
న్యూయార్క్: ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల కంటే తక్కువ నిద్ర పోయేవారికి మనోవ్యాకులత, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయట. తాజాగా అమెరికాలో జరిగిన అధ్యయనం ఇది తేల్చింది. నిద్రపోయే సమయంలో తేడాలు రావడం వల్ల ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయని బింగమ్‌టన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనం కోసం కొందరి నిద్రశైలిని గమనించారు. తక్కువగా నిద్రపోయిన వారికి వివిధ రకాల ఫొటోలు చూపించి, వారి భావోద్వేగాలను పరిశీలించారు. చాలా మందికి ప్రతికూల స్పందనలు వచ్చినట్టు గుర్తించారు. వీళ్లు ప్రతికూల ఆలోచనల నుంచి దృష్టిని మళ్లించుకోవడానికి కూడా ఇబ్బందిపడినట్టు వెల్లడయింది. సాధారణ నిద్ర ఉన్న వారికి ప్రతికూల భావనలు కలిగే ఫొటోలు చూపించినా కాసేపటికి తమ దృష్టిని మళ్లించగలిగారు.