సల్మాన్‌కు జైలు | Prison to Salman | Sakshi
Sakshi News home page

సల్మాన్‌కు జైలు

Published Thu, May 7 2015 1:17 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

కోర్టుకు బయలుదేరే ముందు ఇంటి వద్ద నాన్న సలీమ్ ఖాన్, అమ్మ సుశీలతో సల్మాన్ ఖాన్ - Sakshi

కోర్టుకు బయలుదేరే ముందు ఇంటి వద్ద నాన్న సలీమ్ ఖాన్, అమ్మ సుశీలతో సల్మాన్ ఖాన్

సంపాదకీయం
 మద్యం సేవించి కారు నడిపి ఒకరి మరణానికి, నలుగురు గాయపడటానికి కారణమైన కేసులో పదమూడేళ్ల సుదీర్ఘకాలం తర్వాత బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు జైలుశిక్ష పడింది. అయిదేళ్ల జైలుశిక్ష విధిస్తూ ముంబై సెషన్స్ కోర్టు బుధవారం వెలువరించిన తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి వీలుగా బొంబాయి హైకోర్టు రెండురోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ అప్పీల్‌పై బొంబాయి హైకోర్టు తీసుకునే నిర్ణయాన్నిబట్టి సల్మాన్ వెంటనే జైలుకు వెళ్లాల్సివస్తుందా, లేదా అన్నది తేలుతుంది.  రెండేళ్లక్రితం బాలీవుడ్‌కే చెందిన మరో సుప్రసిద్ధ హీరో సంజయ్‌దత్ మారణాయుధాలు కలిగివున్న కేసులో దోషిగా నిర్ధారణై ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్నారు. సమాజంలో ప్రముఖులుగా ఉన్న వ్యక్తులకు ఏం జరిగినా దానికి ఎంతో ప్రచారం లభిస్తుంది. అందునా సినిమా మాధ్యమం ప్రజాబాహుళ్యాన్ని సమ్మోహనపరిచే శక్తివంతమైన సాధనం గనుక ఆ రంగంలో నంబర్ వన్‌గా వెలిగిపోతున్న సల్మాన్‌ఖాన్‌కు శిక్షపడిందంటే అది అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకోవడంలో వింతేమీ లేదు. అందువల్లే పార్లమెంటులో బుధవారం కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ  ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు కురిపించినా... సరుకులు, సేవల పన్నుల (జీఎస్‌టీ)కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంతో చర్చ జరిగి, దాన్ని లోక్‌సభ ఆమోదించినా ఆ రెండు పరిణామాలకూ చానెళ్లలో పెద్దగా ప్రచారం లభించలేదు.

 న్యాయస్థానాల్లో ఈ కేసు పదమూడేళ్లు కొనసాగింది. దీన్ని ఏ సెక్షన్‌కింద విచారించాలో తేలడానికే కింది కోర్టులో పదేళ్లుపట్టింది. ‘నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్’ ఆరోపణలపై తొలుత ఈ కేసును విచారించిన ముంబై మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు...ఇది పదేళ్ల గరిష్ట శిక్ష పడగల భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 304(2)కింద విచారించదగ్గ నేరంగా నిర్ణయించి సెషన్స్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ సెక్షన్‌తోపాటు మోటారు వాహనాల చట్టంలోని వివిధ సెక్షన్లకింద కూడా సల్మాన్‌పై విచారణసాగింది. డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా కారు నడపడం, ఆ సమయంలో మద్యం సేవించి ఉండటం, ప్రమాదం జరిగాక తన బాధ్యతను నిర్వర్తించకపోవడం వంటివన్నీ సల్మాన్‌కు వ్యతిరేకంగా మారాయి. ఈ సందర్భంలో ఏడేళ్లక్రితం మాజీ నావికాదళ ప్రధానాధికారి మనవడు సంజీవ్ నందాకు ఇదే తరహా కేసులో పడిన శిక్షను ప్రస్తావించుకోవాలి. 1999లో అతను తప్పతాగి పోలీస్ చెక్ పాయింట్‌పై నుంచి కారును పోనిచ్చి ముగ్గురు కానిస్టేబుళ్లతోసహా ఆరుగురి మరణానికి కారకుడయ్యాడు. ఆ కేసునుంచి బయటపడటానికి అతను చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తొమ్మిదేళ్లపాటు ఆ కేసు కొనసాగాక చివరకు 2008లో అతనికి అయిదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. సంజీవ్ నందాలాగే సల్మాన్‌ఖాన్ కూడా కేసులో నిర్దోషిగా బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ క్రమంలోనే కేసు విచారణ సుదీర్ఘకాలం నడిచింది. ప్రస్తుతం వెలువడిన తీర్పుపై ఇప్పటికే సల్మాన్ తరఫు న్యాయవాదులు అప్పీల్ దాఖలు చేశారు. అక్కడ ఏమవుతుందన్న సంగతిని పక్కనబెడితే ఈ కేసు మన న్యాయవ్యవస్థ నిష్పాక్షికతకూ, నిక్కచ్చితనానికీ ప్రతీకగా నిలుస్తుంది. వేధించే ఉద్దేశంతో పెట్టిన కేసులేమిటో, నిజంగా నిందితుల ప్రమేయం ఉన్న కేసులేమిటో విశ్లేషించి నిరపరాధులకు శిక్ష పడకుండా, అపరాధులు ఎంతటివారైనా సరే చట్టంనుంచి తప్పించుకోకుండా చూడటంలో మన న్యాయ స్థానాలకు మంచి చరిత్ర ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో తాను వాహనాన్ని నడపడంలేదని సల్మాన్ చెప్పినా...తానే నడిపానని ఆయన డ్రైవర్ ఒప్పుకున్నా ఇతరేతర సాక్ష్యాలు అందుకు బలాన్ని చేకూర్చనందున న్యాయస్థానం దాన్ని విశ్వసించలేదు. ఈ కేసులో బాధితులుగా ఉన్నవారంతా నిరుపేదలు. కుటుంబాలను పోషించుకోవడానికి ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి వలసవచ్చి దిక్కులేని స్థితిలో పేవ్‌మెంట్‌ను నివాసంగా చేసుకున్నవారు.

 అయితే ఈ కేసులో పదమూడేళ్ల క్రితం బాధితులకు లభించిన పరిహారం సరిపోతుందని న్యాయస్థానం భావించడమే సరిగా లేదన్న విమర్శలున్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురూ తమ రోజువారీ పనులు చేసుకోవడమే కష్టంగా ఉన్న స్థితిలో కుటుంబాలను పోషించుకోవడం ఇబ్బందికరమే. సల్మాన్‌ఖాన్‌కు విధించిన శిక్ష మాటెలా ఉన్నా ఆ కుటుంబాలకు తగు మొత్తంలో పరిహారం లభించివుంటే బాగుండేది. ఈ ప్రమాదం జరిగేనాటికి వ్యక్తిగా సల్మాన్ వేరు. అప్పటికే ఆయనపై 1998లో రాజస్థాన్‌లో కృష్ణజింకను వేటాడి కాల్చిచంపిన కేసు నమోదై ఉంది. ఆ కేసుపై కూడా ఇంకా తీర్పు వెలువడాల్సి ఉంది. ముంబైలో జరిగిన ప్రమాదం తర్వాత ఆయన తీరులో చాలా మార్పు వచ్చింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం, అసహాయస్థితిలో ఉన్నవారిని ఆర్థికంగా ఆదుకోవడంవంటివి చేశారు. వేలాది కుటుంబాలు ఆయనపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నాయి. సహజంగానే ఇదంతా తీర్పుపై వ్యక్తమైన అభిప్రాయాల్లో ప్రతిబింబించింది. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టుగా మన శిక్షాస్మృతిలో ఇలాంటి విచక్షణకు తావులేదు. రోడ్డు ప్రమాదాలు మన దేశంలో ఏటా దాదాపు లక్షన్నరమంది ఉసురు తీస్తున్నాయి. మన పక్కనున్న చైనా ఈ తరహా ప్రమాదాలను తగ్గించడంలో గణనీయంగా విజయం సాధించినా మన దేశంలో మాత్రం అవి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఇందుకు రోడ్లు సరిగా లేకపోవడం దగ్గర నుంచి ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు చేయడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడంవరకూ ఎన్నో కారణాలున్నాయి. సల్మాన్‌ఖాన్ వంటి సెలబ్రిటీ ప్రమేయం ఉన్న కేసులో వెలువడిన ప్రస్తుత తీర్పు ఈ తరహా ప్రమాదాల నియంత్రణకూ, పౌరుల్లో అందుకు సంబంధించిన అవగాహనకూ దోహదపడగలదని ఆశించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement