ఎట్టకేలకు న్యాయం
మతం పేరిట గుజరాత్లో 2002లో చోటుచేసుకున్న మారణకాండకు సంబంధించి మరో కీలకమైన కేసులో గురువారం బొంబాయి హైకోర్టు వెలువరించిన తీర్పు నిజమైన దోషులు న్యాయదేవత నుంచి ఎన్నటికీ తప్పించుకోలేరన్న భరోసాను కలిగిస్తుంది. 12మందికి కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఖరారు చేయడమేకాక, ఆ కోర్టు నిర్దోషులుగా తేల్చిన మరో ఏడుగురు కూడా శిక్షార్హులేనని తీర్పునిచ్చింది. శిక్షపడినవారిలో ఒకరు ఇప్పటికే చనిపోయారు. బతుకు భయంతో తమ తమ నివాసాలను వదిలి ట్రాక్టర్‌పై పిల్లా పాపలతో వెళ్తున్న పౌరులను వేటాడి, వెంటాడి చంపిన ఘాతుకమిది.
దాదాపు 30మంది దుండ గుల విచ్చుకత్తులకు నలుగురు మహిళలు, నలుగురు పిల్లలు సహా 14మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్మార్గులు బిల్కిస్ బానో అనే మహిళను, ఆమె తల్లిని మరో ఇద్దరు మహిళలను దారుణంగా హింసించి అత్యాచారం చేశారు. మిగిలిన ముగ్గురూ అక్కడికక్కడే మరణిస్తే బిల్కిస్ బానో చచ్చిపడినట్టు నటిం చింది. దాంతో వారు ఆమెను పొదల్లోకి విసిరేసి నిష్క్రమించారు. ఆ తర్వాత ఆమె ఒకటిన్నర దశాబ్దంపాటు న్యాయస్థానాలే వేదికగా మొక్కవోని పోరాటం చేసిన పర్యవసానంగా ప్రస్తుత కేసులో దుండగులకు శిక్షలు ఖరారయ్యాయి.
స్వాతంత్య్రానంతరం ఈ దేశంలో జరిగిన మత కల్లోలాల్లో గుజరాత్ నర మేధం అతి పెద్ద నెత్తుటి అధ్యాయం. 2002 ఫిబ్రవరిలో గోధ్రాలో శబర్మతీ ఎక్స్‌ప్రెస్ బోగీలకు కొందరు దుండగులు నిప్పు పెట్టి 58మంది ప్రయాణికులను సజీవ దహనం చేసిన ఘాతుకం ఈ నరమేధానికి నాంది పలికింది. సజీవ దహనం ఉదంతం కార్చిచ్చులా వ్యాపించి ఆ రాష్ట్రం మతకల్లోలాలతో అట్టుడికి పోయింది. ముస్లింలు మాత్రమే కాదు... హిందువులు సైతం ఆనాటి మార ణహోమాన్ని చూసి భీతి చెంది ప్రాణాలు అరచేత పెట్టుకుని సురక్షితమనుకున్న ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు.
మనిషిలో మానవాంశ లోపిస్తే ఎంతటి ఉప ద్రవం సంభవిస్తుందో ఆ నెత్తుటి అధ్యాయం కళ్లకు కట్టింది. కొన్ని రోజులపాటు ఉన్మాద మూకలు స్వైర విహారం చేసి సాగించిన ఆ ఊచకోతలో చట్టబద్ధ పాలన కనుమరుగైంది. పదిహేనేళ్లు గడిచినా ఈనాటికీ ఆ మారణహోమాన్ని తల్చుకుని విలపించని, వణికిపోని వారుండరంటే బాధితుల్ని అదెంతగా భీతావహుల్ని చేసిందో అర్ధం చేసుకోవచ్చు. అయినవాళ్లను, ఆసరాను కోల్పోయి దిక్కులేని పక్షుల్లా మిగిలినవారు అనంతరకాలంలో బెదిరింపులకు లోనయ్యారు. ప్రలోభాలు వచ్చిపడ్డాయి.
ఫలితంగా బాధితుల్లో కొందరు మౌనంగా ఉండిపోయారు. కనుకనే ఈ కేసులో ప్రధాన సాక్షిగా, బాధితురాలిగా ఉన్న బిల్కిస్ బానో ధైర్యసాహసాలకు చేతులెత్తి మొక్కాలి. ఆమెకు అయినవాళ్లెవరూ లేరు. నిరుపేద మహిళ. ఆ విషాదం చోటుచేసుకునే నాటికి ఆమె వయసు 19 ఏళ్లు. ఆరునెలల గర్భిణి. ఆ మాట చెప్పినా దుండగులు వదల్లేదు. చెంతనున్న ఆమె పాపను బండకేసి బాది చంపారు. ఊరినుంచి 14మంది బంధువులతోపాటు మొత్తం 17మంది బయల్దేరితే మారణకాండ తర్వాత తనతో ఆరు, మూడు సంవత్స రాలున్న ఇద్దరు పసివాళ్లు మాత్రమే మిగిలారు. ఒంటిపై దుస్తులు కూడా సరిగాలేవు.
అలాంటి స్థితిలో ఒక ఆదివాసీ మహిళ ఇచ్చిన బట్టలు వేసుకుని హోంగార్డు సాయంతో దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె నిరక్షరాస్యతను ఆసరా చేసుకుని వారు ఆ ఫిర్యాదును తారుమారు చేశారు. పోస్టుమార్టం నివేదికలకు సైతం ఆ గతే పట్టింది. ఆమె చెప్పే మాటల్లో నిలకడలేదని పోలీసులు తేల్చారు. మేజిస్ట్రేట్ కోర్టు కూడా ఆమె ఫిర్యాదును సమర్ధించే సాక్ష్యాధారాలు లేవని కేసు కొట్టేసింది. ఈ అన్యాయంపై బిల్కిస్ బానో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పర్య వసానంగా ఆమె ఫిర్యాదులో దర్యాప్తు చేయదగ్గ అంశాలున్నాయన్న నిర్ధారణకు సుప్రీంకోర్టు వచ్చింది. ఆ బాధ్యతను సీబీఐకి అప్పగించింది. ఈలోగా ఖననం చేసిన ఎనిమిది మృతదేహాల తలలను మాయం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో కేసు విచారణను గుజరాత్ నుంచి ముంబైకి మార్చాలని సుప్రీంకోర్టు నిర్ణ యించింది. విచారణ అనంతరం కింది కోర్టులో నిందితుల్లో 12మందికి యావజ్జీవ శిక్ష పడింది. అయిదుగురు పోలీసు అధికారులు, పోస్టుమార్టం నిర్వహించిన ఇద్దరు వైద్యులు నిర్దోషులని తీర్పు వచ్చింది. వారికి సైతం శిక్ష పడాలన్న పట్టుదలతో బిల్కిస్ బానో పోరాడింది. ఆ విషాద క్షణాలను మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటూ అన్నిటినీ ఆమె న్యాయస్థానం ముందుంచింది. ఫలితంగా ఈ ఏడుగురు సైతం దోషులేనని బొంబాయి హైకోర్టు ఇప్పుడు నిర్ధారించింది. అయితే విచారణ సమయంలో జైల్లో ఉన్న కాలాన్ని పరిగణనలోకి తీసుకుని శిక్షా కాలం నుంచి మినహాయింపునిచ్చి, రూ. 20,000 చొప్పున వారికి జరిమానా విధించింది.
ఒక పేదింటి మహిళ తానే అన్నీ అయి చేసిన పోరాటం...దాన్ని గుర్తించి ఆ అన్యాయాన్ని సరిదిద్దాలన్న కృతనిశ్చయంతో పనిచేసిన న్యాయవ్యవస్థ పౌరులకు ధైర్యాన్నిస్తాయి. ఈ వ్యవస్థపై విశ్వాసాన్ని కలగజేస్తాయి. సీబీఐ కూడా ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసింది. పకడ్బందీ సాక్ష్యాధారాలు సేకరించింది. అయితే కేసు విచారణకు 15 ఏళ్లు పట్టడం విచారం కలిగిస్తుంది. ఎలాంటి సిద్ధాంతాలూ లేని, తెలియని నిరాధార మహిళ అన్ని సంవత్సరాలపాటు న్యాయస్థానాల చుట్టూ, న్యాయవాదుల చుట్టూ తిరగడమన్నది ఎంత కష్టభూయిష్టమైనదో సులభంగానే అంచనా వేసుకోవచ్చు.
ఆమె ఏమాత్రం నిరాశానిస్పృహలకు లోనైనా ఆ మానవ మృగాలు చట్టంనుంచి సులభంగా తప్పించుకునేవే. కానీ బిల్కిస్ బానో వారికా అవకాశం ఇవ్వలేదు. నిలబడింది. తనలో ఉన్న నమ్మకాన్ని కాపాడుకుంది. కను కనే ఎంతో ఆలస్యమైనా గెలిచింది. నరమేధం కేసుల్లో బిల్కిస్ బానో మాదిరే మరెందరో న్యాయం కోసం నిరీక్షిస్తున్నారు. వారందరికీ సాధ్యమైనంత త్వరగా న్యాయం దక్కాలని... ప్రజాస్వామిక, రాజ్యాంగ విలువలపై, మానవతా విలువ లపై దాడి చేసినవారికి కఠిన శిక్షలు పడాలని ఆశిద్దాం.