
'సాంకేతిక లోపం కాదు, బాంబు దాడే'
లండన్: ఇటీవల రష్యాకు చెందిన విమానం కూలిపోయిన ఘటనలో 224 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యలతో జరిగిన ప్రమాదంలో కూలిపోయి ఉండొచ్చని భావించారు. అయితే విమానాన్ని మేమే కూల్చేశామంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఓ వీడియోను అంతర్జాలంలో ఉంచినప్పటికీ దీనిని అధికారులు ధ్రువీకరించలేదు. అయితే విమానం కూలిపోయిన ఘటన ప్రమాదం కాదనీ, అది బాంబుదాడితో కూలిపోయిందని అమెరికా, బ్రిటన్ భద్రతా విభాగానికి చెందిన అధికారులు బుధవారం ప్రకటించారు.
ఈజిప్టులోని సినాయ్ పెనున్స్లా వద్ద శనివారం జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయనీ, ఇది బాంబుదాడిలో కూలిపోయినట్లు నిర్థారణ అవుతున్నా ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారో స్పష్టంగా తెలియడం లేదన్నారు. దీనికి సంబంధించిన మరింత విచారణ జరగాల్సి ఉందని అమెరికా, బ్రిటన్ భద్రతా విభాగానికి చెందిన అధికారులు ప్రకటించారు.
విమాన ప్రమాదంలో సమాచారాన్ని సేకరించడానికి అత్యంత కీలకంగా భావించే బ్లాక్ బాక్స్ కొంతవరకు ద్వంసం కావడంతో దీని నుండి సమాచారాన్ని సేకరించడం క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై రష్యా దాడులు జరుపుతుండడంతో దానికి ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.