పీలేరు, న్యూస్‌లైన్: దళితులపై దాడి చేసి 16 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ముద్దాయిలందరినీ అరెస్ట్ చేయకపోవడంపై వ్యవసాయ వృత్తిదారుల యూని యన్ ఆధ్వర్యంలో శుక్రవారం పీలేరులో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. దళితులపై నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్ర స్థాయి లో ఆందోళన ఉధృతం చేస్తామని వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ జాతీయ నాయకుడు పి. చెన్నయ్య, జిల్లా నాయకుడు కె.గట్టప్ప హెచ్చరించారు.
పీలేరు మండలం యర్రగుంట్లపల్లె పంచాయతీ మారెంరెడ్డిగారిపల్లె దళితులపై అగ్రవర్ణాల దాడికి నిరసనగా నాలుగు రోడ్ల కూడలి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు శుక్రవారం నిరసన ర్యాలీ చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిలో ఎనిమిది మందిని మాత్రమే అరెస్ట్ చేశారని, మిగిలిన నరేంద్రరెడ్డి, లక్ష్మీకర్, వెంకటేశ్వర్‌రాజును తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
రెవెన్యూ, పోలీస్ అధికారుల నిర్లక్ష్యంతోనే దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో చట్టాన్ని అగ్రవర్ణాల వారు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారు గ్రామంలోనే తిరుగుతున్నా అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. దళితుల స్వేచ్ఛకు భంగం కల్గించి, వారి హక్కులను కాలరాస్తే రాష్ట్ర, జాతీయ స్థాయి మానవహక్కుల, ఎస్సీ, ఎస్టీ కమిషన్లను ఆశ్రయిస్తామన్నారు.
అనంతరం తహశీల్దార్, పీలేరు సీఐకి వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ రాష్ట్ర మహిళా నాయకురాలు రాజమ్మ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు వెంకటేశు, శాంతి చక్ర ఇంటర్నేషనల్ యూనియన్ నాయకులు రామచంద్రయ్య, చంద్రయ్య, వివిధ మండలాల నాయకులు ఎం.సీతాపతి, చంద్రమ్మ, మల్లికార్జున, రమణమ్మ, రమణ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కమిటీ నాయకుడు జయన్న పాల్గొన్నారు.
దళితులపై నిర్లక్ష్యం వద్దు
Published Sat, Jan 18 2014 5:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement