్రికి వెళ్లే సమయానికి అర్చన మరణించినట్టు వైద్యులు తెలిపారంటూ సిద్ధార్థ కన్నీటీపర్యంతమయ్యాడు.