ఇటలీ ప్రభుత్వం విధించిన నిబంధనలు చూస్తే వామ్మో అనిపించొచ్చు. మరీ అతి చేస్తున్నారా అన్న భావన రావచ్చు. కానీ కబళించింది ఏదో కాదు ప్రపంచాన్నే వణికించే రక్కసి. చైనా తర్వాత అత్యంత ఆందోళనకర స్థితి నెలకొన్న దేశం ఇటలీ. రోజు రోజుకూ కేసుల సంఖ్య, మృతులు పెరిగిపోతున్నారు. ఇప్పటికే 17 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో పకడ్బందీ చర్యలు చేపట్టారు. నిత్యావసరాలు దొరికే సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు తప్ప మిగతావన్నీ మూసేశారు. తమకు కావల్సిన సరుకులు తెచ్చుకోవాలంటే ఇంట్లో నుంచి ఒక్కరికి మాత్రమే బయటకు రావడానికి అనుమతిస్తున్నారు. సూపర్ మార్కెట్లు, ఫార్మసీల కిటికీలు మాత్రమే తెరిచి ఉంచుతారు. ఒకరి తర్వాత ఒకరు క్యూ పద్ధతి పాటిస్తూ లోపలికి వెళ్లి వారికి కావల్సినవి తెచ్చుకోవాలి. రద్దీ ఎక్కువ ఉంటే ఒకసారి నలుగురైదుగురిని లోపలికి అనుమతిస్తారు కానీ ఒక్కొక్కరి మధ్య కనీసం మూడు అడుగుల దూరం పాటించాలి. ఇల్లు కదిలి బయటకి రావాలంటే పోలీసులకు కారణాలు చెప్పాలి. ఇలా అడుగడుగునా ఆంక్షలు విధించారు. అయితే అంతటి నిర్బంధంలో ఉండడం మామూలు విషయం కాదంటున్నారు మిలాన్‌లో ఉంటున్న అమెరికన్ క్రిస్టినా హిగ్గిన్స్. దేశమే ఒక జైలులా మారినప్పుడు కాలం గడపడం దుర్లభం అని ఆమె అంటున్నారు. భర్త, పిల్లలు ఇంటిపట్టునే ఉన్నా ఊపిరాడనట్టుగా ఉంటోందని హిగ్గిన్స్ మీడియా ఇంటర్వూ్యల్లో చెప్పారు. మరో రెండు వారాల పాటు ఇటలీలో ఇవే పరిస్థితులు కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment