'అవును.. జిహాద్ జాన్ను చంపేశారు'
బీరుట్: బ్రిటన్కు చెందిన ఉగ్రవాది 'జిహాదీ జాన్'ను అమెరికా సైన్యం హతమార్చినట్టు వచ్చిన వార్తలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ధ్రువీకరించింది. గత నవంబర్లో సిరియాలోని రక్కాలో డ్రోన్ దాడిలో అతను చనిపోయినట్టు వెల్లడించింది. ఈ దాడి చేసింది తామేనని, జిహాది జాన్ను హతమార్చామని అప్పట్లో అమెరికా సైన్యం ప్రకటించగా, ఇప్పుడు ఐఎస్ సంస్థ ఈ విషయాన్ని బహిర్గతం చేసింది.
నవంబర్ 12న రక్కా నగరంలో జిహాదీ జాన్ ప్రయాణిస్తున్న కారుపై జరిగిన డ్రోన్ దాడిలో అతను అక్కడిక్కడే చనిపోయినట్టు ఐఎస్ సంస్థ వెల్లడించింది. జిహాదీ జాన్ పూర్తిగా నల్లటి దుస్తులు ధరించి, తన ముఖానికి ముసుగు ధరించి, బందీల తలలను కిరాతకంగా నరికివేసినప్పటి భయంకర దృశ్యాలను చిత్రీకరించిన వీడియోలు గతంలో వెలుగుచూశాయి. మహమ్మద్ ఎమ్వాజి అలియాస్ జిహాదీ జాన్.. కువైట్లో ఇరాక్ సంతతి కుటుంబంలో జన్మించాడు. 1993లో అతని కుటుంబం బ్రిటన్కు వలసవెళ్లింది. కంప్యూటర్ ప్రోగామర్ అయిన ఎమ్వాజీ ఐఎస్లో చేరాక తన పేరును జిహాదీ జాన్గా మార్చుకున్నాడు. 2014లో జిహాద్ జాన్.. ఐఎస్కు బందీగా పట్టుబడిన అమెరికా జర్నలిస్టు జేమ్స్ ఫోలే తలను నరికి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత మరికొంతమంది బందీలను ఇదే రీతిలో చంపాడు. అమెరికా, బ్రిటన్ సేనలు జిహాదీ జాన్ను లక్ష్యంగా చేసుకుని హతమార్చాయి.