మెంగ్ హాంగ్వే (ఫైల్ ఫోటో)
బీజింగ్ : అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ అధ్యక్షుడు మెంగ్ హాంగ్వే తన పదవికి రాజీనామా చేశారు. గతకొంత కాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హాంగ్వే అనూహ్యంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన నుంచి రాజీనామా లేఖ అందినట్లు ఇంటర్‌పోల్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఆయన స్థానంలో దక్షిణ కొరియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కీమ్ జోంగ్ యాంగ్ ఇంటర్‌పోల్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. చైనా ఒత్తిడితోనే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన ఇంటర్‌పోల్ అధ్యక్షుడు కాకముందు చైనా ప్రజా భద్రత ఉప మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
కాగా, ఇటీవల ఫ్రాన్స్ నుంచి స్వదేశం చైనాకు తిరిగి వెళ్తున్న హాంగ్వే అదృశ్యమైయ్యారు. అవినీతిపై యుద్ధం పేరుతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పలువురు రాజకీయ నేతలు, అధికారులను అరెస్ట్ చేయిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మెంగ్ హాంగ్వేను అధికారులు అదుపులోకి తీసుకుని ఉండొచ్చని పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. 2016లో ఇంటర్‌పోల్ చీఫ్‌గా ఎన్నికైన హాంగ్వే ఆ పదవిలో 2020 వరకూ కొనసాగుతారు. కాగా హాంగ్వే తన పదవికి రాజీనామా చేశారని, ఆయన క్షేమంగానే ఉన్నారని చైనా అధికారులు ధ్రువీకరించారు. కానీ రాజీనామా తప్ప హాంగ్వేకు సంబంధించిన విషయాలను వెల్లడించేందుకు చైనా నిరాకరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment