
గురువారం దీపావళి వేడుకల్లో జ్యోతిప్రజ్వలన చేస్తున్న జాన్ కెర్రీ
అమెరికా విదేశాంగ శాఖలో తొలిసారిగా వేడుకలు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: దీపాల పండుగ దీపావళిని గురువారం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. పాక్, బ్రిటన్ తదితర విదేశాల్లోని హిందువులు, సిక్కులు తదితర భారత సంతతి ప్రజలూ వేడుకలు చేసుకున్నారు. దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శుభాకాంక్షలు తెలిపారు. 2009లో వైట్‌హౌస్‌లో దీపావళిని తొలిసారి నిర్వహించినందుకు తనకు గర్వంగా ఉందన్నారు. గురువారం అమెరికా విదేశాంగ శాఖ కార్యాలయంలోని చారిత్రక బెంజమిన్ ఫ్రాంక్లిన్ గదిలో ఆ శాఖ మంత్రి జాన్ కెర్రీ తొలిసారి దీపావళి వేడుకలు నిర్వహించారు. వేద మంత్రాల మధ్య సంప్రదాయబద్ధంగా సాగిన ఈ కార్యక్రమంలో ఆయన దీపం వెలిగించారు. భారత్ అమిత శక్తిసామర్థ్యాలున్న దేశమని కొనియాడారు. కాగా, సరిహద్దులో పాక్ కాల్పుల నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలు సరిగ్గా లేకున్నా పాకిస్థాన్, దీపావళిని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలకు స్వీట్లు పంపింది.