ప్రధానికి షాక్.. కోర్టుకు హాజరు కావాలని ఆదేశం
ఇస్లామాబాద్: పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. తన కుటుంబ ఆస్తులకు సంబంధించి పనామా పేపర్స్ లీక్ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని అధినేతను జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం (జేఐటీ) ఆదేశించింది. ఈనెల 15న ఉదయం 11 గంటలకు ఇస్లామాబాద్‌లోని ఫెడరల్ జ్యుడీషియల్ అకాడమీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని జేఐటీ ఈనెల 8న సమన్లు జారీ చేసింది.
ఇప్పటివరకూ ఏ పాక్ ప్రధాని న్యాయ విచారణ ఎదుర్కొనలేదు. దీంతో విచారణ కమిటీ ముందు హాజరయ్యే మొదటి ప్రధాని నవాజే అవుతారని పాక్ వార్తా సంస్థ డాన్ న్యూస్ తెలిపింది. అంతేకాకుండా ఆర్థిక మంత్రి ఇషాక్ దర్‌ను కూడా కమిటీ ప్రశ్నించే అవకాశం ఉందని డాన్ న్యూస్ తెలిపింది. జూన్ 2న షరీఫ్ రెండో కుమారుడు ఆరుగురు సభ్యుల విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. ఆయన పెద్ద కుమారుడు హుస్సేన్ నవాజ్ కూడా విచారణ కమిటీ ముందు మూడోసారి హాజరయ్యారు.