‘పెండింగ్‌’ పాపమిది! | editorial on judicial delays in india | Sakshi
Sakshi News home page

‘పెండింగ్‌’ పాపమిది!

Published Thu, Jan 19 2017 12:22 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

‘పెండింగ్‌’ పాపమిది! - Sakshi

‘పెండింగ్‌’ పాపమిది!

వన్యప్రాణులను వేటాడిన ఉదంతంలో 18 ఏళ్లుగా కేసుల బెడద ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌కు న్యాయస్థానాల నుంచి మరో తీపి కబురు వెలువడింది. ఆ వ్యవహారంలో చింకారాలను వేటాడిన కేసును నిరుడు జూలైలో రాజస్థాన్‌ హైకోర్టు కొట్టేయగా.. దానికి సంబంధించే ఆయుధాల చట్టం కింద నమోదైన కేసు సైతం ఇప్పుడు జోద్‌పూర్‌ సెషన్స్‌ కోర్టులో వీగిపోయింది. రెండు కృష్ణజింకలను వేటాడటానికి సంబంధించిన కేసు మాత్రం ఇక మిగిలింది. మన న్యాయస్థానాల పేరెత్తగానే అందరికీ గుర్తొచ్చేది ‘పెండింగ్‌’. ఏళ్లూ పూళ్లూ గడుస్తున్నా వ్యాజ్యాల విచారణ సాగుతూనే ఉండటం... అసంఖ్యాకంగా ఉండే కక్షిదారులు న్యాయం కోసం ఎదురుచూస్తూ జీవితం గడపాల్సిరావడం ఈ దేశంలోనే కనిపించే విలక్షణ వ్యవహారం.

వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు... ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది న్యాయశాస్త్ర మౌలిక సిద్ధాంతం. మంచిదే. కానీ దశా బ్దాల తరబడి కేసులు వాయిదా పడుతూ పోతుంటే సాక్ష్యాలు తారుమారై దోషులు తప్పించుకునే పరిస్థితులుంటాయి. కొన్ని సందర్భాల్లో నిర్దోషులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గాల్సివస్తుంది. 1996లో ఉగ్రవాదిగా ముద్రపడి అరెస్టయిన కశ్మీర్‌ బాలుడు మహ్మద్‌ ఆమీర్‌ఖాన్‌ ఇందుకు ఉదాహరణ. అతను దాదాపు 14 ఏళ్లు విచారణ పేరుతో రోహ్తక్‌ జైల్లో ఉండి చివరకు 2012లో 31 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాడు. మహిళలపై నేరాలు పెరగడానికి కూడా కేసుల విచా రణలో జాప్యం చోటు చేసుకోవడమే కారణం.

నటుడు సల్మాన్‌ఖాన్‌పై దాఖలైన కేసులు జటిలమైనవేమీ కాదు. షూటింగ్‌ నిమిత్తం జో«ద్‌పూర్‌ అడవులకొచ్చిన సల్మాన్‌... ఇతర నటీనటులతో కలిసి వన్య ప్రాణులను వేటాడారన్నది అభియోగం. ఆ వేట మాంసంతో వారంతా విందు చేసుకున్నారని కూడా ఆరోపణలొచ్చాయి. అటవీ శాఖ ఫిర్యాదుతో పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. ఇది 1998 అక్టోబర్‌నాటి సంగతి. చింకారాలను వేటాడి చంపిన కేసులో 2006లో కింది కోర్టు సల్మాన్‌కు మొత్తంగా అయిదున్నరేళ్ల శిక్ష విధించింది. దాన్ని సవాల్‌ చేస్తూ, తాను నిర్దోషినంటూ సల్మాన్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే... ఆ శిక్షను పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌చేసింది. ఆ కేసు లోనే నిరుడు రాజస్థాన్‌ హైకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఇప్పుడు ఆయుధాల చట్టం కేసులోనైనా, నిరుడు నిర్దోషిగా ప్రకటించిన జింకల వేట కేసులో నైనా ప్రాసిక్యూషన్‌ సాక్షులను ప్రవేశపెట్టకపోలేదు.

వాస్తవానికి ఈ కేసును మొద టగా అటవీ శాఖ సిబ్బంది దృష్టికి తెచ్చింది కంకాణి గ్రామ పౌరులు. జీపులో నిలబడి జింకలను గురిచూసి కాలుస్తుండగా చూసిన పూనంచంద్, చూగారాం అనే ఇద్దరు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై ఆ జీపును వెంబడించడం, వారి వెనకే గ్రామ స్తులంతా గుంపుగా రావడం గమనించి సల్మాన్‌ తదితరులు తప్పించుకున్నారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. బిష్ణోయ్‌ కులస్తులు అధికంగా ఉండే కంకాణి జింకల సంరక్షణలో ఎప్పుడూ ముందే ఉంటుంది. బయటినుంచి ఆ అటవీ ప్రాంతానికొచ్చే వారందరినీ వారు అనుమానదృక్కులతో చూస్తారనే పేరుంది. అప్పట్లో  ఫోరెన్సిక్‌ నిపుణులు వేట మాంసాన్ని వండిన హోటల్‌లో జింకల రక్తపు మరకల్ని సేకరించడంతోపాటు వాటి చర్మాలను, ఎముకలను పాతి పెట్టిన చోటును కూడా గుర్తించారని వార్తలొచ్చాయి.

ఆ సాక్ష్యాధారాలన్నీ ఇప్పుడు ఏమ య్యాయన్న ప్రశ్నలు సామాన్యులను వెంటాడక మానవు. ఏదైనా కేసు విచారణ దశాబ్దాల తరబడి సాగితే వచ్చే సమస్య ఇదే. విలువైన సాక్ష్యాధారాలు గల్లంతయినా కావొచ్చు. ఆ కేసు వ్యవహారాలను చూసేవారిలో నిస్తేజం అలుము కుంటుంది. సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చేవారు ఇలా ఏళ్ల తరబడి న్యాయ స్థానాల చుట్టూ తిరగలేక దానిలో ఆసక్తి కోల్పోతారు. తమ ముందుకు వచ్చిన కేసులో ఎలాంటి సాక్ష్యాలున్నాయి... అందులో విశ్వసించదగ్గవి ఏమిటన్న అంశాల పైనే న్యాయ స్థానాలు దృష్టి పెడతాయి.

సాక్షులు ఎదురుతిరిగితే, కేసులో ఉన్న అభియోగాలకు అనుగుణమైన సాక్ష్యాధారాలు కొరవడితే కేసుల్ని కొట్టేయడం మినహా వాటికి గత్యంతరం లేదు.  ముంబై మహా నగరంలో తాగి కారు నడుపుతూ ఒకరి ప్రాణం తీసి, మరో నలుగురిని గాయపరిచిన కేసు నుంచి కూడా సల్మాన్‌ ఖాన్‌ 2015లో ఇలాగే విముక్తుడయ్యాడు. ఆ కేసులో సైతం ప్రాసిక్యూషన్‌ ఎంతో బలహీనంగా వ్యవహరించింది. సల్మాన్‌కు అంగరక్షకుడిగా ఉండి అదే కారులో ప్రయాణించిన రవీంద్రపాటిల్‌ సల్మాన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. తాను వారిస్తున్నా తాగి ఉన్న సల్మాన్‌ పెను వేగంతో వాహనాన్ని నడిపాడని వాంగ్మూలం ఇచ్చాడు. కానీ రవీంద్రపాటిల్‌కు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమ య్యారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నిరంతరాయంగా వచ్చిన ఒత్తిళ్ల కారణంగా పాటిల్‌ మానసికంగా కుంగిపోయాడు. చివరకు జబ్బుపడి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు.   

మన దేశంలో పెండింగ్‌ కేసుల్ని పరిష్కరించడం కోసం చర్యలు తీసుకోక పోలేదు. లోక్‌ అదాలత్‌లు, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు అందులో భాగమే. న్యాయ మూర్తుల ఖాళీల భర్తీ విషయంలో అటు ప్రభుత్వం వైపునుంచీ, ఇటు న్యాయ వ్యవస్థ వైపునుంచీ లోపాలున్నాయి. వీటన్నిటి పర్యవసానంగా  కేసుల భారం నానాటికీ పెరుగుతున్నదే తప్ప తరగడం లేదు. కింది స్థాయి కోర్టుల్లో దాదాపు 3 కోట్ల వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయని ఒక అంచనా. ఈ పరిస్థితి ఎందు కొచ్చిందన్న సమీక్ష ఉండటం లేదు.

అమెరికా, చైనా వంటి దేశాల్లో కేసులు మూడు నాలుగు నెలల్లో పరిష్కారం అవుతుండగా ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా దశాబ్దాల తరబడి పెండింగ్‌ పడుతున్నాయి. ఇందువల్ల డబ్బు, పలుకుబడి ఉన్న వారు తప్పించుకుంటున్నారు. నేరం చేసినా ఏమీ కాదన్న అభిప్రాయం బలపడితే అది సమాజ మనుగడకు ముప్పు కలిగిస్తుంది.  ఇప్పుడు సల్మాన్‌ కేసులో వెలు వడిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్తానంటున్న రాజస్థాన్‌ ప్రభుత్వం ఇలాంటి కేసులు మరెన్ని దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయో ముందుగా ఆరా తీయాలి. దిద్దు బాటు చర్యలు తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement