Prime Minister Shinzo Abe
-
జపాన్ పార్లమెంట్ రద్దు
టోక్యో: జపాన్ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ ఆ దేశ ప్రధాని షింజో అబే గురువారం ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర కొరియాతో యుద్ధ వాతావరణం, కొత్త పన్ను విధానం అమలు నేపథ్యంలో పార్లమెంట్‌పై పూర్తి పట్టుకోసం తాజా ఎన్నికలకు అబే పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన జపాన్‌లో అక్టోబర్ 22న ఎన్నికలు జరిగే అవకాశముంది. అబే అధికారిక నిర్ణయాన్ని స్పీకర్ చదివి వినిపించగానే పార్లమెంట్ దిగువ సభ సభ్యులు ఆమోదం తెలిపారు. ‘కఠిన పరీక్ష ఈ రోజే మొదలైంది, ప్రజల ప్రాణాల్ని కాపాడటం కోసమే ఈ ఎన్నిక. అంతర్జాతీయ సమాజంతో కలిసికట్టుగా సాగుతూ.. ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం మనమంతా పోరాడాల్సిన అవసరముంది’ అని అబే పేర్కొన్నారు. ఉత్తర కొరియా విషయంలో అనుసరిస్తున్న దృఢమైన విదేశీ విధానానికి దేశ ప్రజలు మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో షింజో అబే ప్రధాన ప్రత్యర్థిగా టోక్యో గవర్నర్ యురికో కొయికేకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే ‘పార్టీ ఆఫ్ హోప్’ పార్టీని స్థాపించిన ఆమె అబేకు గట్టి సవాలు విసురుతున్నారు. అయితే ప్రస్తుతం జపాన్‌లో ప్రతిపక్షం బలహీనంగా ఉన్నందున దాన్ని అవకాశంగా మలచుకునేందుకే పార్లమెంట్‌ను రద్దు చేశారని భావిస్తున్నారు. -
'ఆయనను గుజరాత్ ఎందుకు తీసుకెళ్లారు?'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. జపాన్ ప్రధాని షింజో అబేను ఎందుకు దేశ రాజధాని ఢిల్లీకి తీసుకురాకుండా గుజరాత్‌కు తీసుకెళ్లారని నిలదీసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రధాని ఈ పనిచేశారంటూ దుయ్యబట్టింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ అబేకు అహ్మదాబాద్‌లో ఆతిథ్యం ఇవ్వడంపై స్పందిస్తూ అబేకు ఢిల్లీలో ఆతిథ్యం ఇవ్వకుంటే అది ఆచరణ శూన్యమే అవుతుందని అన్నారు. దేశ పర్యటనకు వచ్చే విదేశాల అధిపతుల అంశాలను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకోకూడదని, అలా చేస్తే ప్రయోజన శూన్యం అవుతుందని తెలిపారు. ముఖ్యంగా ఢిల్లీలో ఆతిథ్యం ఏర్పాటుచేయకపోవడం అర్థరాహిత్యం అవుతుందని చెప్పారు. భారత్‌కు జపాన్‌తో గొప్ప సంబంధం ఉందని, ఆ బంధం, ఇరు దేశాలమధ్య వ్యవస్థాపనలు యూపీఏ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని తెలిపారు. -
అబేను గుజరాత్‌కే ఎందుకు తీసుకెళ్లారు? : కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ రాష్ట్రంలో కాలు మోపిన విషయం తెలిసిందే. అయితే ఓ దేశ ప్రధాని స్థాయి వ్యక్తిని.. పైగా మన దేశంతో కీలక ఒప్పందాలు చేసుకునేందుకు వచ్చిన తరుణంలో దేశ రాజధానిలో కాకుండా.. ఓ రాష్టంలో బస ఎందుకు ఏర్పాటు చేశారు? అన్న ప్రశ్నను లేవనెత్తుతోంది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. కేవలం రాజకీయ కారణాలతోనే జపాన్ ప్రధానిని మోదీ గుజరాత్‌కు తీసుకెళ్లారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ ఆరోపించారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా విచిత్రంగా ఉంది. వచ్చే ఏడాది గుజరాత్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ తరుణంలోనే కేవలం రాజకీయ ప్రయోజనం పొందేందుకే మోదీ, అబేను కావాలనే అక్కడికి(గుజరాత్) తీసుకెళ్లారు. కీలక ఒప్పందాలు చేసుకోవటానికి వచ్చిన ఒక అతిథిని గౌరవించే తీరు ఇదేనా? అని మనీశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా, నేడు జపాన్ ప్రధాని అబె ఇండియా తొలి బుల్లెట్ రైలుకు శంకుస్థాపన చేయనున్నారు. ముంబై, అహ్మదాబాద్ మధ్య పరుగులు తీయనుంది. అదే సమయంలో జపాన్ ప్రధాని సతీమణి అకి అబే అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్స్ అసోషియేషన్ను సందర్శించనున్నారు. -
ఉత్తర కొరియాపై జపాన్‌కు కోపమొచ్చింది
టోక్యో: ఉత్తర కొరియా చర్యలపై జపాన్ మండిపడింది. ఇటీవల ఆదేశం బాలిస్టిక్ మిసైల్ పరీక్షలు జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జపాన్ ప్రధాని షింజో అబే ప్రత్యేకంగా ఈ అంశంపై మాట్లాడుతూ బాలిస్టిక్ మిసైల్ పరీక్షలు జరపడమనేది ఉత్తర కొరియా ఏమాత్రం ఆలోచన లేకుండా చేస్తున్న చర్య అన్నారు. ఇలాంటి చర్యలను తమ భద్రతకు ఆ దేశం చేస్తున్న హెచ్చరికలుగానే భావిస్తున్నామని.. వెంటనే ఉత్తర కొరియా వాటిని నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఉత్తర కొరియా చేస్తున్న చర్యలు ఈ మాత్రం క్షమించరానివని, ఆ దేశం నిర్లక్ష్యంగా చేస్తున్న చేష్టలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఉత్తర కొరియా వరుసగా బాలిస్టిక్ మిసైల్ పరీక్షలు జరుపుతున్న తెలిసిందే. ఈ చర్యల పట్ల ఇప్పటికే దక్షిణ కొరియా, అమెరికా ఆందోళన వ్యక్తం చేయగా తాజాగా జపాన్ కూడా వాటి సరసన చేరింది.