కథ మారింది.. తప్పు తెలిసింది
బీజింగ్: అది 1996 ఏప్రిల్.. తీవ్రమైన నేరాలపై కఠి నంగా వ్యవహరించాలంటూ చైనాలో డిమాండ్లు వెల్లువెత్తుతున్న రోజులవి.. 18 ఏళ్ల హూగ్జిల్ట్ అతని స్నేహితుడు యాన్ ఫెంగ్ కలిసి ఓ రోడ్డు పక్కన వెళుతున్నారు.. ఇంతలో ఓ మహిళ అరుపులు, రక్షించాలంటూ కేకలు.. పక్కనే ఉన్న మహిళల టాయ్‌లెట్ నుంచి కేకలు వచ్చినట్లుగా గుర్తించిన ఆ స్నేహితులు ఏం జరిగిందో అని వెళ్లి చూశారు.. అక్కడ ఓ మహిళ రక్తపు మడుగులో చని పోయి ఉండడాన్ని చూసి బయటకు పరుగెత్తారు..
మనకెందుకులే వెళ్లిపోదామని యాన్ చెప్పినా హూగ్జిల్ట్ వినకుండా పోలీసులకు సమాచారమిచ్చాడు. కానీ దురదృష్టం హూగ్జిల్ట్‌ను వెన్నాడింది. కేసుల నమోదులో, కఠిన చర్యల డిమాండ్ల మత్తులో ఉన్న అధికారులు ఆ నేరానికి పాల్పడింది హూగ్జిల్టేనంటూ కేసు పెట్టారు.. తీవ్ర ఘట నగా పరిగణించిన హాహోట్ కోర్టు మరణశిక్ష విధిం చింది.. హూగ్జిల్ట్ అలాంటివాడు కాదు మొర్రో అత ని తల్లిదండ్రులు, స్నేహితులు మొత్తుకున్నా కోర్టు, అధికారులు వినలేదు.. 1996లో మరణశిక్షను అమలు చేశారు.
హూగ్జిల్ట్ నిర్దోషి.. ఈ విషయాన్ని కోర్టే తేల్చింది.. అతని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పింది.. కానీ మరణశిక్ష అమలైన 18 ఏళ్ల తర్వాత 2014 డిసెంబర్‌లో..! అసలు ఈ నేరం చేసింది ఝావో జిహోంగ్ అనే సీరియల్ రేపిస్టు, కిల్లర్.. అసలు విషయం ఎలా తేలిందో తెలుసా?.. తమ కుమారుడు నిర్దోషి అని తేల్చేందుకు హూగ్జిల్ట్ తల్లిదండ్రులు పెద్ద పోరాటమే చేశారు. 1996లోనే హూగ్జిల్ట్ చనిపోయినా.. పైకోర్టులకు అప్పీలు మీద అప్పీలు చేస్తూనే వచ్చారు.. అయితే పది మంది మహిళలను అత్యాచారం చేసి హతమార్చిన ఝావో పోలీసులకు దొరికిపోవడంతో విషయం బయటపడింది.
చేయని నేరానికి శిక్ష అనుభవించిన తమ కుమారుడి ఆత్మకు శాంతి చేకూర్చేందుకు హూగ్జిల్ట్ తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. హూగ్జిల్ట్‌ను నిర్దోషిగా నిర్ధారిస్తూ, కోర్టు చెప్పిన క్షమాపణల పత్రాన్ని.. అతని సమాధి ముందు కాల్చి, నివాళి అర్పించనున్నారు.