
సాక్షి : కేవలం ఒక్కడే లాస్ వెగాస్ లో 59 మందిని దారుణంగా కాల్పి చంపి .. 520 మందిని గాయపరిచాడు. మాండలే బే రిసార్ట్ లోని మ్యూజిక్ కాన్సర్ట్ పై బుల్లెట్ల వర్షం కురిపించిన స్టీఫెన్ క్రెయిగ్ పాడ్డాక్ అమెరికా దేశ చరిత్రలోనే అతి పెద్ద నర మేధానికి కారకుడయ్యాడు. 64 ఏళ్ల పాడ్డాక్ అసలు ఎందుకిలా చేశాడన్న దానిపై పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
రిసార్ట్ కు 130 కిలోమీటర్ల దూరంలోని ఈశాన్యంలో ఉన్న మెసీ క్వీట్ లో పాడ్డాక్ నివాసముంటున్నాడు. గోల్ఫర్లు, జూదగాళ్లు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఫెన్‌తోపాటు పాటు 62 ఏళ్ల మారిలో డాన్లే అనే మహిళ కూడా ఆ ఇంట్లో ఉంటోందంట. అయితే ఆమె ఘటన జరిగిన సమయంలో టోక్యోలో ఉందని, ఆమెతో తాము మాట్లాడామని పోలీసులు వెల్లడించారు. పాడ్డాక్ కు హంటింగ్, ఫిషింగ్, పైలట్ లైసెన్సులు ఉన్నాయని తెలిపారు. ధనికుడైన అతనికి రెండు చిన్నపాటి విమానాలు కూడా ఉన్నాయని తెలిపారు.
గతంలో లాక్ హీడ్ మార్టిన్ లో ఇంటర్నల్ ఆడిటర్ గా మూడేళ్లపాటు పనిచేసినట్టు గుర్తించారు. ఈ మధ్య ఇస్లాంకు మతం మారిన అతను.. ఐసిస్‌లో చేరి ఈ పనికి పాల్పడి ఉంటాడా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాడ్డాక్‌కు ఎలాంటి నేరచరిత్ర లేదని చెప్పిన పోలీసులు, ఘటన అనంతరం అతని నివాసంలో 34 తుపాకులను, పెద్ద ఎత్తున్న తూటాలను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో అతని కుటుంబం గురించి మాత్రం ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
స్టీఫెన్ తండ్రి హాస్కిన్స్ బెంజమిన్ పాడ్డాక్ ఓ కరుడుగట్టిన దొంగ అని తెలుస్తోంది. ఒనానోక సమయంలో ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో అతని పేరు 8 ఏళ్ల పాటు ఉంది. వరుస బ్యాంకు దొంగతనాలతో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన అతను.. ఓ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడి టెక్సాస్ కేంద్ర కారాగారంలో శిక్షననుభవించాడు. 1969లో జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు కూడా. వైద్యులు అతనిని సైకోపాత్ గా పేర్కొనేవారని, తరచూ ఆత్మహత్యల గురించి తోటి ఖైదీలతో మాట్లాడుతుండే వాడని పోలీసులు తెలిపారు.
సోదరుడు ఏం చెబుతున్నాడంటే..
తన సోదరుడు తండ్రి లాగ కాదని ఎరిక్ క్రెయిగ్ పాడ్డాక్ చెబుతున్నారు. మత, రాజకీయ, మిలటరీ సంస్థలతో స్టీఫెన్‌కు ఎలాంటి సంబంధాలు లేవని ఎరిక్ స్పష్టం చేశారు. అతని అవివాహితుడు అని సోదరుడు చెబుతున్నప్పటికీ.. 1980లో స్టీఫెన్ కాలిఫోర్నియాలో జీవించేప్పుడు ఓ మహిళను వివాహం చేసుకున్నాడని రికార్డులు చెబుతున్నాయి.
తన సోదరుడు చాలా మంచివాడని, ఇది తన సోదరుడే చేశాడంటే నమ్మశక్యంగా లేదని, పైగా అతనికి ఆర్థిక సమస్యలు కూడా ఏం లేవని సోదరుడు తెలిపాడు. స్టీఫెన్‌కు విలాస పురుషుడని.. పోకర్ (జూదం) ఆటంటే తన సోదరుడికి చాలా ఇష్టమని, దాని కోసమే తన నివాసాన్ని లాస్ వెగాస్ కు మార్చాడని ఎరిక్ తెలిపారు. ఓవైపు ఘటనకు తామే బాధ్యులమని ఐసిస్ ఇప్పటికే ప్రకటించగా.. దర్యాప్తు పూర్తయ్యాకే ఆ అంశంపై ఓ నిర్ధారణకు వస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇక ఇప్పటిదాకా జరిగిన ఘటనల్లో చాలా మట్టుకు యుక్త వయసు ఉన్న వాళ్లే ఘటనలకు పాల్పడిన దాఖలాలు ఉండగా.. 60 ఏళ్ల వయసులో స్టీఫెన్ ఎందుకిలా చేశాడన్నది తేలాల్సి ఉందని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. దీంతో ఉన్మాద చర్యా, ఉగ్ర ఘటన అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.