భారత్‌కు 'మిస్‌ వరల్డ్‌' | India's Manushi Chhillar Wins Miss World 2017 | Sakshi
Sakshi News home page

భారత్‌కు 'మిస్‌ వరల్డ్‌'

Published Sun, Nov 19 2017 2:07 AM | Last Updated on Sun, Nov 19 2017 10:39 AM

India's Manushi Chhillar Wins Miss World 2017 - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాన్యా(చైనా): ప్రపంచ అందగత్తెలంతా సొంతం చేసుకునేందుకు ఎంతగానే పరితపించే ప్రపంచ సుందరి(మిస్‌ వర్డల్‌) కిరీటం 17 ఏళ్ల అనంతరం భారత్‌ వశమైంది. హరియాణాకు చెందిన 20 ఏళ్ల ‘మిస్‌ ఇండియా’ మానుషి ఛిల్లర్‌.. మిస్‌ వరల్డ్‌ 2017 టైటిల్‌ను సాధించి భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పింది. చైనాలోని సాన్యా నగరంలో శనివారం రాత్రి ఎంతో అట్టహాసంగా నిర్వహించిన 67వ మిస్‌ వర్డల్‌పోటీలో 118 దేశాల నుంచి వచ్చిన సుందరాంగుల్ని తోసిరాజని ఛిల్లర్‌  ప్రపంచ సుందరి మకుటాన్ని కైవసం చేసుకుంది.

ప్రపంచంలో ఏ వృత్తికి అధిక వేతనం ఇవ్వడం సముచితం అన్న ప్రశ్నకు ‘తల్లి ఉద్యోగం’ అని చెప్పి ఆమె న్యాయ నిర్ణేతల మనసుల్ని గెలుచుకుంది.  2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ గెల్చుకున్నాక మరో భారతీయురాలు ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఛిల్లర్‌ హరియాణాలోని సోనెపట్‌లో వైద్య విద్య రెండో సంవత్సరం చదువుతోంది.  హృద్రోగ శస్త్ర చికిత్స నిపుణురాలు కావాలనుకుంటున్న ఆమె.. గ్రామీణ ప్రాంతాల్లో సేవా దృక్పథంతో పనిచేసే ఆస్పత్రుల్ని నిర్వహించడం జీవిత లక్ష్యమని మిస్‌ వరల్డ్‌ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

మా అమ్మే అతి పెద్ద ఆదర్శం
2016 మిస్‌ వరల్డ్‌ విజేత ప్యూర్టోరికోకు చెందిన స్టెఫానీ డెల్‌ కిరీటాన్ని అలంకరించగానే ఛిల్లర్‌ ఆనందం తట్టుకోలేక ఉబ్బితబ్బిబైంది. ఈ పోటీల్లో మొదటి రన్నరప్‌గా మిస్‌ ఇంగ్లాండ్‌ స్టెఫానీ హిల్, రెండో రన్నరప్‌గా మిస్‌ మెక్సికో ఆండ్రియా మెజాలు నిలిచారు. పోటీలో మొదటి నుంచి ఛిల్లర్‌‡ తన అందచందాలు, తెలివి తేటలతో న్యాయ నిర్ణేతల్ని ఆకట్టుకుంది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, కెన్యా, మెక్సికో అందగత్తెలతో పాటు తుది ఐదుగురి జాబితాలో చోటు దక్కించుకుంది. ఇక న్యాయ నిర్ణేతలు వేసిన ప్రశ్నకు ఛిల్లర్‌ ఎంతో తెలివిగా, సమయస్ఫూర్తితో సమాధానం చెప్పింది.

ప్రపంచంలో ఏ వృత్తికి అత్యధిక వేతనం ఇవ్వాలి? ఎందుకు? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ప్రపంచంలో తల్లికే ఎక్కువ గౌరవం దక్కాలని నేను భావిస్తున్నా. ఇక వేతనం గురించి మాట్లాడినప్పుడు.. అది డబ్బు గురించే కానక్కర్లేదు. ఒకరిపై చూపే ప్రేమ, వారికిచ్చే గౌరవం కూడా కావచ్చు. నా జీవితంలో నా తల్లే అతి పెద్ద ఆదర్శం. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేస్తారు. అందుకే తల్లి ఉద్యోగానికే ఎక్కువ వేతనం దక్కాలని నేను భావిస్తున్నా’ అని ఛిల్లర్‌ చెప్పగానే మిస్‌ వరల్డ్‌ పోటీలు జరుగుతున్న ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది. పోటీ అనంతరం 2017 కిరీటాన్ని మానుషి ఛిల్లర్‌ గెలుచుకుందని మిస్‌ వరల్డ్‌ పోటీల కమిటీ అధికారిక ఫేస్‌బుక్, ట్వీటర్‌ పేజీల్లో వెల్లడించింది. ‘2017 మిస్‌ వరల్డ్‌ విజేత ఛిల్లర్‌’ అంటూ ట్వీటర్‌లో పోస్టుచేసింది.  

బ్యూటీ విత్‌ పర్పస్‌ విభాగంలోనూ
మిస్‌ వర్డల్‌ – 2017 పోటీల్లో టాప్‌ మోడల్, పీపుల్స్‌ చాయిస్, మల్టీమీడియా విభాగాల్లో ఛిల్లర్‌‡ సెమిఫైనల్‌కు చేరారు. అలాగే ‘బ్యూటీ విత్‌ పర్పస్‌’ విభాగంలో మరొకరితో కలిసి సంయుక్త విజేతగా నిలిచారు. బ్యూటీ విత్‌ పర్పస్‌ కోసం ఛిల్లర్‌ ఎంచుకున్న ప్రాజెక్టు ‘శక్తి’. రుతుస్రావ సమయంలో ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 20 గ్రామాల్లో పర్యటించిన ఆమె 5 వేల మంది మహిళలకు చికిత్స అందించారు.

రీటా ఫారియా నుంచి ఛిల్లర్‌ వరకూ
మానుషి ఛిల్లర్‌ సాధించిన కిరీటంతో భారత్‌ ఖాతాలో ఆరు మిస్‌ వరల్డ్‌ టైటిల్స్‌ చేరాయి. మొదటిసారి 1966లో రీటా ఫారియా మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలుచుకుని భారత్‌లోని అందగత్తెల సొగసును ప్రపంచానికి చాటిచెప్పారు. 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హేడన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంకా చోప్రాలు ప్రపంచ సుందరులుగా నిలిచారు. మిస్‌ వరల్డ్‌ గెలుచుకున్నాక రీటా ఫారియా  వైద్య వృత్తిని ఎంచుకున్నారు. ఇక ఐశ్వర్య బాలీవుడ్‌  నటిగా కొనసాగారు.

డయానా, యుక్తా ముఖీలు బాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నా విజయాలు దక్కలేదు. ప్రియాంకా చోప్రాకు మొదట్లో సినిమా విజయాలు వెక్కిరించినా.. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోను ఆమె రాణిస్తున్నారు. భారత్‌కు రెండు సార్లు ‘మిస్‌ యూనివర్స్‌’ కిరీటం దక్కింది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారాదత్తాలు  మిస్‌ యూనివర్స్‌లుగా నిలిచారు. ప్రపంచంలో భారత్, వెనెజులాలు మాత్రమే ఆరేసి మిస్‌ వరల్డ్‌ టైటిల్స్‌ గెలుచుకున్నాయి.   


రాజారెడ్డి, రాధారెడ్డిల వద్ద కూచిపూడి శిక్షణ
చిన్నప్పటి నుంచి మానుషి ఛిల్లర్‌కు చదువుతో పాటు నాట్యం, చిత్రలేఖనం, ఆటల్లో కూడా అభిరుచి ఉంది. 1997, మే 14న హరియాణాలో జన్మించిన ఆమె పాఠశాల విద్యాభ్యాసం ఢిల్లీలోని సెయింట్‌ థామస్‌ స్కూలులో సాగగా, ప్రస్తుతం సోనేపట్‌లోని భగత్‌ ఫూల్‌ సింగ్‌ ప్రభుత్వ మహిళా వైద్య కళాశాలలో వైద్య విద్య అభ్యసిస్తోంది. ఛిల్లర్‌ తండ్రి డాక్టర్‌ మిత్రా బసు ఛిల్లర్‌ డీఆర్‌డీఓలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. తల్లి డాక్టర్‌ నీలమ్‌ ఛిల్లర్‌‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బిహేవియర్, అండ్‌ అల్లైడ్‌ సెన్సెన్స్‌’లో న్యూరో కెమిస్ట్రీ విభాగం హెడ్‌గా ఉన్నారు.

ప్రముఖ నాట్యాచార్యులు రాజారెడ్డి, రాధారెడ్డి, కౌసల్యా రెడ్డిల వద్ద మానుషి కూచిపూడి నృత్యం అభ్యసించారు. పారాగ్లైడింగ్, బంగీ జంపింగ్, స్నోర్‌కెల్లింగ్, స్కూబా డైవింగ్‌ల్లో చురుగ్గా పాల్గొనడమంటే ఛిల్లర్‌కు ఎంతో ఇష్టం. స్కెచింగ్, చిత్రలేఖనంలో కూడా ప్రవేశముంది. అలాగే నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా నుంచి నటనలో మెలకువలు నేర్చుకున్నారు. ముంబైలో జరిగిన 54వ 2017 –మిస్‌ ఇండియా పోటీల్లో హరియాణా తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీలో మిస్‌ ఇండియాగానే కాకుండా మిస్‌ ఫొటోజెనిక్‌గా కూడా నిలిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement