ఒకప్పుడు చైనా టెక్ ప్రపంచాన్ని శాసించిన ప్రముఖ టెక్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ బావో ఫాన్ (Bao Fan) గురించి వినే ఉంటారు. అవినీతి నిరోధక చర్యల నేపథ్యంలో ఏడాది క్రితం అదృశ్యమైన ఆయన తాజాగా తెరపైకి వచ్చారు. తాను స్థాపించిన సంస్థకు అధికారికంగా బావో ఫాన్ రాజీనామా చేసినట్లు కంపెనీ తెలిపింది.
ఆరోగ్య కారణాలు, కుటుంబ వ్యవహారాలపై ఎక్కువ సమయం గడపడానికి బావో ఫాన్ ఛైర్మన్, సీఈవో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు చైనా రినయ్‌సెన్స్ (China Renaissance) హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీకి శుక్రవారం ఒక ఫైలింగ్‌లో వెల్లడించింది. ఆయన రాజీనామాకు సంబంధించి ఇంతకు మించి కంపెనీ షేర్‌హోల్డర్ల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం లేదని పేర్కొంది.
కంపెనీలోని ఇతర ఉన్నత స్థానాలతో పాటు ఛైర్మన్, సీఈవో పదవులను సైతం పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు చైనా రినయ్‌సెన్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా బావో ఫాన్ స్థానంలో కంపెనీ సహ-వ్యవస్థాపకుడు జీ యీ జింగ్‌ను కొత్త ఛైర్మన్‌గా నియమించనున్నట్లు, అలాగే ఆయనకు ప్రస్తుతమున్న యాక్టింగ్ సీఈవో హోదాను సీఈవోగా మార్చనున్నట్లు కంపెనీ ఫైలింగ్ పేర్కొంది.
ఇన్నాళ్లూ ఏమైపోయాడో..
బావో ఇప్పుడు ఎలా ఉన్నారు.. ఏం చేస్తున్నారు.. ఆయనతో ఎవరైనా టచ్‌లో ఉన్నారా అనే విషయాలకు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ అందించలేదు. ఆడిటర్‌లు బావోను చేరుకోలేకపోయినందున, ఏప్రిల్‌లో కంపెనీ వార్షిక ఫలితాల విడుదలను ఆలస్యం చేయవలసి వచ్చిందని వివరించింది.
బావో 2023 ఫిబ్రవరిలో అదృశ్యమైనప్పటి నుంచి దేశంలోని అగ్రశ్రేణి యాంటీ గ్రాఫ్ట్ నియంత్రణ సంస్థ నిర్బంధంలో ఉన్నట్లు గత వేసవిలో ఒక ప్రభుత్వ ఆర్థిక ప్రచురణకు చెందిన ఎకనామిక్ అబ్జర్వర్ నివేదించారు. కార్పొరేట్ లంచం అనుమానిత కేసులో ఆయన్ను విచారిస్తున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.
తిరుగులేని బ్యాంకర్
చైనా టెక్ పరిశ్రమలో ప్రముఖ బ్యాంకర్ అయిన బావో ఫాన్ 2005లో బీజింగ్‌లో చైనా రినయ్‌సెన్స్‌ను స్థాపించారు. చైనీస్ టెక్ సంస్థల కోసం అగ్ర డీల్‌మేకర్‌లలో ఒకడిగా పరిశ్రమను శాసించారు. ఆ దేశంలోని రెండు ప్రముఖ ఫుడ్ డెలివరీ సర్వీసులైన మీటువాన్, డయాన్‌పింగ్ మధ్య 2015 విలీనానికి ఆయనే మధ్యవర్తిత్వం వహించారు. ఆ రెండు కంపెనీల “సూపర్ యాప్” నేడు చైనా అంతటా విస్తరించింది.
Comments
Please login to add a commentAdd a comment