సియోల్: అణుబాంబులు.. అమెరికా నాశనం.. యుద్ధం.. ఇవి తప్ప ఇంకో దాని గురించి ఆలోచించని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఉన్నట్టుండీ విహారయాత్రకు వెళ్లారు. నిన్నటి దాకా అణు క్షిపణి పరీక్షలతో, అమెరికాపై యుద్ధానికి కాలుదువ్వుతూ బిజీగా ఉన్న కిమ్.. తన భార్య, సోదరితో కలసి దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని ఓ కాస్మొటిక్ ఫ్యాక్టరీని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా సౌందర్య ఉత్పత్తుల పరిశ్రమపై కిమ్ ప్రశంసలు కురిపించారని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది. ‘ఫ్యాక్టరీ నుంచి ప్రపంచస్థాయి ఉత్పత్తులు వస్తున్నాయి.
మరింత అందంగా కనిపించాలనే మహిళల కలలను సాకారం చేసే ఉత్పత్తులు ఇక్కడ చేస్తున్నారు’ అని కిమ్ పొగిడినట్లు వెల్లడించింది. కిమ్ భార్య రి సోల్ జు, సోదరి కిమ్ యో జోంగ్‌తోపాటు అధికార పార్టీ నేతలు కూడా ఈ యాత్రలో ఉన్నారు. గతంలో ఉ.కొరియా అధినేతల భార్యలు, సోదరీమణులు సహా ఇతర మహిళలెవరూ బయటకు వచ్చేవారు కాదు. చాలా తక్కువగా ప్రజలకు కనిపించేవారు. అయితే 2011లో కిమ్ దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాత సంప్రదాయానికి స్వస్తి పలికారు. దీంతో భార్య, సోదరి ఆయనతో కలసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రముఖ గాయని కూడా అయిన కిమ్ భార్య ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇక యో జోంగ్.. పార్టీ పొలిట్‌బ్యూరోలో కీలక సభ్యురాలు. 1948లో ఉ.కొరియా ఏర్పాటైనప్పటి నుంచి కిమ్ వంశస్థులే దేశాన్ని పాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment