10 Years Of China-Pakistan Economic Corridor - Sakshi
Sakshi News home page

China Pak cpec Corridor: నాడు దోస్తీ కోసం.. నేడు ఉద్రిక్తతలకు నిలయం

Published Mon, Jul 31 2023 12:24 PM | Last Updated on Mon, Jul 31 2023 12:34 PM

Ten Years of China Pakistans Cpec Corridor - Sakshi

చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్‌) 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2013లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ)కి కూడా ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ ప్రాజెక్ట్ కింద చైనా.. పాకిస్తాన్‌లో పది బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టింది. దీనిలో భాగంగా భారీ రవాణా, ఇంధనం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేసింది.

మిశ్రమ ఫలితాలు
రాజకీయ తిరుగుబాట్లు, ఉగ్రవాద దాడుల భయం సీపెక్‌కు ఎల్లప్పుడూ సవాలుగా నిలిచింది. ఈ దశాబ్దంలో సీపెక్‌ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చైనా ప్రాథమిక లక్ష్యం అరేబియా సముద్రానికి ప్రత్యక్ష అనుసంధానం. ఇది ఇప్పటికీ పూర్తి ​స్థాయిలో నెరవేరలేదు. అయితే కారిడార్‌ కారణంగా పాకిస్తాన్ తన స్వల్పకాలిక లక్ష్యాలను చేరుకోవడంలో గణనీయమైన పురోగతిని సాధించింది.

పాక్‌కు చైనా ఉపశమనం
ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌కు అత్యంత విశ్వసనీయ విదేశీ భాగస్వాములలో చైనా ఒకటిగా నిలిచింది. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్‌కు చైనా ఎంతగానో సహాయం చేసింది. తాజాగా పాకిస్తాన్‌కు చైనా $ 2.4 బిలియన్ల రుణాన్ని అందించింది. ఇది దివాలా అంచున ఉన్న పాకిస్తాన్‌కు పెద్ద ఉపశమనంలా మారింది. గత ఏడాది ఐఎంఎఫ్‌ అందించిన నివేదిక ప్రకారం పాకిస్తాన్‌కు ఉన్న మొత్తం అప్పులో 30 శాతం చైనా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నుండి వచ్చింది.

పాక్‌-చైనాల బంధం ఇలా..
భారత పొరుగుదేశాలైన పాక్‌- చైనాలు 596 కిలో మీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటాయి.  ఇది సియాచిన్ నుండి కారాకోరం వరకు విస్తరించి ఉంది. పాకిస్తాన్ రాజకీయ నేతలు చైనాతో తమ సంబంధాలను ప్రస్తావించినప్పుడు అవి హిమాలయాల కంటే ఎత్తుగా, సముద్రం కంటే లోతుగా, తేనె కంటే తియ్యగా' ఉండాలని అభివర్ణిస్తారు. అయితే సీపెక్‌ కొన్నేళ్లుగా ఉద్రిక్తతలకు నిలయంగా ఉంది. సీపెక్‌ మార్గంలో చైనా నేరుగా హిందూ మహాసముద్రం వరకూ చేరుకుంటుంది. 


పాక్‌ ప్రజల నిరసన
అయితే సీపెక్‌లో పనిచేస్తున్న పౌరుల భద్రత  ఇరు దేశాలకు పెద్ద సమస్యగా మారింది. ప్రాజెక్ట్ చుట్టూ తీవ్రవాద దాడులు జరిగాయి. వీటిలో పెద్ద సంఖ్యలో చైనా పౌరులు కూడా మరణించారు. తాజాగా సీపెక్‌ పరిధిలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. సీపెక్‌ కారిడార్ చైనాకు పశ్చిమ ప్రాంతంలోని జిన్‌జియాంగ్‌ను పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లోగల గ్వాదర్ ఓడరేవుకు కలుపుతుంది. కాగా ఈ ప్రాజెక్టుల వల్ల తమకు ప్రయోజనం కలగడం లేదని వాయువ్య పాకిస్తాన్‌లోని ప్రజలు నిరసరన వ్యక్తం చేస్తున్నారు. చైనా ప్రయోజనాలను కాపాడేందుకు తమపై వేలాది మంది పాక్ సైనికులను మోహరించినట్లు బలూచ్ వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు.

పాక్‌ వాదనకు చైనా ఖండన
2021లో క్వెట్టాలోని ఒక విలాసవంతమైన హోటల్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు మరణించారు. అలాగే దాసు డ్యామ్ వైపు వెళ్తున్న చైనా ఉద్యోగులతో నిండిన బస్సులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది చైనీయులతో సహా మొత్తం 12 మంది మరణించారు. గ్యాస్ లీకేజీ వల్లే ఈ పేలుడు సంభవించిందని పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ చైనా మాత్రం దీనిని ఉగ్రవాద దాడిగా పరిగణిస్తోంది.
ఇది కూడా చదవండి: నాటి షబ్నం.. నేటి మీరా.. కృష్ణ ప్రేమలో మునిగితేలుతున్న లేడీ బౌన్సర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement