టోక్యో: జపాన్ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ ఆ దేశ ప్రధాని షింజో అబే గురువారం ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర కొరియాతో యుద్ధ వాతావరణం, కొత్త పన్ను విధానం అమలు నేపథ్యంలో పార్లమెంట్‌పై పూర్తి పట్టుకోసం తాజా ఎన్నికలకు అబే పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన జపాన్‌లో అక్టోబర్ 22న ఎన్నికలు జరిగే అవకాశముంది.
అబే అధికారిక నిర్ణయాన్ని స్పీకర్ చదివి వినిపించగానే పార్లమెంట్ దిగువ సభ సభ్యులు ఆమోదం తెలిపారు. ‘కఠిన పరీక్ష ఈ రోజే మొదలైంది, ప్రజల ప్రాణాల్ని కాపాడటం కోసమే ఈ ఎన్నిక. అంతర్జాతీయ సమాజంతో కలిసికట్టుగా సాగుతూ.. ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం మనమంతా పోరాడాల్సిన అవసరముంది’ అని అబే పేర్కొన్నారు.
ఉత్తర కొరియా విషయంలో అనుసరిస్తున్న దృఢమైన విదేశీ విధానానికి దేశ ప్రజలు మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో షింజో అబే ప్రధాన ప్రత్యర్థిగా టోక్యో గవర్నర్ యురికో కొయికేకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే ‘పార్టీ ఆఫ్ హోప్’ పార్టీని స్థాపించిన ఆమె అబేకు గట్టి సవాలు విసురుతున్నారు. అయితే ప్రస్తుతం జపాన్‌లో ప్రతిపక్షం బలహీనంగా ఉన్నందున దాన్ని అవకాశంగా మలచుకునేందుకే పార్లమెంట్‌ను రద్దు చేశారని భావిస్తున్నారు.