
టీడీపీ అండతోనే దళితులపై దాడులు
సీపీఎం, దళిత, ప్రజా సంఘాల నేతల ఆరోపణ
గుంటూరు సిటీ: జిల్లాలో దళితులపై దాడులు పెచ్చుమీరాయని సీపీఎం, దళిత, ప్రజాసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అధికార టీడీపీ అండదండలతోనే ఈ దాడులు జరుగుతున్నాయని, పోలీసులు కూడా వారికే కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. దీనికి రాజుపాలెం మండలం దేవరంపాడు ఘటనే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. బుధవారం వారు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేను కలసి జిల్లాలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. దళితులపై దాడులను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌తో మాట్లాడుతూ దేవరంపాడు ఘటనకు బాధ్యుడైన భూస్వామి బత్తుల జానకిరామయ్యను టీడీపీ అండదండలున్న కారణంగానే పోలీసులు అరెస్టు చేయలేదన్నారు. పెపైచ్చు జానకిరామయ్య ఫిర్యాదు ఆధారంగా కౌంటర్ కేసు నమోదు చేశారని చెప్పారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ ఘటన పూర్వాపరాలను తక్షణమే పరిశీలిస్తానని, సంఘటనా స్థలానికి జేసీ శ్రీధర్‌ను పంపి విచారణ జరిపిస్తానన్నారు.
కలెక్టర్‌ను కలిసినవారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, న్యాయవాది వైకే, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గద్దె చలమయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి టి.కృష్ణమోహన్, సీపీఎం నేతలు ఎస్.ఆంజనేయులు నాయక్, నూతలపాటి కాళిదాసు, మాదిగ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు వై.సుధాకర్‌బాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.భగవాన్‌దాసు, బి.లక్ష్మణరావు, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు తదితరులు ఉన్నారు.
దళిత సంఘాల అభినందన
గుంటూరు సిటీ: నవ్యాంధ్రప్రదేశ్‌లో ఓటరు నమోదు కార్యక్రమంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టిన కలెక్టర్ కాంతిలాల్ దండేను మాల మహానాడు, ఎంఆర్‌పీఎస్ నేతలు బుధవారం అభినందించారు. ఆయనను కలిసినవారిలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కొర్రపాటి చెన్నకేశవులు, ఎంఆర్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు అడపా మోహన్‌మాదిగ, మాల మహానాడు నేతలు నీలా సురేష్, పిల్లి మేరీ, నేలపాటి గోపీకృష్ణ, ఎంఆర్‌పీఎస్ నేతలు శ్యామ్‌క్రిష్టాఫర్, అమృతలూరి కరుణకుమారి, దర్శనపు ఆశీర్వాదం, తెనాలి మనోహర్ తదితరులు ఉన్నారు.