'వస్తే రండి.. లేదంటే మూల్యం తప్పదు'
ఇస్లామాబాద్: అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వంతో శాంతియుత చర్చలకు హాజరుకాకపోవడంతో తాలిబన్లపై పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. శాంతియుత చర్చలకు హాజరుకావాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నెల ప్రారంభంలో తాలిబన్లు ఆపరేషన్ ఒమారి (తాలిబన్ ఫౌండర్ ముల్లా మహమ్మద్ ఒమర్) పేరిట అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వాన్ని దించేయాలని నిర్ణయించింది.
అయితే, గత డిసెంబర్లో పాక్, అఫ్ఘానిస్తాన్, చైనా, యూఎస్లు చేసుకున్న నాలుగుదేశాల ద్వైపాక్షిక ఒప్పందం(క్యూసీజీ)కి తాలిబన్ల ప్రకటన వ్యతిరేకంగా ఉండటంతో శాంతి చర్చలు చేపట్టాలని పాక్ ప్రభుత్వం తాలిబన్లకు సూచించింది. సంప్రదింపులను వ్యతిరేకిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించినట్లు పాకిస్థాన్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 600 మంది అప్ఘాన్ పౌరులు, 161 మంది పిల్లలు తాలిబన్ల దాడిలో మరణించారు.