లండన్: సాధారణంగా పశ్చిమ దేశాల్లోని అంధులు తమ రోజువారీ కార్యక్రమాల్లో సహాయానికి శిక్షణ పొందిన శునకాలను వినియోగిస్తారు. కానీ, బ్రిటన్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఓ అంధుడు తొలిసారి తన సహాయకారిగా శునకానికి బదులు ఓ గుర్రాన్ని వినియోగించనున్నాడు. మహమ్మద్ సలీమ్ పటేల్(24) బ్లాక్‌బర్న్ పట్టణంలో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాడు. రెటీనాస్ పిగ్‌మెంటొసా అనే కంటి సమస్య కారణంగా ఆయన చూపు కోల్పోయాడు. అతడికి చిన్నప్పటి నుంచి కుక్కలంటే మహా భయం. దీంతో ఆయన కుక్కలను సహాయకారిగా ఎంచుకునేందుకు సంకోచిస్తున్న సమయంలో పొట్టిరకం గుర్రం అతడి మదిలో మెదిలింది. ఆ గుర్రానికి (డిగ్బీ) వచ్చే ఏడాది మే నెలలో రెండేళ్లు నిండుతాయని, అనంతరం అది రెండేళ్లు శిక్షణ పూర్తి చేసుకుని తన దగ్గరికి వస్తుందని పటేల్ పేర్కొన్నారు. కుక్కలతో పోలిస్తే డిగ్బీతో ఎన్నో లాభాలున్నాయంటున్నాడు పటేల్. డిగ్బీ జీవిత కాలం ఎక్కువని, తనకు నలభై దాటాక కూడా అది సాయం చేస్తుందన్నాడు. శునకాలు కేవలం 8 ఏళ్లు పనిచేసి రిటైర్ అవుతాయని, అవి చీకటిలో చూడలేవని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment