
అక్కడే ఉన్న ఆమె కుమారుడు బెకమ్ అల్లరి చేయడంతో.. అతన్ని ఎత్తుకుని ప్రమాణం చేసేందుకు తంటాలు పడింది. జూలియానా ఇబ్బందిని గమనించిన జడ్జీ రిచర్డ్ డింకిన్స్ చిన్నారి బెకమ్‌ను చేతుల్లోకి తీసుకున్నాడు.
వాషింగ్టన్: మనసుంటే మార్గం ఉంటుందని వాషింగ్టన్‌లోని ఓ కోర్టు జడ్జి నిరూపించారు. తన కళ్లెదుటే ఓ యువ న్యాయవాది ఇబ్బందులు పడుతుండటం చూసి.. ఆమెకు సాయం చేశాడు. అతని గొప్ప మనసును పొగుడుతూ.. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. వివరాలు.. జూలియానా లామర్ అనే వివాహిత లాకోర్సు సమయంలో గర్భం దాల్చింది. కోర్సు పూర్తయ్యేనాటికి ఓ పడంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈక్రమంలోనే ఆమె న్యాయవాద వృత్తిని చేపట్టడానికి సిద్ధమైంది.
అయితే, జూలియానా అడ్వకేట్‌గా ప్రమాణం చేస్తున్నప్పుడు ఓ చిక్కొచ్చిపడింది. అక్కడే ఉన్న ఆమె కుమారుడు బెకమ్ అల్లరి చేయడంతో.. అతన్ని ఎత్తుకుని ప్రమాణం చేసేందుకు తంటాలు పడింది. జూలియానా ఇబ్బందిని గమనించిన జడ్జీ రిచర్డ్ డింకిన్స్ చిన్నారి బెకమ్‌ను చేతుల్లోకి తీసుకున్నాడు. ఓ చేతిలో పిల్లాడిని, మరో చేతిలో ప్రమాణ పత్రాన్ని పట్టుకుని జడ్జీ జూలియానాతో ప్రమాణం చేయించి అందరిని ఆశ్చర్య చకితుల్ని చేశారు.
Y'all. Judge Dinkins of the Tennessee Court of Appeals swore in my law school colleague with her baby on his hip, and I've honestly never loved him more. pic.twitter.com/kn0L5DakHO
— Sarah Martin (@sarahfor5) November 9, 2019
వీడియో చూసిన వాళ్లలో కొందరు.. సదరు జడ్జీకి ఈ ఏడాది ప్రెసిడెన్షియల్ గుడ్ హ్యూమానిటీ అవార్డు ఇవ్వాలని అభిప్రాయపడగా, మరికొందరు... స్త్రీలను గౌరవించే సమాజం ఉందని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణగా అభివర్ణించారు. ఒక మహిళ తన జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడానికి అనువైన వాతావరణం కల్పిస్తున్న సమాజానికి చేసే ప్రయత్నం అని కామెంట్ చేశారు. పిల్లాడు మారాం చేయకపోయి ఉంటే ఇంత గొప్ప మానవీయ దృశ్యం ప్రపంచానికి దక్కేది కాదని.. పిల్లాడు పెద్దవాడైన తర్వాత అతనికి చూపించడానికి వీలుగా ఈ వీడియో దాచి ఉంచమని కొంతమంది లాయరమ్మకు సలహా ఇచ్చారు.