ప్రధాని వంటలోనూ సాయం చేస్తారు!!
గట్టిగా ఓ లక్ష రూపాయల జీతం వస్తోందంటే చాలు.. ఇంట్లో భార్యమీద గయ్యిమని లేచే వాతావరణం మనది. కానీ ఓ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంట్లో వంట చేయడం, అవసరమైతే చెత్త పారబోయడం.. ఇలాంటి పనులన్నీ కూడా చేస్తారంటే నమ్ముతారా? జపాన్ ప్రధానమంత్రి మాత్రం ఇవన్నీ చేస్తారట. షింజో అబె గురించి స్వయంగా ఆయన భార్యే ఈ విషయాలు చెప్పారు. కొన్ని సందర్భాలలో ఇంట్లో వంట చేయాల్సింది కూడా ఆయనేనని అకీ అబె తెలిపారు. జపాన్లో మహిళలు ముందడుగు వేయడానికి ఇలా పురుషులు కూడా సహకరించడమే కారణమని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు కార్పొరేట్ కంపెనీలు కూడా మహిళలను ఎక్కువగా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ప్రధాని షింజో అబె పదే పదే చెబుతున్నారు.
బుధవారం నాడు ఆయన 18 మందిని కేబినెట్లోకి తీసుకుంటే.. వారిలో ఐదుగురు మహిళలే. మహిళలకు తన భర్త అనేక అవకాశాలు కల్పిస్తారని అకీ అబె చెప్పారు. ఇంట్లో సమయం దొరికినప్పుడల్లా చేతిసాయం చేస్తూనే ఉంటారన్నారు. కొన్నిసార్లు మాత్రం ఆయన రోజంతా బయటే ఉంటారని.. అలాంటప్పుడే తనకు ఇల్లు శుభ్రం చేయడానికి కూడా సమయం దొరకదని తెలిపారు. అయితే.. ఏనాడూ భర్తగా ఆధిపత్యం చలాయించాలని మాత్రం షింజో అబె చూడరట.