డోక్లామ్ ఇష్యూ.. మా మద్ధతు భారత్‌కే...
డోక్లామ్ ఇష్యూ.. మా మద్ధతు భారత్‌కే...
Published Fri, Aug 18 2017 10:52 AM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM
న్యూఢిల్లీ: సిక్కిం సరిహద్దులో డోక్లామ్ వద్ద ఇరు దేశాల సైన్యం మోహరించి పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన వేళ ఆసియా దేశం భారత్ కు మద్ధతుగా వ్యాఖ్యలు చేసింది. యుద్ధంతో ఏ సమస్యా పరిష్కారం కాదంటూ చైనాకు చురకలు అంటిస్తూ జపాన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
డోక్లామ్ వద్ద చైనా రోడ్డును నిర్మించటం అనేది ముమ్మాటికీ భారత్, భూటాన్‌లతో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించటమేనని ఇండియాలో జపాన్ తరపున రాయబారి కెంజి హిరమట్సు స్పష్టం చేశారు. అంతేకాదు ఈ వ్యవహారంలో పెద్దన్నగా అమెరికా జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. డోక్లామ్ భూటాన్ భూభాగానికి చెందింది కాగా, రోడ్డు నిర్మాణం చేపట్టి భారత సైన్యాన్ని రెచ్చగొడుతూ ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తోంది. తద్వారా ఒకేసారి ఇరు దేశాలతో ఒప్పందాలను చైనా ఉల్లంఘించిందని కెంజి పేర్కొన్నారు.
"డోక్లామ్ పరిస్థితులను జపాన్ నిశితంగా పరిశీలిస్తుంది. భూటాన్ తో ఉన్న ఒప్పందం కారణంగానే భారత్ ఈ వ్యవహారంలో కలుగజేసుకోవాల్సి వచ్చింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా చైనాతో దౌత్య సంబంధాలు దెబ్బ తినకుండా చర్చలు ముందుకు సాగేలా చూస్తామని పార్లమెంట్ సాక్షిగా తెలిపారు. శాంతియుతంగా ముందకు సాగాలన్న భారత్ నిర్ణయాన్ని జపాన్ స్వాగతిస్తోంది" అని కెంజి వెల్లడించారు.
కాగా, ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరు దేశాలు మాకు బాగా కావాల్సినవే. సమస్య ఏదైనా శాంతి చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ దౌత్య కార్యాలయ అధికారి హెతర్ నౌఎర్ట్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Advertisement