మద్యం సేవించి కారు నడిపి ఒకరి ప్రాణం తీసి, మరో నలుగురిని గాయపరిచిన కేసు నుంచి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఈ కేసులో ఆయన నిర్దోషని బొంబాయి హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. సల్మాన్‌పై అభియోగాలను సందేహాతీతంగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్తుందా, లేదా అన్నది మరి కొన్ని రోజుల్లో తేలుతుంది. పదమూడేళ్ల సుదీర్ఘ కాలం నడిచిన ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. ఎన్నెన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొన్న మే నెలలో ఇదే కేసులో సల్మాన్‌ఖాన్‌కు అయిదేళ్ల జైలు శిక్ష పడింది. ఆ తీర్పు వెలువడిన రెండు గంటల్లోనే ఆయన తరఫున బొంబాయి హైకోర్టులో అప్పీల్ దాఖలు కావడం, పర్యవసానంగా రెండు రోజుల తాత్కాలిక బెయిల్ లభించడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత అది రెగ్యులర్ బెయిల్‌గా మారింది. సల్మాన్ దాఖలు చేసుకున్న అప్పీల్‌పైనే ప్రస్తుత తీర్పు వెలువడింది.
బొంబాయి హైకోర్టు తీర్పుపై ఎన్నో వ్యాఖ్యానాలు వస్తున్నాయి. వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు...ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది న్యాయ శాస్త్ర సిద్ధాంత మౌలిక సూత్రం. కనుక తన ముందుకొచ్చిన కేసులో నిందితుడిపై సందేహాతీతమైన రీతిలో సాక్ష్యాలున్నప్పుడు మాత్రమే న్యాయస్థానం శిక్ష విధిస్తుంది. సాక్ష్యాలను ఎవరూ పుట్టించలేరు...ఉన్న సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ పకడ్బందీగా ఒక క్రమపద్ధతిలో అమర్చగలిగినప్పుడే నిందితులకు శిక్షపడటం సాధ్యమవుతుందని న్యాయ నిపుణులు చెప్పే మాట. సల్మాన్ సెలబ్రిటీ గనుకనే...ఆయనకు డబ్బూ, పలుకుబడీ ఉన్నాయి గనుకనే పోలీసులు, ప్రాసిక్యూషన్ కూడా ఈ కేసుపై తగినంత శ్రద్ధ పెట్టలేదని కొందరూ...ప్రవేశపెట్టిన కొన్ని సాక్ష్యాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదని మరికొందరూ అంటున్నారు.
సుప్రీంకోర్టులో ఇంకా అప్పీల్‌కు అవకాశం ఉన్నది గనుక ఇలాంటి వాదనలకు అక్కడ తగిన జవాబు లభించగలదని ఆశించాలి. ఒకటి మాత్రం నిజం- ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు మొదటినుంచీ అనుమానాలకు తావిచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్‌ఖాన్ మద్యం సేవించి కారును వేగంగా నడిపాడని, తాను నివారించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని అదే కారులో ప్రయాణించిన సల్మాన్ అంగరక్షకుడు రవీంద్ర పాటిల్ చెప్పాడు. తమ సహచరుడే అయినా అతనికి రక్షణ కల్పించడంలో ముంబై పోలీసులు విఫలమయ్యారు. ఈలోగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా పాటిల్ మానసికంగా కుంగిపోయాడు. ఫలితంగా విధులకు సరిగా హాజరుకాకపోవడంతోపాటు నిలకడగా సాక్ష్యం ఇవ్వలేకపోయాడు. జబ్బుపడ్డాడు. చివరికి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. అతనిచ్చిన సాక్ష్యం విశ్వసనీయంగా లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. సల్మాన్ రక్త నమూనాలను సేకరించడంలో సైతం పోలీసులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదని న్యాయస్థానం భావించింది. అలాగే ఈ ప్రమాదం జరగడానికి ముందు ఒక బార్‌లో సల్మాన్, అతని స్నేహితులు మద్యం సేవించారనడానికి సమర్థనగా ప్రాసిక్యూషన్ చూపిన బార్ బిల్లులను సాక్ష్యంగా పరిగణించడానికి న్యాయమూర్తి నిరాకరించారు. వీటి సేకరణలో తగిన పంచనామా జరగలేదని ఎత్తిచూపారు.
అలాగే ప్రమాదం జరిగిన సమయంలో కారులోనే ఉన్న సల్మాన్ మిత్రుడు కమాల్ ఖాన్‌ను వెనువెంటనే ఎందుకు ప్రశ్నించలేకపోయారో, అతని సాక్ష్యాన్ని ఎందుకు సేకరించలేకపోయారో పోలీసులు చెప్పలేకపోయారు. ఆ తర్వాతనైనా అతణ్ణి రప్పించడానికి ముంబై పోలీసులు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. కీలక సాక్షుల సాక్ష్యాలను తీసుకోలేకపోవడమే కాదు...గాయపడినవారి వాంగ్మూలాల్లో వైరుధ్యాలు లేకుండా చూడటంలోనూ విఫలమయ్యారు. ఘటన జరిగినప్పుడు సహజంగా ఏర్పడే దిగ్భ్రమలో బాధితులు తలొకరకంగా చెప్పవచ్చు. కానీ వాటిని సరిచూసుకోవడంలో పోలీసులు, ప్రాసిక్యూషన్ కూడా శ్రద్ధపెట్టాలి. ఈ కేసులో అది జరగలేదు. పోలీసులు, ప్రాసిక్యూషన్ వైపున ఇన్ని లోపాలుండటంతోపాటు సల్మాన్ తరఫున ఉద్దండులైన న్యాయవాదులు వివిధ దశల్లో సల్మాన్ కేసు వాదించారు.
మన న్యాయస్థానాల్లో నానాటికీ అసంఖ్యాకంగా కేసులు పెరిగిపోవడాన్ని కూడా ఈ సందర్భంగా చర్చించుకోవాలి. సివిల్ కేసుల సంగతలా ఉంచి క్రిమినల్ కేసులు ఇలా ఏళ్లతరబడి పెండింగ్ పడటంవల్ల వాటి తీవ్రత, ఔచిత్యం మరుగునపడుతున్నాయి. ఇది ఆందోళనకరమైన విషయం. కింది కోర్టుల్లో దాదాపు రెండు కోట్ల క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఒక అధ్యయనం వెల్లడిస్తోంది. ఈ కేసుల్లో 2 కోట్ల 22 లక్షలమంది విచారణను ఎదుర్కొంటున్నారు. ఇది నెదర్లాండ్స్, కజకిస్థాన్ వంటి దేశాల జనాభా కంటే ఎక్కువ! సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో క్రిమినల్ కేసులు 19శాతం ఆక్రమిస్తున్నాయి.
హైకోర్టులకొచ్చేసరికి ఇది 23 శాతంగా ఉంది. ఒకపక్క ఇవి ఇలా పెండింగ్‌లో ఉండగానే కొత్త కేసులు నిత్యం వరదలా వచ్చి పడుతుంటాయి. వెనువెంటనే క్రిమినల్ కేసుల్ని విచారించే వ్యవస్థ లేనప్పుడు, అంతులేని జాప్యం చోటు చేసుకున్నప్పుడు బాధితులకు న్యాయం లభించకపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. సల్మాన్ దోషా, కాదా అన్న సంగతిని అలా ఉంచితే...సుదూరంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌నుంచి పొట్టచేతబట్టుకుని ముంబై వచ్చిన కూలీలు మాత్రం అన్యాయమైపోయారు. గాయపడిన నలుగురూ కూలీ చేయడం, కుటుంబాలను పోషించుకోవడం మాటలా ఉంచి తమ పనులు తాము చేసుకోవడానికే ఇబ్బందులు పడుతున్నారు. వారికి తగిన పరిహారం లభించేలా చూడటం అందరి బాధ్యత.
న్యాయాన్యాయాలు
Published Fri, Dec 11 2015 12:39 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement