న్యూఢిల్లీ: జర్మనీలోని మ్యూనిక్ నగరంలో భారతీయ దంపతులపై దాడి జరిగింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయం వెల్లడించారు. ‘భారతీయ జంట ప్రశాంత్, స్మితా బసరుర్‌లపై మ్యూనిక్ సిటీలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దురదృష్టవశాత్తూ తీవ్ర గాయాల పాలైన ప్రశాంత్ మృతి చెందారు. స్మితా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు కారణమైన న్యూగినీకి చెందిన వలసదారుడి(33)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దాడికి కారణాలు వెల్లడి కాలేదు’ అని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ప్రశాంత్ సోదరుడు జర్మనీ వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. బాధితుల ఇద్దరు పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవాలని అక్కడి మన దౌత్యాధికారులను కోరాం’ అని ఆమె వివరించారు. దీనిపై ట్విట్టర్ ఫాలోయెర్ ఒకరు.. సహృదయులైన మీరు, పేరుకు ముందుగా చౌకీదార్ అని ఎందుకు ఉంచుకున్నారు? అంటూ ప్రశ్నించారు. దీనికి మంత్రి బదులిస్తూ..‘విదేశాల్లో ఉంటున్న భారతీయుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా చౌకీదారీ(కాపలా) పని చేస్తున్నందునే అలా చేశాను’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment