సింగపూర్ సిటీ: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సింగపూర్ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. సోమవారం రాత్రి తాను బస చేసిన సెయింట్ రెజిస్ హోటల్ నుంచి బయటకు వచ్చి వీధుల్లో సరదాగా చక్కర్లు కొట్టారు.
ఆయన్ని అలా చూసే సరికి ప్రజలంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. అణ్వాయుధాలతో అగ్రరాజ్యాన్ని సైతం వణికించిన కిమ్.. సరదాగా నవ్వుతూ తమ మధ్య తిరగటాన్ని ప్రజలు ఆస్వాదించారు. ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దారి పొడవునా కిమ్ కిమ్.. అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో ఆయన వెంట సోదరి కిమ్ యో జోంగ్, ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యోంగ్ హో, ఇంకా పలువురు రిపోర్టర్లు ఉన్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్‌తో కూడా దౌత్య సంబంధాలు మెరుగుపడే దిశగా కిమ్ చర్చలు జరపటం విశేషం.
సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ కిమ్‌తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కాగా, భారత కాల మానం ప్రకారం ఈ వేకువ ఝామున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భేటీ కాగా.. చర్చలు ఫలవంతమైనట్లు ట్రంప్ ప్రకటించారు. మరికాసేపట్లో ఇద్దరు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment