వ్యక్తిగత స్వేచ్ఛా? దేశ భద్రతా? | Individual liberty? National security? | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత స్వేచ్ఛా? దేశ భద్రతా?

Published Thu, May 12 2016 1:41 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

వ్యక్తిగత స్వేచ్ఛా?   దేశ భద్రతా? - Sakshi

వ్యక్తిగత స్వేచ్ఛా? దేశ భద్రతా?

♦ ఎఫ్‌బీఐ వర్సెస్ యాపిల్‌తో తెరపైకి
♦ భారత్‌లో ఆంక్షల ముసాయిదాపై వ్యతిరేకత
♦ సెల్‌ఫోన్ డేటా ఎన్‌క్రిప్షన్‌పై ఎడతెగని చర్చ
♦ దేశభద్రతే ముఖ్యమంటున్న ప్రభుత్వాలు,రక్షణ నిపుణులు
 
 సాంకేతిక పరిజ్ఞానంతో స్వేచ్ఛ, భద్రత మరింత పెరగాలి. కానీ.. టెక్నాలజీ పెరగటం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కొందరు.. దేశభద్రతే ముఖ్యమని మరికొందరు వాదిస్తున్నారు. ఉగ్రవాది సెల్‌ఫోన్ నుంచి సమాచార సేకరణ విషయంలో ఎఫ్‌బీఐ, యాపిల్ కంపెనీ మధ్య తలెత్తిన వివాదంతో ఎన్‌క్రిప్షన్ వివాదం తెరపైకి వచ్చింది. అటు వాట్సప్, ఫేస్‌బుక్‌లు కూడా వ్యక్తిగత స్వేచ్ఛకే (ఎన్‌క్రిప్షన్) ప్రాధాన్యమిస్తామని చెప్పటం... దీనిపై ఆంక్షలకు కేంద్రం ప్రయత్నించటం విమర్శలకు దారితీసింది. అసలు ఎన్‌క్రిప్షన్ అంటే ఏంటి? దీనివల్ల దేశభద్రతకున్న ప్రమాదమేంటి? రక్షణ, సాంకేతిక నిపుణుల ఏమంటున్నారు?
 
 ఎన్‌క్రిప్షన్ అంటే?
 మనం పంపిన సమాచారాన్ని అవతలి వ్యక్తికి భద్రంగా చేర్చటమే ఎన్‌క్రిప్షన్. మనం పంపిన సమాచారంతో పాటు ఓ కోడ్‌నెంబర్ కూడా ఉత్పన్నమవుతుంది. అది గ్రహీతకు చేరిన తర్వాత ఆ పాస్‌వర్డ్ ఉంటేనే ఈ సమాచారం ఓపెన్ అవుతుంది. మధ్యలో ఎవరూ ఆ పాస్‌వర్డ్ లేకుండా సమాచారాన్ని తెలుసుకునే వీలుండదు. ఫేస్‌బుక్ అయినా వాట్సప్ అయినా.. గ్రహీతకు చేరేలోపే హ్యాకర్లు తమ నైపుణ్యంతో దీన్ని చదివేసే అవకాశం ఉంటుంది. అయితే మన సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేస్తే హ్యాకింగ్‌కు ఏమాత్రం అవకాశం ఉండదు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌లో సమాచారాన్ని పంపిన వ్యక్తి దీన్ని అందుకున్న వ్యక్తి మాత్రమే దీన్ని చదవగలిగేలా రహస్యంగా ఉంటుంది. దీని వల్ల సమాచార మార్పిడి చేసే కంపెనీలు (వాట్సప్, ఫేస్‌బుక్..) కూడా ఈ సమాచారాన్ని చదవటం అసాధ్యం. ఈ సందేశాన్ని చదవాలంటే డిక్రిప్ట్ చేయాలి.. ఇందుకు పాస్‌వర్డ్ తెలిసిఉండాలి. మధ్యలో ఎవరైనా దీన్ని బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నిస్తే మొత్తం సమాచారం నాశనం అవుతుంది.
 
 వివాదమేంటి?
 గతేడాది డిసెంబర్‌లో కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో క్రిస్‌మస్ పార్టీపై ఓ జంట కాల్పులు జరిపి 14 మందిని పొట్టన పెట్టుకున్న ఘటనలో..  ఇద్దరు ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాదులను అమెరికా పోలీసులు మట్టుబెట్టారు.  వీరి మృతదేహం వద్ద దొరికిన ఐఫోన్‌ను  అన్‌లాక్ చేసేందుకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ).. తీవ్రంగా ప్రయత్నించింది. ఈ ఫోన్ డేటా పక్కా పాస్‌వర్డ్‌తో ఎన్‌క్రిప్ట్ కావటంతో అన్‌లాక్ చేయాలని ఈ మొబైల్ తయారీదారు యాపిల్ కంపెనీని కోరింది. దీనికి నిరాకరించిన యాపిల్ కంపెనీ తమ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా బహిర్గతం చేయటం కుదదరని తేల్చిచెప్పింది. దేశభద్రతే ముఖ్యమని అమెరికా కోర్టు ఆదేశించినా యాపిల్ కంపెనీ ససేమిరా అని తేల్చేసింది. అయితే.. ఆ తర్వాత మెకఫీ సంస్థ, ఇతర సాంకేతిక నిపుణుల సాయంతో ఈ ఫోన్‌ను అన్‌లాక్ చేయించుకుంది.
 
 యాపిల్‌కు అండ
 వినియోగదారుడి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలన్న యాపిల్ నిర్ణయానికి సామాజిక మాధ్యమ వేదికలన్నీ అండగా నిలిచాయి. ట్విటర్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, వాట్సప్, యాహూ, లింక్డిన్, డ్రాప్ బాక్స్ వంటి వివిధ సంస్థలు తమ మద్దతు ప్రకటించాయి. అయితే.. అమెరికాతోపాటు వివిధ ప్రభుత్వాలు మాత్రం.. వ్యక్తిగత స్వేచ్ఛకన్నా.. దేశభద్రతే ముఖ్యమని భావించాయి. అమెరికా అధ్యక్షుడి నుంచి ఆ దేశ సెనేట్ వరకు అంతటా.. దేశభద్రతకే మద్దతు లభించిం ది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కూడా దేశభద్రతే తొలి ప్రాధాన్యమన్నారు.
 
 భారత్‌లో ఏం జరుగుతోంది?
 భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఇంటలిజెన్స్ సమాచారంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. వాట్సప్, ఫేస్‌బుక్‌లతోపాటు పలు సామాజిక మాధ్యమ వేదికలపైనా ఆంక్షలు విధిస్తూ ముసాయిదాను రూపొందించింది.

 ముసాయిదాలో ఏముంది?: సామాజిక మాధ్యమాలపై ఆంక్షలకోసం కేంద్రం రూపొందించిన ముసాయిదా ప్రకారం.. సోషల్ మీడియా గ్రూపుల ద్వారా పంపే సమాచారాన్ని ప్రతి పౌరుడూ కనీసం 90 రోజుల పాటు నిల్వ ఉంచాల్సిందే. దేశ భద్రతకు సంబంధించి ఏమాత్రం అనుమానం వచ్చినా.. దర్యాప్తు బృందాలే అడిగినప్పుడు ఈ సమాచారాన్ని చూపించాల్సిందేనని ఆంక్షలు విధించింది.  దీంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించటమేనని హక్కుల సంఘాలు దుయ్యబట్టాయి. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకోవాల్సింది పోయి.. ఉక్కుపాదం మోపాలనుకోవటం సరికాదని.. సాంకేతిక నిపుణులు అన్నారు. దీంతో ఈ ముసాయిదా నుంచి ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్‌లను కేంద్రం మినహాయించింది.

 ఇదే దేశభద్రతకు ముప్పు
 ఇలా సమాచారం చాలా భద్రంగా అనుకున్న వ్యక్తికి చేరటం వల్ల కరడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదుల రహస్య సమాచార ప్రసారంపై నిఘా పెట్టలేమని భద్రతాసంస్థల వాదన. కానీ సాంకేతిక నిపుణులు మాత్రం ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుందని.. అలాంటి పరిష్కారం కోసం యత్నించాల్సిన ప్రభుత్వం.. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించరాదంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement