దేహముంది.. ప్రాణముంది.. నెత్తురుంది.. సత్తువుంది అంతకంటే సైన్యముండునా అని ఒక సినీకవి చెప్పినట్లు యువతకు మించిన శక్తి లేదు. వారు ఉంటేనే దేశ భవితకు పటిష్టమైన పునాదులు పడతాయి. దేశాల సమగ్రాభివృద్ధి జరుగుతుంది. అందుకే యువతలో ఉత్సాహాన్ని నింపేందుకు.. భవిష్యత్‌పై భరోసా కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఏటా ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుతోంది. 2000 సంవత్సరం నుంచి ఐరాస ఒక్కో ఏడాది ఒక్కో థీమ్‌తో ముందుకొస్తోంది. అలా చేయడం వల్ల ఆ అంశంపై యువతలో, వివిధ దేశాల ప్రభుత్వాల్లో, యువత సంక్షేమం కోసం పనిచేసే సంస్థల్లో అవగాహన పెరిగి, ఆ రంగంలో యువత పాత్రను పెంపొందించే దిశగా కృషి చేస్తోంది. ‘విద్యావ్యవస్థలో మార్పులు’అన్న థీమ్‌తో యువజన దినోత్సవాన్ని జరుపుతోంది.
జీవనం సాగించేందుకు అవసరమయ్యే విద్య యువతరానికి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా 2030 నాటికి ప్రపంచదేశాలు సుస్థిర అభివృద్ధి సాధించాలన్న సందేశాన్నిస్తోంది. నిపుణుల కొరత తీరాలంటే అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి రావాలన్న నినాదంతో ఈసారి అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఐరాస సభ్యదేశాల్లో ప్రభుత్వాలు, యువత సంక్షేమం కోసం పనిచేసే సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు 2030 నాటికి విద్యావ్యవస్థలో మార్పుల ద్వారా యువత బంగారు భవిష్యత్‌కు ఎలాంటి బాటలు వేయొచ్చో.. వారు తీసుకునే చర్యలేంటో ఐరాస పరిశీలించనుంది. నిరుపేద దేశాల్లో 10 శాతం యువత సెకండరీ ఎడ్యుకేషన్ మాత్రమే పూర్తి చేయగలుగుతోంది. ప్రపంచ జనాభాలో 40 శాతం మందికి మాతృ భాషలో విద్యాబోధన జరగట్లేదు. శరణార్థుల్లో 75 శాతానికి పైగా మందికి సెకండరీ విద్య కూడా అందుబాటులో లేదు. ఇలాంటి అసమానతలు తొలగిపోయి అందరికీ విద్య అందుబాటులోకి వస్తేనే ఏ దేశ ప్రగతి అయినా సాధ్యమని ఐరాస అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment