కరుణతో వస్తాడో.. కసాయి అవుతాడో..!
లండన్: జిహాదీ జాన్.. ఈ పేరు ఇప్పుడు దాదాపుగా అందరికీ సుపరిచితమే.. కసాయి అనే పదం అతడికి సరిగ్గా సరిపోతుంది. నల్లటి ముసుగు ధరించి కేవలం కళ్లు మాత్రమే కనిపించేలా ఉండి చేతులో ఓ పదునైనా కత్తితో కెమెరా ముందు నిల్చుని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకెళ్లిన అమాయకుల గొంతుకలను కోసిపారేసి కరడుగట్టిన ఉన్మాది.
మొన్న అమెరికా జరిపిన వైమానికి దాడుల్లో ప్రాణాలుకోల్పోయాడని ఇస్లామిక్ స్టేట్ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఆ పేరు మాసిపోతుందనగా ఇప్పుడు అదే పేరును తలపించేలా మరోపేరు తెరపైకి వచ్చింది. అదే 'జిహాదీ జాక్'. ఇతడు జిహాదీ జాన్ తమ్ముడా అని అనుకుంటే పొరబడ్డట్టే.. ఎందుకంటే, జిహాదీ జాక్ అనే వ్యక్తి ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరిన తొలి బ్రిటన్ సిటిజన్ గా కనిపించనున్నాడు. బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ లో చెర్వెల్ పాఠశాలలో విద్యనభ్యసించిన జాక్ లెట్స్ అనే ఇతడు మంచి విద్యార్థి, ఫుట్ బాల్ ప్లేయర్, చురుకైనా వాడు, ఎప్పుడూ స్నేహితులతో చలాకీగా ఉండేవాడు.
18 ఏళ్లు వచ్చేసరికి కువైట్లో అరబిక్ విద్యను అభ్యసిస్తానని వెళ్లిన అతడు అనూహ్యంగా ఐసిస్ లో చేరాడు. తాను సిరియా వెళ్లి ఉగ్రవాదుల్లో చేరిపోయానని 2014 సెప్టెంబర్ లో చెప్పినట్లు అతడి కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. జాక్ తల్లిదండ్రులు ఆక్స్ ఫర్డ్ నగరంలో నివసిస్తున్నారు. ఏ క్షణం తమ కుమారుడికి ఏమవుతుందో అని ఒక తల్లిదండ్రులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అసలు అతడు అలా ఎందుకు మారాడో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు, స్నేహితులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. గతవారం 100 మంది ఉగ్రవాదులవరకు చనిపోయారు. అయితే, ఈ ఫైటింగ్ లో జిహాదీ జాక్ పాల్గొన్నాడో లేదో తెలియడం లేదు. ఏదేమైనా తనతల్లిదండ్రుల కోరిక నెరవేరి తిరిగి జాక్ ఇంటికి వస్తాడో.. లేక ఇటీవల ప్రాణాలు కోల్పోయిన జిహాదీ జాన్ గా మారి అమాయకుల ప్రాణాలు హరిస్తాడో చూడాలి.