ఇవాంకా ట్రంప్
వాషింగ్టన్ : ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధిగా ఉన్న నిక్కీ హేలీ రాజీనామా చేశారు. ఎలాంటి ముందస్తు ఊహాగానాలు లేకుండా ఆమె అకస్మాత్తుగా రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. అయితే నిక్కీ రాజీనామా తరువాత ఆమె స్థానంలో ఎవరూ వస్తారు అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇవాంకా ట్రంప్‌ని ఆ పదవిలో నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ట్రంప్ కూడా సంకేతాలు వెలువరించారు.
‘నిక్కీ తర్వాత అలాంటి డైనమిక్ అంబాసిడర్ అయ్యే అర్హత ఇవాంకాకి ఉందనుకుంటున్నా. అయితే, నా కూతుర్ని ఎంపిక చేస్తే.. నాకు బంధుప్రీతి అని ఆరోపిస్తారేమో’ అంటూ ట్రంప్ విలేకరుల సమావేశంలో తెలిపారు. అయితే ఈ వార్తల్ని ఇవాంకా కొట్టి పారేశారు. ‘ప్రస్తుతం నేను వైట్ హౌస్‌లో చాలా గొప్ప వారితో కలిసి పనిచేస్తున్నాను. నిక్కీ హేలీ చాలా గొప్ప వ్యక్తి. ఆమె స్థానంలో అధ్యక్షుడు మరో గొప్ప వ్యక్తిని నియమిస్తారని నమ్ముతున్నాను. అయితే ఆ వ్యక్తి నేను మాత్రం కాదం’టూ ఇవాంకా ట్రంప్ తెలిపారు.
దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ అయిన నిక్కీ హేలీ.. 2020 ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకే రాజీనామా చేసి ఉంటారనే ప్రచారం జోరందుకుంది. అయితే, ఆ వాదనను నిక్కీ హేలీ కొట్టిపారేశారు. ‘నా జీవితంలో ఇవి ఉన్నతమైన రోజులు. నా తర్వాత అంబాసిడర్‌గా వచ్చేవారికి అన్నీ అనుకూలంగా ఉండేలా చూడడం ఇప్పుడు నా ముందున్న లక్ష్యం. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో లేను. ట్రంప్‌కే ప్రచారం చేస్తా’ అని నిక్కీ హేలీ ప్రకటించారు. కానీ, తాను ఎందుకు రాజీనామా చేశారో మాత్రం ఆమె చెప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment