
ఐఎస్‌ఏ చీఫ్‌గా భారత ప్రొఫెసర్
వాషింగ్టన్: అమెరికాలోని మేధావుల వర్గంగా భావించే ఇంటర్నేషనల్ స్టడీస్ అసోసియేషన్ (ఐఎస్‌ఏ) 56వ అధ్యక్షుడిగా భారత ప్రొఫెసర్ టీవీ పాల్ నియమితులయ్యారు. మార్చి 16 నుంచి 19 వరకు జార్జియాలోని అట్లాంటాలో జరిగిన ఐఎస్‌ఏ వార్షిక సదస్సులో పాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశంలో పాల్ చేసిన ప్రసంగం ప్రత్యేకంగా నిలిచింది.
మారుతున్న రాజకీయ పరిస్థితులు, చైనా, భారత్ వంటి దేశాలు కొత్త శక్తులుగా ఉద్భవిస్తున్న సమయంలో శాంతియుత మార్పుకోసం జరుగుతున్న వ్యూహాలు వంటి అంశాలపై పాల్ ప్రసంగం కట్టిపడేసింది. ప్రపంచవ్యాప్తంగా మేధావులు.. ఆయా దేశాల్లో రాజకీయ నాయకులు చేపడుతున్న పాలసీల ద్వారా పెరుగుతున్న ఘర్షణ, అనవసర హింస వంటి విషయాలపై సరైన సూచనలనిచ్చి పరిస్థితులు కుదుటపడేలా చొరవతీసుకోవాలని సూచించారు.