మరోసారి ఉన్మాదం పంజా విసిరింది. దాని బాధితులు ఈసారి దళితులు. ఒక పక్క గుజరాత్‌లోని ఉనా పట్టణంలో గోహత్యకు పాల్పడ్డారన్న సాకుతో నలుగురు దళిత యువకులను అత్యంత దుర్మార్గంగా హింసించిన ఉదంతంపై గుజరాత్ అట్టుడుకుతుండగా...దాని ప్రకంపనలు పార్లమెంటును తాకి ఆ అంశంపై చర్చ జరుగుతుండగా బీఎస్పీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్‌సింగ్ మొరటు వ్యాఖ్యలు చేశారు. ఉనాలో సాగిన దౌష్ట్యం మాటలకందనిది. సమాజం మొత్తం సిగ్గుతో తలొంచు కోవాల్సిన అమానుషమది. యువకులపై ఇనుపరాడ్లు, కట్టెలు, కొరడాలతో దాడి చేయడమే కాక, వారిని ఒక వ్యాన్‌కు కట్టి ఈడ్చుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తీసు కెళ్లారు. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు గుడ్లప్పగించి చూస్తూ ఉండి పోయారు.
దీనికి సంబంధించి 16మంది ఉన్మాదులను అరెస్టు చేసినట్టు ప్రకటించిన కాసేపటికి అదే రాష్ట్రంలో రెండు నెలలక్రితం అచ్చం ఈ తరహాలోనే జరిగి, ఇంతవరకూ ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాని వేరే ఉదంతం బయటి కొచ్చింది. ఇవన్నీ గుజరాత్‌వ్యాప్తంగా దళితులను ఏకం చేశాయి. నిరసనలు మిన్నంటాయి. 17మంది యువకులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమించింది. అసహాయులపై సాగుతున్న ఈ దాడులను ఒక ధోరణిగా కాక, విడిగా చూడటం...కేవలం ఎన్నికల లెక్కలతో ముడిపెట్టుకుని ఆలోచించడం పర్యవసానంగానే ఈ దుర్మార్గాలు పదే పదే చోటుచేసుకుంటున్నాయని పాలకులు గుర్తించలేకపోతున్నారు. గతంలో కొందరు కేబినెట్ మంత్రులు, ఎంపీలు సంస్కా రాన్ని మరిచి ముస్లింలపైనా, మహిళలపైనా చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని సృష్టించాయో అందరికీ తెలుసు. అలాగే నిరుడు సెప్టెంబర్‌లో యూపీలో గోమాంసం ఉన్నదన్న సాకుతో ఒక ముస్లిం కుటుంబంపై రాత్రివేళ వందమందికి పైగా దాడిచేసి ఆ కుటుంబాన్ని కొట్టి హింసించడంతోపాటు ఆ కుటుంబ పెద్ద అఖ్లాక్‌ను పొట్టనబెట్టుకున్నారు. ఆ తర్వాత అదే తరహాలో హిమాచల్, జమ్మూ కశ్మీర్‌లాంటి రాష్ట్రాల్లో గోవుల్ని వధ్యశాలలకు తరలిస్తున్నారన్న అనుమానంతో దాడిచేసి హతమార్చిన ఉదంతాలు కనీసం అరడజను చోటుచేసుకున్నాయి. దాడుల సంగతి సరేసరి. ఈమధ్యే అఖ్లాక్ కుటుంబ సభ్యులపై గోమాంసం ఇంట్లో దాచుకున్నారంటూ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ పరిణామాలన్నీ అట్టడుగు వర్గాల్లో అభద్రతను సృష్టిస్తున్నాయని... పరిస్థితి అదుపుతప్పుతోందని గుర్తించి ఉండా ల్సింది. కానీ జరిగింది వేరు. నిరసనలు తీవ్రమయ్యాకనో, పార్లమెంటు కార్య కలాపాలు స్తంభించినప్పుడో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవారిని పిలిచి మందలించారు. దీనివల్ల ఫలితమేమీ ఉండటం లేదని అగ్ర నాయకత్వం గ్రహించ లేకపోయింది. అమిత్ షా పిలిచి నచ్చజెప్పాక బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ‘మేమూ నాయకులమే. మందలించడానికీ, నోర్మూసుకోమని చెప్పడానికీ చిన్న పిల్లలం కాదు...’అంటూ నిష్టూరంగా మాట్లాడారు. అప్పటికి ఎంతో కొంత కట్టడి చేశాం కదా అని నాయకత్వం సరిపెట్టుకున్నది. అయితే వీడియోలకూ, మీడి యాకూ ఎక్కని ఉదంతాలు ఇంకెన్ని ఉన్నాయో!
గుజరాత్‌లో యువకుల్ని హింసించిన ఉదంతం ఒక కొత్త ధోరణికి నాంది పలికింది. ఇకపై తాము పశు కళేబరాలను తాకబోమని దళిత ఉద్యమకారులు శపథం చేశారు. తమ నిర్ణయాన్ని వెనువెంటనే ఆచరణలో పెట్టారు. ఇది దళిత నేతల పిలుపు పర్యవసానంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఒక దుర్మార్గం రగిల్చిన ఆగ్రహాగ్ని నుంచి పుట్టింది. అంతేకాదు... గోవును రక్షిస్తామని చెప్పుకుంటున్న వారు, దాన్ని పవిత్రంగా భావిస్తున్నామని అంటున్నవారూ వాటి మృత కళేబ రాలకు అంతిమ సంస్కారం చేయాలని ఉద్యమకారులు సవాల్ విసిరారు. ఒక్క ఉనా పట్టణంలోనే రోజుకు మూడు ఆవులు అనారోగ్యంతో మరణిస్తాయని చిత్ర హింసలకు గురైన యువకుల తండ్రి చెబుతున్నాడు. జిల్లా కేంద్రమైన సురేంద ర్‌నగర్‌లో ఉన్న పెద్ద గోసంరక్షణ శాలలో 4,000 గోవులుంటే ఈ రెండురోజుల్లో ఏడు మరణించాయి. ఆ కళేబరాలు తొలగించేవారు లేక అక్కడే పడి ఉన్నాయి. మరో 50 గోవులవరకూ అనారోగ్యంతో ఉన్నాయని, అవి ఎప్పుడైనా చనిపోతా యని నిర్వాహకులు చెబుతున్నారు. ఇవిగాక దళితులు కావాలని పట్టణంలో కొన్నిచోట్ల వదిలి వెళ్లిన పశు కళేబరాలతో దుర్గంధం వ్యాపించింది. వాటిని తొలగించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో క్రేన్లను ఉపయోగిస్తున్నారు. దళితులు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల మధ్య ఆ పనులు చేయవలసి వస్తు న్నదో... అందువల్ల మొత్తం సమాజం ఎంతటి ఉపకారాన్ని పొందుతున్నదో ఇప్పుడు అందరికీ అర్ధమై ఉండాలి.
బీజేపీ నేత మాయావతిని దూషించడాన్నీ, గుజరాత్‌లో బయటపడిన ఉదంతాలనూ వేర్వేరుగా చూడలేం. ఇవన్నీ అగ్రకుల దురహంకారం పర్యవసానమే. అదేకాకుంటే ఒక పెద్ద రాష్ట్రానికి సీఎంగా పనిచేయడమేకాక... ప్రధానమైన రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్న మహిళపై దయాశంకర్ సింగ్ అలాంటి వ్యాఖ్య చేయగలుగుతారా? ఆ వ్యాఖ్య చేసిన కొన్ని గంటల్లోనే ఆయనను అరెస్టు చేయాల్సింది పోయి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల వ్యవధి తర్వాత మేల్కొంది. తీరా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాడు. సమయం, సందర్భం చూసుకుని...తగిన ఏర్పాట్లు చేసుకుని ఆయన ఎటూ లొంగిపోతాడు. బీజేపీ తన వంతుగా చర్యలు తీసుకుంది. ఆయన్ను పార్టీనుంచి ముందు సస్పెండ్‌చేసి, తీవ్రతను గ్రహించాక బహిష్కరిస్తున్నట్టు తెలిపింది. ఇవన్నీ కొంపలంటుకున్నాక బావి తవ్వడం మొదలెట్టడంలాంటి పనులు. ఇలాంటి అరకొర చర్యలతో సరిపెట్టక ఇప్పటికైనా సమస్య మూలాలు ఎక్కడున్నాయో, ఏ ధోరణులు దీనికి దారి తీస్తున్నాయో సమగ్రంగా విశ్లేషించుకోవాలి. లోపాలను సవరించుకోవాలి. ఎన్నికల్లో కోల్పోయే సీట్లు, ఓట్లూ కాదు...సమాజం ఏమైపోతుందోనన్న ఆదుర్దా కనబరచాలి.