
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ కిరాణా దుకాణంలో దొంగతనానికి వచ్చిన నలుగురు వ్యక్తులు భారత విద్యార్థిని కాల్చి చంపారు. హంతకుల్లో ఒకరు భారత సంతతికి చెందినవాడని తెలిసింది. ఫ్రెస్నో పట్టణంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. 21 ఏళ్ల ధరమ్‌ప్రీత్ సింగ్ జసార్ అనే విద్యార్థి టాకిల్ బాక్స్ అనే స్టోర్‌లో పనిచేస్తున్నాడు. అతను విధుల్లో ఉన్న సమయంలోనే చోరీ చేయడానికి నలుగురు దొంగలు తుపాకులతో లోనికి ప్రవేశించారు.
ప్రాణాలు కాపాడుకోవడానికి జసార్ క్యాష్ కౌంటర్ వెనక దాక్కున్నా దొంగతనం చేసి తిరిగి వెళ్తున్న సమయంలో దుండగుల్లో ఒకరు అతనిపై కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయాడని ఫ్రెస్నోబీ అనే స్థానిక వార్తా సంస్థ తెలిపింది. దొంగలు అక్కడి నుంచి కొంత నగదు, సిగరెట్ బాక్సులు ఎత్తుకెళ్లినట్లు పేర్కొంది. పంజాబ్‌కు చెందిన జసార్ అకౌంటింగ్ కోర్సు చేస్తున్నారు. స్టూడెంట్ వీసాపై మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. స్టోర్‌లో దొంగతనానికి పాల్పడిన నలుగురిలో ఒకడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో భారత సంతతి విద్యార్థి 22 ఏళ్ల అమృత్‌రాజ్ సింగ్ అత్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment