జిహాదీ జాన్ ఎప్పటికైనా తిరిగొస్తాడు..!
భారతీయ మూలాలు కలిగిన బ్రిటిష్ పౌరుడు.. కొత్త 'జిహాదీ జాన్' గా పిలుస్తున్న సిద్ధార్థ ధర్ చనిపోయినట్లు తాను నమ్మడం లేదని తాజాగా అతడి సోదరి కోనికా ధర్ తాజాగా బ్రిటిష్ పార్లమెంట్ లో ప్రకటించింది. ఎప్పటికైనా అతడు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడన్న నమ్మకం తమకు ఉందంటోంది. ఐసిస్ ఉగ్రవాదుల్లో జిహాదీ జాన్ గా అవతరించిన సిద్ధార్థ్ అలియాస్ అబు రుమేసహ్ వైమానిక దాడుల్లో చనిపోయినట్లు ఇటీవల ఐఎస్ అధికారిక మేగజైన్ దబిక్ నిర్థారించినప్పటికీ ఆ విషయాన్నిఆమె అంగీకరించడం లేదు. తన సోదరుడు అంత దయలేని వ్యక్తి కాదని, హత్యకు గురై ఉండడంటూ ఆమె భావోద్వేగ ప్రకటన చేసింది.
సిద్ధార్థ అలియాస్ అబు రుమేసహ... భార్య, నలుగురు పిల్లలతో సహా 2014లో బ్రిటన్ నుంచి పారిపోయి సిరియాకు వెళ్ళి ఐసిస్ లో చేరాడు. పుట్టుకతో హిందువు అయిన అబు.. వ్యాపారం నిమిత్తం బ్రిటన్ వచ్చి, ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ లో అల్ ముహజిరౌన్ అనే రాడికల్ గ్రూప్ లో చేరాడు. అక్కడినుంచి సిరియా వెళ్ళి ఐసిసితో చేతులు కలిపిన అతడు అనేక దారుణాలకు పాల్పడ్డట్లుగా విడుదలైన వీడియోను అప్పట్లో అతడి సోదరి కోనికా, తల్లి శోభితా ప్రత్యక్షంగా చూశారు. అయితే అతడి గొంతు మాత్రం గుర్తుపట్టేలా లేదని, తమను షాక్ కు గురి చేస్తోందని చెప్పారు. అయితే తాజాగా ఇప్పుడు కోనికా మరోసారి ఆ వీడియోలో వ్యక్తి తన సోదరుడు కాదని, అతడు ఎప్పటికైనా తిరిగి ఇంటి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది.
సిద్ధార్థ ఓ ఉదారవాద హిందూ కుటుంబంలో పెరిగాడని.. అతడిది అటువంటి తీవ్రవాద చర్యలకు పాల్పడే మనస్తత్వం కాదని కోనికా చెప్తోంది. అతడు ఎక్కడున్నాడో ఎలాగైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తానని, తన సోదరుడు ఉగ్రవాది కాదని నిరూపిస్తానని అంటోంది. కాగా అతడు హత్యకు గురి కాలేదని ఎలా నిరూపించగలవంటూ ఆమెను కామన్స్ హోం ఎఫైర్స్ కమిటీ ప్రశ్నించగా... తన అన్నను గత సెప్టెంబర్ లో చూశానని, ఆ తర్వాత కొన్నాళ్ళకు అతడు సిరియా వెళ్ళిపోయాడని, అప్పట్నుంచీ అతడితో మాట్లాడేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించామని, కానీ రెండుసార్లు మాత్రం అతడు సమాధానం ఇచ్చాడని చెప్తోంది.
అయితే మొదటిసారి అతన్ని టీవీలో చూసినప్పుడు మాత్రం అబూ ఎవరు? అని గుర్తించలేకపోయానంది. అతడిని ఐసిస్ కు సంబంధించిన వ్యక్తులు ప్రేరేపించి ఉండొచ్చని, తన మాటలు సాధారణ ప్రజలు నమ్మకపోయినా.. అతడు తన సోదరుడని వక్కాణిస్తోంది. సిరియాలో వారు నివసించే అవకాశం లేదు కనుక తన సోదరుడి కుటుంబం బంధించబడి ఉంటుందని.... అతడి ఇంగ్లీషు భాషను బట్టి బ్రిటిష్ ప్రధాని అతడే తన సోదరుడనడం సరికాదని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తోంది.