అన్ని సర్వేలూ జోస్యం చెప్పినట్టే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. గుజరాత్‌లో బీజేపీకి గతంలో కన్నా సీట్లు తగ్గినా వరసగా ఆరోసారి కూడా అక్కడ అధికారాన్ని నిలుపుకోగలుగుతోంది. కేరళ తరహాలో ప్రతి అయిదేళ్లకూ పాలకులను మార్చే అలవాటున్న హిమాచల్ ప్రజలు అదే బాణీలో ఈసారి బీజేపీని గెలిపించారు. కానీ అక్కడ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేంకుమార్ ధుమాల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సత్పాల్‌సింగ్ ఓడిపోవడం బీజేపీ విజయోత్సాహాన్ని నీరుగార్చింది. నిజానికి జాతీయ స్థాయిలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. అక్కడ ఈసారి తమ పార్టీ ఓడిపోతుందని కాంగ్రెస్ సైతం ముందే నిర్ణయానికొచ్చింది. అయితే గుజ రాత్‌లో మాత్రం బీజేపీ–కాంగ్రెస్‌ల మధ్య ఈసారి హోరాహోరీ పోరు జరిగింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ స్థాయిలో నువ్వా నేనా అన్నట్టు బీజేపీకి సవాలు విసరడం, దానికి దీటుగా నిలబడటం ఇదే ప్రథమం. అలాగని రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆ పార్టీ సమర్ధవంతంగా బయటపెట్టింది లేదు. చర్చను లేవనెత్తింది లేదు.
అక్కడి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టింది లేదు. అయితే ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మునుపటితో పోలిస్తే అన్నిటా చురుగ్గా వ్యవహరించడం, ప్రత్యర్థి పార్టీకి చురకలంటించడం, ప్రజల్ని ఆకట్టుకునేలా మాట్లాడటం వగైరాలు పెరిగాయి. ప్రణాళికా బద్ధంగా వ్యవ హరించి, టిక్కెట్ల పంపిణీలో తెలివిగా అడుగులేసి, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న భిన్న వర్గాల యువనేతలను కలుపుకొని వెళ్లడంలో రాహుల్ చాకచక్యత ప్రదర్శించారు. సారాంశంలో ఇవన్నీ ఆ పార్టీకి అధికారం కట్టబెట్టకపోవచ్చు. ఆయా వర్గాల ఓట్లను కూడా రాబట్టకపోవచ్చు. కానీ గుజరాత్‌లో కాంగ్రెస్‌కు గౌరవప్రదమైన స్థాయిలో స్థానాలు దక్కేలా చేశాయి. అలాగే పార్ట్‌టైం నేతగా, ఎప్పుడేం మాట్లాడాలో తెలి యని నేతగా ఇంతవరకూ పేరున్న రాహుల్‌గాంధీపై ఆ ముద్రలు ఎగిరిపోయాయి. బీజేపీపై రాష్ట్ర ప్రజల్లో ఆగ్రహం ఉన్నమాట వాస్తవమే అయినా... కాంగ్రెస్‌ను వారు గట్టి ప్రత్యామ్నాయంగా భావించలేకపోయారు. రాష్ట్ర స్థాయిలో సమర్ధవంతమైన నాయకత్వం ఆ పార్టీకి లేనందువల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ సమర్ధవంతంగా ప్రచారం చేసి ఉండొచ్చుగానీ...గడిచిన అయి దేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడంలోగానీ, వాటికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడంలోగానీ కాంగ్రెస్ చొరవ చూపలేకపోయింది. ఇవన్నీ ఆ పార్టీ విజయావకాశాలను పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఏ ప్రభంజనం ఆనవాళ్లూ కనబడని ఈ ఎన్నికల్లో చివరకు బీజేపీయే విజేతగా నిలిచింది.
ఎన్నికలకు ఆర్నెల్ల ముందు అక్కడ బీజేపీ గెలుపు ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ అదంత సులభం కాదని ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అర్ధమైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు ఏమంత సంతృప్తిగా లేవు. గత పదిహేనేళ్లుగా పట్టిపీడిస్తున్న కరువు, వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, రుణభారం పెరిగిపోవడం, వ్యవసాయ కూలీలకు చేతినిండా పనిలేకపోవడం వగైరాలన్నీ బీజేపీకి శాపంగా మారాయి. 2012లో క్వింటాల్ పత్తి ధర రూ. 7,000 ఉంటే ఇప్పుడది రూ. 3,000కు పడిపోయింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను కుదేలయ్యేలా చేసింది. ఒకపక్క భారీ పరిశ్రమలు నిరాటంకంగా రాయితీలు అందుకుంటుండగా, గ్రామీణ రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఇది సహజంగానే వారిలో ఆగ్రహం కలి గించింది. ఇందువల్లే మోదీ నియోజకవర్గమైన ఊంఝాలో సైతం ఈసారి కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే నగర, పట్టణ ప్రాంత ఓటర్లు అంత సులభంగా ఆ పార్టీవైపు మొగ్గు చూపలేకపోయారు. రెండో దశ ఎన్నికల సమయానికి బీజేపీ పూర్తిగా బాణీ మార్చింది. బాబ్రీ మసీదు వివాదం విషయంలో 2019 ఎన్నికలయ్యే వరకూ విచారణ వాయిదా వేయాలని కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబాల్ సుప్రీంకోర్టులో కోరడాన్ని ఈ ఎన్నికల్లో బీజేపీ ఆయుధంగా వాడుకుంది. ఇవి న్యాయవాదిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో తాము ఏకీభవించడం లేదని కాంగ్రెస్ చెప్పినా ప్రయోజనం లేకపోయింది. మణిశంకర్ అయ్యర్ మోదీ నుద్దేశించి నీచుడంటూ చేసిన వ్యాఖ్యలు సరేసరి. అలాగే అయ్యర్ నివాసంలో మన్మోహన్‌సింగ్‌తోపాటు కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్‌కు చెందిన కొందరు నేతలతో సమావేశమై తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారని మోదీ చేసిన ఆరోపణలు కూడా పట్టణ ప్రాంత ఓటర్లను ప్రభావితం చేశాయి. నిజానికి జౌళి పరిశ్రమలు, వజ్రాల పరిశ్రమలు కేంద్రీకృతమైన అహ్మదాబాద్, వడోదర, సూరత్ తదితర ప్రాంతాల్లో పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ వగైరా అంశాలపై ఎన్నో ఉద్యమాలు సాగాయి. అక్కడ బీజేపీపై ఆగ్రహావేశాలున్నాయి. అయినా స్వయానా మోదీ చేసిన ప్రచార ప్రభావం పట్టణ ప్రాంత ఓటర్లపై బాగా పడింది. కాంగ్రెస్‌ను గణనీయంగా దెబ్బతీసింది. సరిగ్గా ఈ కారణం వల్లనే హార్దిక్ పటేల్ బీజేపీని వ్యతిరేకిస్తూ ఎంత బలంగా ప్రచారం చేసినా పాటీదార్ల ఓట్లను కాంగ్రెస్ పూర్తిగా రాబట్టుకోలేకపోయింది.
ఎన్నికలన్నాక గెలుపోటములు సహజం. కానీ గెలిచినవారు ఓటర్లకు ఏం హామీలిచ్చి, ఎలాంటి కబుర్లు చెప్పి ఆ విజయం సాధించామన్న ఆత్మ విమర్శ చేసు కోవాలి. అలాగే ఓడినవారు ఎక్కడెక్కడ తమ లోటుపాట్లున్నాయో గుర్తించగల గాలి. ఎన్నికల సమయంలో దూషణల పర్వం మన దేశంలో కొత్త కాకపోయినా గుజరాత్‌లో అది అవధులు దాటిందన్నది నిజం. ప్రతిసారి ఎన్నికల్లో అభివృద్ధి గురించి ప్రధానంగా మాట్లాడే ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈసారి రివాజుకు భిన్నంగా చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. గెలుపే పరమావధి అనుకోవడం కాదు...ఉన్నత ప్రమాణాలను పాటించడం, అందరికీ ఆదర్శప్రాయంగా ఉండటం కూడా ముఖ్యమని, అది తమ బాధ్యతని నాయకులు గుర్తుంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment