attacks on dalits
-
దళిత కుటుంబంపై కర్ణాటక మంత్రి దాడి
బెంగుళూరు: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ మంత్రి డి. సుధాకర్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు కర్ణాటక పోలీసులు. ఓ ఆస్తి వివాదానికి సంబంధించిన కేసులో మంత్రి దళిత కుటుంబంపై దాడి చేశారంటూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. సుబ్బమ్మ, ఆశ అనే ఇద్దరు మహిళలు ఎఫ్ఐఆర్లో తెలిపిన వివరాల ప్రకారం మంత్రి సుధాకర్ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కలిసి బెంగళూర్ యలహంక ప్రాంతానికి చేరుకుని మహిళలు నివాసముండే స్థలంలోని ఆస్తులను కూల్చే ప్రయత్నం చేశారు. జేసీబీ వాహనంతో సహా వచ్చిన ఆ గుంపులో సుమారు 40 మంది ఉండగా వారిలో 15 మంది మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. సంఘటనా స్థలంలో ఇళ్ల పైకప్పులు ప్రహారి గోడలను కూలుస్తుండగా దళితులైన తల్లీ కూతుళ్లు సుబ్బమ్మ, ఆశ వచ్చి వారిని నిలదీయగా ఆ గుంపు కులం పేరుతో దూషిస్తూ వీరిపై దాడికి పాల్పడ్డారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దీంతో మంత్రి సుధాకర్‌పైనా ఆయన అనుచరులు శ్రీనివాస్, భాగ్యమ్మల తో సహా మరో 35 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసినట్టు తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలుస్తుంది -
దళితులపై దాడులను ఉపేక్షించం
తప్పు ఎవరు చేసినా తప్పే. అందుకే వ్యవస్థలో మార్పులు రావాలనే ఈ చర్యలు తీసుకున్నాం. అలాంటి ఘటనలు జరిగినప్పుడు మన బంధువులే బాధితులైతే.. ఉపేక్షిస్తామా? ఇలాంటి ప్రశ్నలు మనకు మనం వేసుకుని నిష్పక్షపాతంగా ఎంతటి వారిపై అయినా చర్యలు తీసుకుంటున్నాం. ఈ సందేశం సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ స్థాయి వరకు వెళ్లాలి. దీనిపై ఎస్పీలు చొరవ చూపాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : దళితులపై దాడులను, అనైతిక చర్యలను ఉపేక్షించేది లేదని, బాధ్యులు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. దళితులపై దాడులకు సంబంధించి పోలీసు అధికారులపై కూడా కేసు నమోదు చేసి జైలుకు పంపించామని, ఈ సందేశం కింది స్థాయి పోలీసు వరకూ తీసుకు వెళ్లాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. గతంలో దళితులపై జరగరానివి జరిగితే ఎక్కడా కూడా ఇలాంటి చర్యలు తీసుకోలేదని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా దళితులపై ఇటీవల దాడులను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ‘స్పందన’పై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు తప్పు ఎవరు చేసినా తప్పే ► దళితుల మీద దాడులు సహా ఇతరత్రా ఘటనలు జరిగినప్పుడు గతంలో పట్టించుకునే వారు కాదు. కానీ ఇలాంటి ఘటనల విషయంలో ఈ ప్రభుత్వం ఊరకే చూస్తూ కూర్చోబోదు. తప్పు ఎవరు చేసినా తప్పే. మన ప్రభుత్వ ఆలోచనలో ఉన్న స్పష్టత ఇది. ► ఏదైనా తప్పు చేస్తే.. ఎస్ఐని కూడా జైల్లో పెట్టిన ఘటన గతంలో జరగలేదు. ఎస్ఐ తప్పు చేసినా, సీఐ తప్పు చేసినా కూడా ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకుంది. నాలుగైదు చోట్ల ఇలా చర్యలు తీసుకున్నాం. ► పోలీస్ శాఖలో కింది స్థాయి వరకు ఓరియెంటేషన్ రావాలి. ఎస్పీలు, ఏఎస్పీలు, డీఎస్పీలు ఆ ఓరియెంటేషన్ నిర్వహించాలి. మానవత్వం గురించి, ప్రజల హక్కుల గురించి అవగాహన కలిగించాలి. ► ఏదో జరిగిందని తీసుకు రావడం, గుండు కొట్టించడం లాంటి ఘటనలు తప్పు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకూడదు. కొంచెం కష్టమైనా కఠినంగా వ్యవహరిస్తున్నాం ► అలాంటి ఘటనలు ఇంకా జరుగుతున్నాయి కాబట్టే, వ్యవస్థలో మార్పు కోసం కొంచెం కష్టమైనా.. నేను, హోం మంత్రి, డీజీపీ, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ కఠినంగా వ్యవహరించాల్సి వస్తోంది. ► మన రాష్ట్ర హోం మంత్రి దళితురాలు. మన డీజీపీ ఒక ఎస్టీ. ఇలాంటప్పుడు సమాజంలో దిగువన ఉన్న వారికి మనం రక్షణగా నిలబడాల్సిన బాధ్యత ఉంది. ► మన వాళ్ల మీద మనం చర్యలు తీసుకోవాలంటే నాతో సహా ఎస్పీలందరికీ బాధే. అయితే ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూడాలి. ► మద్యం, ఇసుక అక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల జోక్యం సహించొద్దు. అక్రమంగా మద్యం తయారీ, రవాణా, ఇసుక అక్రమాలను అరికట్టడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఎక్కడా తప్పులు జరగకూడదు. అవినీతికి ఆస్కారం ఉండకూడదు. అధికారులు బాగా పని చేస్తున్నారు. -
‘నన్ను చంపుతామని బెదిరించారు’
దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలపై మతం ఆధారంగా జరుగుతున్న మూకహత్యలు, దాడులపై సినీపరిశ్రమతో పాటు వేర్వేరు రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు గళమెత్తిన సంగతి తెలిసిందే. ఇలా సంతకం చేసిన వారిలో నటుడు కౌషిక్ సేన్ కూడా ఉన్నారు. అయితే మూక హత్యల గురించి మాట్లాడిన తనను చంపుతామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు కౌశిక్ సేన్. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. మూక హత్యల గురించి మరోసారి మాట్లాడితే.. చాలా తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది అంటూ బెదిరించడం ప్రారంభించాడు. అప్పుడు అతనితో నేను ‘చావడానికి కూడా సిద్ధమే కానీ నా ఆలోచనను మార్చుకోను. ఇలాంటి కాల్స్ నన్ను భయపెట్టలేవు’ అని స్పష్టం చేశాను’ అన్నాడు కౌశిక్ సేన్. అంతేకాక ఆ నంబర్‌ను పోలీసులకు ఇచ్చినట్లు తెలిపాడు. ‘అధిక వర్గాలకు జై శ్రీరాం పవిత్రమైనది.. దానిని అపవిత్రం చేయడం మానేయండి. దళితులు, క్రైస్తవులు, ముస్లింలపై జరుగుతున్న అమానుష ఘటనలను, ఊచకోతలను వెంటనే అరికట్టాలి. 2016లో ఇలాంటివి దాదాపు 840 కేసులు నమోదయిన విషయాన్ని నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) తెలిపింది. ఇది చూసి మేము చాలా అశ్చర్యపోయాము. జై శ్రీరాం నినాదం ఇప్పుడు దేశంలో హింసాత్మకంగా మారింది. ఈ దీన స్థితికి మేము చింతిస్తున్నాము’ అని లేఖలో పేర్కొన్నారు. -
మతవిద్వేష దాడుల్ని ఆపండి!
కోల్‌కతా/న్యూఢిల్లీ: దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలపై మతం ఆధారంగా జరుగుతున్న మూకహత్యలు, దాడులపై సినీపరిశ్రమతో పాటు వేర్వేరు రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు గళమెత్తారు. ఈ మూకహత్యలను వెంటనే అరికట్టేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని ప్రముఖ దర్శకులు మణిరత్నం, అదూర్ గోపాలకృష్ణన్, అనురాగ్ కశ్యప్, శ్యామ్‌బెనగల్ నటీనటులు అపర్ణాసేన్, కొంకణ్‌సేన్ శర్మ, రేవతి, సౌమిత్రో ఛటర్జీ, గాయని శుభా ముగ్దల్, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ, సామాజిక కార్యకర్త బినాయక్ సేన్, సామాజికవేత్త ఆశిష్ నంది సహా 49 మంది బహిరంగ లేఖ రాశారు. కోల్‌కతాలో నటి అపర్ణాసేన్ ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. అందులో.. ‘‘మోదీజీ.. మనదేశంలో ఇటీవల చోటుచేసుకుంటున్న దురదృష్టకరమైన సంఘటనలపై మేమంతా కలత చెందుతున్నాం. మనది శాంతికాముక దేశం. కానీ దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీ మతస్తులను చంపేస్తున్నారు. దీన్ని నిలువరించాలి. ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు చూసి విస్తుపోయాం. ఎందుకంటే ఒక్క 2016లోనే దళితులపై 840 దాడి ఘటనలు నమోదయ్యాయి. 9 ఏళ్లలో మతవిద్వేష దాడులు అమాంతం పెరిగిపోగా, అందులో 62 శాతం మంది బాధితులు ముస్లింలే. 2009, జనవరి 1 నుంచి 2018 అక్టోబర్ 29 వరకూ దేశవ్యాప్తంగా 254 మత విద్వేష ఘటనలు నమోదుకాగా, వీటిలో 91 మంది చనిపోయారు. ఈ విద్వేషదాడుల్లో 90 శాతం 2014, మే తర్వాతే(మోదీ వచ్చాకే) నమోదయ్యాయి. ఈ నేరాల్లో శిక్షలు పడుతున్న కేసులు గణనీయంగా తగ్గిపోవడం ఇంకా దారుణం. మోదీజీ.. మీరు పార్లమెంటులో ఈ మూకహత్యలను ఖండించారు. కానీ అది మాత్రమే సరిపోదు. హత్య కేసుల్లో పెరోల్ లేకుండా జీవితఖైదు పడుతున్నప్పుడు అంతకంటే దారుణమైన మూకహత్యలకు అదే శిక్ష ఎందుకు వర్తించదు? ఇలాంటి ఘటనల్లో దోషులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏ దేశంలో కూడా ప్రజలు భయంతో బతకకూడదు. మెజారిటీ ప్రజలు శ్రీరాముడిని ఆరాధిస్తారు. కానీ, ‘జై శ్రీరామ్’ రెచ్చగొట్టే యుద్ధ నినాదంగా మారిపోయింది. ఆయన పేరుతో హత్యలు చేయడానికి ఇది మధ్యయుగం కాదు. ప్రధానిగా ఈ దుశ్చర్యలను నిలువరించాలి. మతవిద్వేష దాడులతో శ్రీరాముడి పేరును అపవిత్రం చేయడం ఆపండి. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా, జాతివ్యతిరేకులుగా, అర్బన్ నక్సల్స్‌గా ముద్రవేయడం సరికాదు. అధికార పార్టీని విమర్శిస్తే∙దేశాన్ని వ్యతిరేకించినట్లు కాదు. ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కును రాజ్యాంగం కల్పిస్తోంది. ఎక్కడైతే భిన్నాభిప్రాయాన్ని, అసమ్మతిని వినిపించేందుకు అవకాశముంటుందో అదే బలమైన దేశంగా రూపుదిద్దుకుంటుంది’’ అని లేఖలో పేర్కొన్నారు. అందరూ సురక్షితమే: నఖ్వీ భారత్‌లో ముస్లింలు దళితులు సహా మైనారిటీలంతా సురక్షితంగా ఉన్నారని కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. మూకహత్యలు, మతవిద్వేష దాడుల్ని అరికట్టాలని 49 మంది దర్శకులు, నటులు, ఇతర కళాకారులు ప్రధాని మోదీకి రాసిన లేఖను ఆయన తప్పుపట్టారు. నేరాలకు మతం రంగు పులమడం సరికాదని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి మతఘర్షణలు చోటు చేసుకోలేదని గుర్తుచేశారు. ‘‘2014 ఎన్నికల తర్వాత ‘అవార్డు వాపసీ’ పేరుతో ఇలాంటి కార్యక్రమాన్నే మనమంతా చూశాం. ఇది దానికి పార్ట్–2 మాత్రమే. విద్వేష నేరాలు, మూకహత్యలను అరికట్టడానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కానీ తమనుతాము మానవ హక్కుల పరిరక్షకులుగా, లౌకికవాదానికి కస్టోడియన్లుగా చెప్పుకునే కొందరు ఈ నేరాలకు మతం రంగుపులిమే ప్రయత్నం చేస్తున్నారు’’ అని నఖ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు!
న్యూఢిల్లీ : పంద్రాగస్టు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో ఆయన ఏఎన్ఐ, ది టైమ్స్ ఆఫ్ ఇండియాలకు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇందులో ఆయన ప్రధానంగా ఐదు అంశాల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఉద్యోగాల కల్పన, దేశ ఆర్థిక వ్యవస్థ, అస్సాంలో దేశ పౌరులను గుర్తిస్తూ ఎన్ఆర్సీ విడుదల చేసిన జాబితా, దేశంలో పెరిగిపోతున్న మూక హత్యలు, 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల గురించి ఆయన మాట్లాడారు. దేశాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన ‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయం’పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పరోక్షంగా కూడా ప్రస్తావించలేదు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఏటా కొత్తగా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ నరేంద్ర మోదీ విస్తృతంగా చేసిన ప్రచారం యువత మీద ప్రధాన ప్రభావం చూపింది. ఈ విషయంలో ప్రభుత్వం ఏ మేరకు విజయం సాధించిందని ఇంటర్వ్యూలో మీడియా ప్రశ్నించగా, ఉద్యోగాలు బాగానే కల్పిస్తున్నామని, అయితే ఎన్ని ఉద్యోగాలో లెక్క తేల్చి చెప్పడానికి డేటా అందుబాటులో లేదని ఆయన అన్నారు. డేటా లేనంత మాత్రాన ఉద్యోగాలు కల్పించడం లేదనుకుంటే పొరపాటని ఆయన అన్నారు. 68 లక్షల ఉద్యోగాలు కల్పించామని బెంగాల్ ప్రభుత్వం, 53 లక్షల ఉద్యోగాలు కల్పించామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించుకున్నాయని, అంటే ఇతర రాష్ట్రాలుగానీ, కేంద్రంగానీ ఉద్యోగాలు కల్పించడం లేదనుకోవాలా, అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాల చేస్తున్న ఆరోపణలు తప్ప మరేమీ కాదని ఆయన అన్నారు. దేశంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నట్లయితే గత జనవరి నెలలో ఓ టెలివిజన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ‘పకోడీలు అమ్ముకోవడం ఉపాధి’ కాదా? అని స్వయంగా ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చిందో మోదీకే తెలియాలి. ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ఆగస్టు 4వ తేదీన మీడియాతో మరాఠాల రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతూ ‘రిజర్వేషన్లే అంగీకరించామనుకోండి, వారికి ఇవ్వడానికి ఉద్యోగాలు ఎక్కడ? ఐటీ కారణంగా బ్యాంకుల్లో కూడా ఉద్యోగాలు బాగా తగ్గిపోయాయి. ప్రభుత్వ నియామకాలే పూర్తిగా స్తంభించిపోయాయి. ఇంకెక్కడా ఉద్యోగాలు?’ అంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ మోదీకి భిన్నంగా ప్రతిపక్షాల్లో, ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్నే గడ్కారీ ఎందుకు మాట్లాడారు? దళితులు, మైనారిటీలు, ఇతరులపై జరుగుతున్న మూక హత్యల గురించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దీనికి సంబంధించిన ప్రతి సంఘటన కూడా దురదృష్టకరమైనదేనని, వీటిని రాజకీయాలకు అతీతంగా చూడాలని అన్నారు. వీటిని తాను, తన పార్టీ స్పష్టంగా ఖండించామని, అందుకు సరైన ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. అలాంటప్పుడు మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా, మూక హత్య దోషులకు దండలు వేసి, ఎందుకు స్వాగతం చెప్పారు? మరో కేంద్ర మంత్రి, మూక హత్య కేసులో ఓ దోషి చనిపోతే ఆయన మృతదేహంపై జాతీయ పతాకాన్ని ఎందుకు కప్పారు? వారి ప్రవర్తనను మోదీ ఎందుకు ఖండించలేదు? ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల గురించి మోదీ మాట్లాడుతూ, ప్రతిపక్షాలది ఓటు బ్యాంకు రాజకీయాలని, స్వార్థ పూరిత రాజకీయాలని, అందుకోసమే వారంతా ఓ కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తమది మాత్రం కేవలం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కృషి చేసే ప్రభుత్వం, పార్టీ అని చెప్పారు. ఇలా అధికారం కోసం ఏకమయ్యే పార్టీలను ప్రజలు విశ్వసించరని, తమ పట్ల ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని, రానున్న ఎన్నికల్లో గతంలోకెల్లా ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తామని మోదీ చెప్పారు. అయినా ఎన్నికల ముందు పొత్తులకు, ఎన్నికల అనంతరం పొత్తులకు చాలా తేడా ఉంటుందని ఆయన అన్నారు. బీహార్‌లో ఎన్నికలకు ముందే ఆర్జేడీ, జేడీయూలు పొత్తు పెట్టుకొని అధికారంలోకి రాగా, ఎన్నికల అనంతరం ఆర్జేడీతో బంధాన్ని తెంపేయించి జేడీయూతో పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం అవడం స్వార్థపూరిత రాజకీయం కాదా? త్రిపుర, ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల అనంతరం అక్రమ పొత్తుల ద్వారా బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏమనాలి? తాము చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పా! -
మోదీది దళిత వ్యతిరేక ప్రభుత్వం: సురవరం
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చట్ట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోని పార్లమెంటు సమీపంలో సింహగర్జన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పలు పార్టీల నేతలు సహా, రాష్ట్రాల నుంచి దళిత సంఘా ల నేతలు హాజరయ్యారు. దీక్షలో పాల్గొన్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, అంటరానితనాన్ని బలపరుస్తోందని మండిపడ్డారు. గోరక్ష పేరు తో హింసను ప్రేరేపిస్తున్న బీజేపీ, దళితుల సంక్షేమా న్ని పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దీక్షలో పాల్గొన్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని షెడ్యూ ల్ 9లో చేర్చాలని చేస్తున్న డిమాండ్‌కు తమ మద్దతు ఉంటుందన్నారు. దీక్షను గురువారం కూడా నిర్వహించనున్నట్టు సమితి చైర్మన్ మందకృష్ణ తెలిపారు. సమితి కన్వీనర్లు అద్దంకి దయాకర్, జె.బి.రాజు, జి. చెన్నయ్య, బెల్లయ్య నాయక్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. -
ప్రతీకారేచ్ఛ ప్రమాదకరం
సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌పై ఇటీవల జరి గిన దాడిని సర్వత్రా ఖండించారు గానీ, నిజంగానే ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఆయన గత, ప్రస్తుత అభిప్రాయాలు, ఆచరణతో ఏకీభవించనివారికి తమ అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయనను వ్యతిరేకించడం కూడా తప్పు కాదు. కానీ అలా వ్యతిరేకించడానికి ముందు స్వామి అగ్నివేశ్ నేపథ్యంకేసి ఒకసారి పరిశీలించి తర్వాత వారు ఆ పని చేయాల్సి ఉంటుంది. మరొక వైపున, సంఘ్ బ్రిగేడ్‌కి చెందిన హిందుత్వ లంపెన్ శక్తుల నిరంతర హింసాత్మక దాడులతో నిస్పృహ చెందిన కొంతమంది వ్యక్తులు హిందుత్వ ముఠాకు గుణపాఠం చెప్పడానికి దళి తులు, ఓబీసీలు, ఆదివాసీలు, మైనారిటీలతో కూడిన ఐక్య సంఘటనకు పిలుపునిస్తున్నారు. ఈ బృందాలన్నీ కలిసి ఒక్కటై ఎదిరిస్తే హిందుత్వ బ్రిగేడ్ పలాయనం సాగించక తప్పదని కొంతమంది మిత్రులు అంటున్నారు. ఇలా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర హింసకు పాల్పడుతున్నవారిపై ప్రతి హింస కూడా అదే స్థాయిలో చేయడమే పరిష్కారమంటూ సోషల్ మీడియాలో ఒక స్నేహితుడు పేర్కొన్నాడు కూడా. అంటే వాళ్లు నీ కాళ్లు చేతులు విరగ్గొడితే నువ్వు కూడా వాళ్ల కాళ్లూ చేతులను విరగ్గొట్టాలి. వాస్తవానికి ఆరెస్సెస్ ప్రతిపాదిస్తున్న హిందుత్వ, దాని గర్వాతిశయం అనేవి అభద్రతతో కూడిన పరాజిత మనస్తత్వంలోంచే పుట్టుకొచ్చాయి. అందుకే హిందుత్వ భావన ఆవిర్భవించిన నాటినుంచి ప్రతి కూల స్వరాన్నే వినిపిస్తూ పోతోంది. ఈ నేపథ్యంలో హిందుత్వ లంపెన్ శక్తులకు అణగారిన వర్గాల ఐక్య కూటమి సరైన పాఠం చెప్పాలని వస్తున్న నూతన సవాలును సానుకూల ఎంపికగా చెప్పలేం. ఈ వైఖరి కూడా తాత్కాలిక ఉద్రేకాలతో పుట్టుకొచ్చే అపరిణత ఆగ్రహ ప్రకటన కంటే ఉత్తమమైనది కాదు. నిజానికి దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు ప్రస్తుతం ఆరెస్సెస్/బీజేపీకి మరీ దూరంగా ఏమీ లేరు. నయా ఉదారవాద, నయా సామ్రాజ్యవాద విధానాలకు మద్దతు తెలిపే విషయంలో దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు ఇప్పటికే ఆరెస్సెస్, బీజేపీ శక్తులతో చేయి కలిపారు. ఇక ముస్లిం మైనారిటీల విషయానికి వస్తే తమ ఒంటరితనంలో వారు ఎన్నాళ్లు కొనసాగుతూ ఆరెస్సెస్, బీజేపీ ద్వయాన్ని వ్యతిరేకిస్తుంటారనేది ప్రశ్నే. ఎందుకంటే ఇతర పౌరులలాగే వారు కూడా భారతీయులే మరి. మతపరమైన గుర్తింపుతోబాటు రాజకీయాధికారం విషయంలో వీరికి కూడా ఏదో ఒక మద్దతు అవసరం. దేశంలో షియా ముస్లిం తెగను ఆకర్షించడానికి ఆరెస్సెస్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఆలస్యంగా వచ్చినప్పటికీ ఆరెస్సెస్ ఈ విషయంలో నిలకడైన పనితీరును ప్రదర్శించడమే కాకుండా ఫలితాలు కూడా చూస్తోంది. నా రెండో అభిప్రాయం ఏదంటే, ఈ దేశంలోని మేధావులు హిందుత్వ లంపెన్ శక్తులకు గుణపాఠం చెప్పాలన్న పథకంతో అణగారిన వర్గాల ఐక్యసంఘటనకు ప్రయత్నిస్తున్నట్లయితే ఆనాడు లోహియా మరింత ప్రజాస్వామికంగా చేసిన సూచనను మనందరం గుర్తు తెచ్చుకోవాలి. అణగారిన వర్గాల మధ్య ఐక్యతా సూత్రాన్ని లోహియా ప్రతిపాదించారు. పైగా ఆధునిక ప్రపంచంలో ప్రత్యక స్థానం పొందగలిగే కొత్త భారతీయ నాగరికతను నిర్మించాలని ఆయన కలకన్నారు. ఆయన ప్రకారం భారతీయ జనాభాలో అధికభాగం వలసపాలనకు ముందటి బ్రాహ్మణిజం అంతస్తుల వ్యవస్థ నుంచి, వలసపాలనా కాలపు పెట్టుబడిదారీ భావజాలం నుంచి విముక్తి పొందారు. అలాంటి సామాజిక బృందాల సంఘీభావంతో ప్రజాస్వామ్యం ద్వారా రాజ్యాధికారాన్ని పొందగలిగితే ఒక కొత్త సమానతా వ్యవస్థ రూపు దిద్దుకుంటుంది. ఇది బ్రాహ్మణిజం, పెట్టుబడిదారీ విధానంకు పూర్తి భిన్నంగా ప్రపంచం ముందు సరికొత్త నమూనాను నెలకొల్పుతుంది. ఛాందసవాద మనస్తత్వంలో కూరుకుపోని ఈ అణగారిన ప్రజలను ఒకటిగా చేయడం ద్వారా సోషలిజం, కమ్యూనిజాన్ని దేశంలో నిర్మించవచ్చని లోహియా కలగన్నారు. ఈ మార్గంలోనే ఆయన ప్రత్యేక అవకాశాలు (రిజర్వేషన్) సూత్రాన్ని ప్రతిపాదించారు. కానీ లోహియా సూత్రాన్ని ప్రస్తుతం ఓట్ల రాజకీయాల కోసం సామాజిక న్యాయ చాంపియన్లు వాడుకుంటున్నారు. ఆరెస్సెస్, బీజేపీ కూడా ఇదేవిధమైన ఎత్తుగడలతో నడుస్తోంది. అణగారిన వర్గాల ప్రజల మధ్య సంఘీభావం హిందుత్వ లంపెన్ శక్తులకు గుణపాఠం చెప్పడం వైపుగా మరలాలని మన దేశ మేధావులు సూచిస్తున్నట్లయితే, ఓట్ల రాజకీయాలకు సంబంధించి కూడా ఇది వెనుకడుగు అనే చెప్పాలి. కార్పొరేట్ పెట్టుబడిదారీ విధానం దేశ నాయకులనే కాకుండా, మేధావులను కూడా తనచుట్టూ డ్యాన్స్ చేయిస్తోంది. హిందుత్వ లంపెన్ శక్తులకు ఈ రకంగా గుణపాఠం చెబుదామని అణగారిన వర్గాలకు పిలుపునిస్తున్న మేధావులు గతంలో సంపూర్ణంగా రిజర్వేషన్ వ్యతిరేకులైన అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్‌లకు మద్దతు పలికిన గుంపులో కలిశారని మనం మరవకూడదు. డాక్టర్ ప్రేమ్ సింగ్, హిందీ శాఖ, ఢిల్లీ యూనివర్సిటీ -
ఎందుకంత చిన్నచూపు?
సాక్షి, విజయవాడ: చంద్రబాబు పాలనలో దళితులకు రక్షణ కరువైందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో రోజుకు 12 మంది రైతులపై దాడులు జరుగుతున్నాయని, జాతీయ నేర గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. దళితులంటే చంద్రబాబుకు ఎందుకంత చిన్నచూపని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం దళితులను అంటరానివారిగా చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో ఆత్మహత్య చేసుకున్న దళిత ఉద్యోగి రవికుమార్ కుటుంబానికి ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని వెల్లడించారు. అతడి ఆత్మహత్యకు కారణమైన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. రవి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నా చార్జిషీట్లు దాఖలు చేయడం లేదన్నారు. చంద్రబాబు దళిత ద్రోహిగా మిగిలిపోతారని మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. -
చంద్రబాబు పాలనలో దళితులకు రక్షణ కరువు
-
‘దళితులపై దాడులను పట్టించుకోని సీఎం’
హైదరాబాద్: దళితులపై దాడులు జరుగుతున్నా వాటిని నిరోధించేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని గిరిజన విద్యార్థి సమాఖ్య (జీవీఎస్) నేత వడిత్యా శంకర్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. అమలాపురం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆవు చర్మాన్ని తొలగిస్తున్న దళితులపై అత్యంత దారుణంగా దాడి చేయడం నీచమైన చర్య అన్నారు. ప్రభుత్వం ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణించాలని ఆయన కోరారు. -
మళ్లీ రేగిన ఉన్మాదం
మరోసారి ఉన్మాదం పంజా విసిరింది. దాని బాధితులు ఈసారి దళితులు. ఒక పక్క గుజరాత్‌లోని ఉనా పట్టణంలో గోహత్యకు పాల్పడ్డారన్న సాకుతో నలుగురు దళిత యువకులను అత్యంత దుర్మార్గంగా హింసించిన ఉదంతంపై గుజరాత్ అట్టుడుకుతుండగా...దాని ప్రకంపనలు పార్లమెంటును తాకి ఆ అంశంపై చర్చ జరుగుతుండగా బీఎస్పీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్‌సింగ్ మొరటు వ్యాఖ్యలు చేశారు. ఉనాలో సాగిన దౌష్ట్యం మాటలకందనిది. సమాజం మొత్తం సిగ్గుతో తలొంచు కోవాల్సిన అమానుషమది. యువకులపై ఇనుపరాడ్లు, కట్టెలు, కొరడాలతో దాడి చేయడమే కాక, వారిని ఒక వ్యాన్‌కు కట్టి ఈడ్చుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తీసు కెళ్లారు. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు గుడ్లప్పగించి చూస్తూ ఉండి పోయారు. దీనికి సంబంధించి 16మంది ఉన్మాదులను అరెస్టు చేసినట్టు ప్రకటించిన కాసేపటికి అదే రాష్ట్రంలో రెండు నెలలక్రితం అచ్చం ఈ తరహాలోనే జరిగి, ఇంతవరకూ ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాని వేరే ఉదంతం బయటి కొచ్చింది. ఇవన్నీ గుజరాత్‌వ్యాప్తంగా దళితులను ఏకం చేశాయి. నిరసనలు మిన్నంటాయి. 17మంది యువకులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమించింది. అసహాయులపై సాగుతున్న ఈ దాడులను ఒక ధోరణిగా కాక, విడిగా చూడటం...కేవలం ఎన్నికల లెక్కలతో ముడిపెట్టుకుని ఆలోచించడం పర్యవసానంగానే ఈ దుర్మార్గాలు పదే పదే చోటుచేసుకుంటున్నాయని పాలకులు గుర్తించలేకపోతున్నారు. గతంలో కొందరు కేబినెట్ మంత్రులు, ఎంపీలు సంస్కా రాన్ని మరిచి ముస్లింలపైనా, మహిళలపైనా చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని సృష్టించాయో అందరికీ తెలుసు. అలాగే నిరుడు సెప్టెంబర్‌లో యూపీలో గోమాంసం ఉన్నదన్న సాకుతో ఒక ముస్లిం కుటుంబంపై రాత్రివేళ వందమందికి పైగా దాడిచేసి ఆ కుటుంబాన్ని కొట్టి హింసించడంతోపాటు ఆ కుటుంబ పెద్ద అఖ్లాక్ను పొట్టనబెట్టుకున్నారు. ఆ తర్వాత అదే తరహాలో హిమాచల్, జమ్మూ కశ్మీర్‌లాంటి రాష్ట్రాల్లో గోవుల్ని వధ్యశాలలకు తరలిస్తున్నారన్న అనుమానంతో దాడిచేసి హతమార్చిన ఉదంతాలు కనీసం అరడజను చోటుచేసుకున్నాయి. దాడుల సంగతి సరేసరి. ఈమధ్యే అఖ్లాక్ కుటుంబ సభ్యులపై గోమాంసం ఇంట్లో దాచుకున్నారంటూ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ పరిణామాలన్నీ అట్టడుగు వర్గాల్లో అభద్రతను సృష్టిస్తున్నాయని... పరిస్థితి అదుపుతప్పుతోందని గుర్తించి ఉండా ల్సింది. కానీ జరిగింది వేరు. నిరసనలు తీవ్రమయ్యాకనో, పార్లమెంటు కార్య కలాపాలు స్తంభించినప్పుడో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవారిని పిలిచి మందలించారు. దీనివల్ల ఫలితమేమీ ఉండటం లేదని అగ్ర నాయకత్వం గ్రహించ లేకపోయింది. అమిత్ షా పిలిచి నచ్చజెప్పాక బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ‘మేమూ నాయకులమే. మందలించడానికీ, నోర్మూసుకోమని చెప్పడానికీ చిన్న పిల్లలం కాదు...’అంటూ నిష్టూరంగా మాట్లాడారు. అప్పటికి ఎంతో కొంత కట్టడి చేశాం కదా అని నాయకత్వం సరిపెట్టుకున్నది. అయితే వీడియోలకూ, మీడి యాకూ ఎక్కని ఉదంతాలు ఇంకెన్ని ఉన్నాయో! గుజరాత్లో యువకుల్ని హింసించిన ఉదంతం ఒక కొత్త ధోరణికి నాంది పలికింది. ఇకపై తాము పశు కళేబరాలను తాకబోమని దళిత ఉద్యమకారులు శపథం చేశారు. తమ నిర్ణయాన్ని వెనువెంటనే ఆచరణలో పెట్టారు. ఇది దళిత నేతల పిలుపు పర్యవసానంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఒక దుర్మార్గం రగిల్చిన ఆగ్రహాగ్ని నుంచి పుట్టింది. అంతేకాదు... గోవును రక్షిస్తామని చెప్పుకుంటున్న వారు, దాన్ని పవిత్రంగా భావిస్తున్నామని అంటున్నవారూ వాటి మృత కళేబ రాలకు అంతిమ సంస్కారం చేయాలని ఉద్యమకారులు సవాల్ విసిరారు. ఒక్క ఉనా పట్టణంలోనే రోజుకు మూడు ఆవులు అనారోగ్యంతో మరణిస్తాయని చిత్ర హింసలకు గురైన యువకుల తండ్రి చెబుతున్నాడు. జిల్లా కేంద్రమైన సురేంద ర్‌నగర్‌లో ఉన్న పెద్ద గోసంరక్షణ శాలలో 4,000 గోవులుంటే ఈ రెండురోజుల్లో ఏడు మరణించాయి. ఆ కళేబరాలు తొలగించేవారు లేక అక్కడే పడి ఉన్నాయి. మరో 50 గోవులవరకూ అనారోగ్యంతో ఉన్నాయని, అవి ఎప్పుడైనా చనిపోతా యని నిర్వాహకులు చెబుతున్నారు. ఇవిగాక దళితులు కావాలని పట్టణంలో కొన్నిచోట్ల వదిలి వెళ్లిన పశు కళేబరాలతో దుర్గంధం వ్యాపించింది. వాటిని తొలగించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో క్రేన్లను ఉపయోగిస్తున్నారు. దళితులు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల మధ్య ఆ పనులు చేయవలసి వస్తు న్నదో... అందువల్ల మొత్తం సమాజం ఎంతటి ఉపకారాన్ని పొందుతున్నదో ఇప్పుడు అందరికీ అర్ధమై ఉండాలి. బీజేపీ నేత మాయావతిని దూషించడాన్నీ, గుజరాత్లో బయటపడిన ఉదంతాలనూ వేర్వేరుగా చూడలేం. ఇవన్నీ అగ్రకుల దురహంకారం పర్యవసానమే. అదేకాకుంటే ఒక పెద్ద రాష్ట్రానికి సీఎంగా పనిచేయడమేకాక... ప్రధానమైన రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్న మహిళపై దయాశంకర్ సింగ్ అలాంటి వ్యాఖ్య చేయగలుగుతారా? ఆ వ్యాఖ్య చేసిన కొన్ని గంటల్లోనే ఆయనను అరెస్టు చేయాల్సింది పోయి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల వ్యవధి తర్వాత మేల్కొంది. తీరా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాడు. సమయం, సందర్భం చూసుకుని...తగిన ఏర్పాట్లు చేసుకుని ఆయన ఎటూ లొంగిపోతాడు. బీజేపీ తన వంతుగా చర్యలు తీసుకుంది. ఆయన్ను పార్టీనుంచి ముందు సస్పెండ్‌చేసి, తీవ్రతను గ్రహించాక బహిష్కరిస్తున్నట్టు తెలిపింది. ఇవన్నీ కొంపలంటుకున్నాక బావి తవ్వడం మొదలెట్టడంలాంటి పనులు. ఇలాంటి అరకొర చర్యలతో సరిపెట్టక ఇప్పటికైనా సమస్య మూలాలు ఎక్కడున్నాయో, ఏ ధోరణులు దీనికి దారి తీస్తున్నాయో సమగ్రంగా విశ్లేషించుకోవాలి. లోపాలను సవరించుకోవాలి. ఎన్నికల్లో కోల్పోయే సీట్లు, ఓట్లూ కాదు...సమాజం ఏమైపోతుందోనన్న ఆదుర్దా కనబరచాలి. -
టీడీపీ అండతోనే దళితులపై దాడులు
సీపీఎం, దళిత, ప్రజా సంఘాల నేతల ఆరోపణ గుంటూరు సిటీ: జిల్లాలో దళితులపై దాడులు పెచ్చుమీరాయని సీపీఎం, దళిత, ప్రజాసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అధికార టీడీపీ అండదండలతోనే ఈ దాడులు జరుగుతున్నాయని, పోలీసులు కూడా వారికే కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. దీనికి రాజుపాలెం మండలం దేవరంపాడు ఘటనే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. బుధవారం వారు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేను కలసి జిల్లాలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. దళితులపై దాడులను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో మాట్లాడుతూ దేవరంపాడు ఘటనకు బాధ్యుడైన భూస్వామి బత్తుల జానకిరామయ్యను టీడీపీ అండదండలున్న కారణంగానే పోలీసులు అరెస్టు చేయలేదన్నారు. పెపైచ్చు జానకిరామయ్య ఫిర్యాదు ఆధారంగా కౌంటర్ కేసు నమోదు చేశారని చెప్పారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ ఘటన పూర్వాపరాలను తక్షణమే పరిశీలిస్తానని, సంఘటనా స్థలానికి జేసీ శ్రీధర్‌ను పంపి విచారణ జరిపిస్తానన్నారు. కలెక్టర్‌ను కలిసినవారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, న్యాయవాది వైకే, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గద్దె చలమయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి టి.కృష్ణమోహన్, సీపీఎం నేతలు ఎస్.ఆంజనేయులు నాయక్, నూతలపాటి కాళిదాసు, మాదిగ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు వై.సుధాకర్‌బాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.భగవాన్‌దాసు, బి.లక్ష్మణరావు, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు తదితరులు ఉన్నారు. దళిత సంఘాల అభినందన గుంటూరు సిటీ: నవ్యాంధ్రప్రదేశ్‌లో ఓటరు నమోదు కార్యక్రమంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టిన కలెక్టర్ కాంతిలాల్ దండేను మాల మహానాడు, ఎంఆర్పీఎస్ నేతలు బుధవారం అభినందించారు. ఆయనను కలిసినవారిలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కొర్రపాటి చెన్నకేశవులు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అడపా మోహన్మాదిగ, మాల మహానాడు నేతలు నీలా సురేష్, పిల్లి మేరీ, నేలపాటి గోపీకృష్ణ, ఎంఆర్పీఎస్ నేతలు శ్యామ్క్రిష్టాఫర్, అమృతలూరి కరుణకుమారి, దర్శనపు ఆశీర్వాదం, తెనాలి మనోహర్ తదితరులు ఉన్నారు. -
దళితులపై నిర్లక్ష్యం వద్దు
పీలేరు, న్యూస్‌లైన్: దళితులపై దాడి చేసి 16 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ముద్దాయిలందరినీ అరెస్ట్ చేయకపోవడంపై వ్యవసాయ వృత్తిదారుల యూని యన్ ఆధ్వర్యంలో శుక్రవారం పీలేరులో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. దళితులపై నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్ర స్థాయి లో ఆందోళన ఉధృతం చేస్తామని వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ జాతీయ నాయకుడు పి. చెన్నయ్య, జిల్లా నాయకుడు కె.గట్టప్ప హెచ్చరించారు. పీలేరు మండలం యర్రగుంట్లపల్లె పంచాయతీ మారెంరెడ్డిగారిపల్లె దళితులపై అగ్రవర్ణాల దాడికి నిరసనగా నాలుగు రోడ్ల కూడలి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు శుక్రవారం నిరసన ర్యాలీ చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిలో ఎనిమిది మందిని మాత్రమే అరెస్ట్ చేశారని, మిగిలిన నరేంద్రరెడ్డి, లక్ష్మీకర్, వెంకటేశ్వర్రాజును తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ, పోలీస్ అధికారుల నిర్లక్ష్యంతోనే దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో చట్టాన్ని అగ్రవర్ణాల వారు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారు గ్రామంలోనే తిరుగుతున్నా అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. దళితుల స్వేచ్ఛకు భంగం కల్గించి, వారి హక్కులను కాలరాస్తే రాష్ట్ర, జాతీయ స్థాయి మానవహక్కుల, ఎస్సీ, ఎస్టీ కమిషన్లను ఆశ్రయిస్తామన్నారు. అనంతరం తహశీల్దార్, పీలేరు సీఐకి వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ రాష్ట్ర మహిళా నాయకురాలు రాజమ్మ, ఏఐఎస్ఎఫ్ నాయకులు వెంకటేశు, శాంతి చక్ర ఇంటర్నేషనల్ యూనియన్ నాయకులు రామచంద్రయ్య, చంద్రయ్య, వివిధ మండలాల నాయకులు ఎం.సీతాపతి, చంద్రమ్మ, మల్లికార్జున, రమణమ్మ, రమణ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కమిటీ నాయకుడు జయన్న పాల్గొన్నారు.