‘ఆ ఫొటోలు చూసి ఊపిరాగినంతపనైంది’
కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో ఓ బీచ్‌లో పెద్ద మరణ మృదంగం.. అయితే, అది మనుషులది కాదు.. సముద్ర ప్రాణులది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు వేలు దాటి లక్షల్లో జెల్లీ ఫిష్ మృత్యువాతపడ్డాయి. ఇది చూసిన పర్యాటకులు, సముద్ర జంతురాశిని ప్రేమించేవారు ఓకింత కంటతడి కూడా పెడుతున్నారు. చార్లోటి లాసన్(24) అనే వ్యక్తి క్వీన్స్‌లాండ్ తీరానికి వెళ్లాడు. దూరం నుంచి చూసి సముద్రపు ఒడ్డు భలే విచిత్రమైన కలర్ ఉందే అనుకొని ఫొటో తీశాడు. అనంతరం సమీపించి చూడగా తాను తీసిన ఫొటోలో పడింది సముద్రపు కలర్ కాదని, చచ్చిపడి ఉన్న వేల జెల్లీఫిష్‌లని తెలిసి అవాక్కయ్యాడు.
పోని అదేదో తాను ఫొటో తీసిన ప్రాంతంలోనే అనుకుంటే అది కాదు.. ఏకంగా ఆ సముద్ర తీరం ఎంతపొడవుందో అంత దూరం చనిపోయిన జెల్లీ ఫిష్ దర్శనమిచ్చాయి. సముద్ర తీర ప్రాంతంలో తిరుగాడే జంతువులకు సంబంధించిన బయాలజిస్ట్ లిసా అన్ గెర్ష్విన్ స్పందిస్తూ తాను ఆ ఫొటోలు చూసి కదిలిపోయానని, ఒక్క క్షణం ఊపిరి ఆగినంతపనైందని చెప్పింది. అదెదో ఒక వాల్ పేపర్‌లాగా పరుచుకుపోయాయి. ఏమాత్రం నిడివి లేకుండా దగ్గరదగ్గరగా అచ్చం సముద్రపు వర్ణం మాదిరిగా చనిపోయి పడి ఉన్నాయి. సముద్ర జలాలు కలుషితం అవ్వడం, వాతావరణంలో విపరీత మార్పులు వాటి చావుకు కారణమై ఉండొచ్చని, తాము కారణాలు శోధిస్తున్నామని ఆమె చెప్పారు.