లాస్ వేగాస్: ఎదుటి వారి ప్రాణం కళ్లముందే పోతున్నా మనకు ఎందుకులే అనుకునే ఈ రోజుల్లో ఓవ్యక్తి అసమాన ధైర్యసాహసాలు చూపించాడు. సోమవారం లాస్‌వేగాస్‌లో జరిగిన కాల్పుల్లో వందలాది మంది ప్రాణాలు కాపాడాడు. కాలిఫోర్నియాకు చెందిన జొనాథన్ స్మిత్(30) కాఫీ మెషిన్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. సోమవారం నాడు తన సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడానికి లాస్‌వేగాస్ వచ్చాడు. దేశీయ సంగీత ఉత్సవం జరుగుతున్న మాండలై బే హోటల్‌లో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. అంతలోనే కాల్పుల మోత ప్రారంభమైంది. దీంతో తన 9మంది కుటుంబ సభ్యులను కాపాడుకునే ప్రయత్నంలో వారందరని అక్కడ నుంచి సురక్షితంగా బయటకు పంపించగలిగాడు.
అనంతరం కాల్పులు జరుగుతున్నయంటూ గట్టిగా అరుస్తూ, అక్కడ ఉన్న వారిని తనతో పాటు రావాలంటూ సూచించాడు. ఎయిర్‌పోర్టు మార్గంలో ఉన్న వికలాంగుల కార్‌పార్కింగ్ ప్రాంతానికి అక్కడ ఉన్న చాలా మందిని సురక్షితంగా తరలించగలిగాడు. ఈప్రయత్నంలో దుండగుడి గన్‌లోంచి స్మిత్ మెడలోకి ఓబుల్లెట్ దూసుకుపోయింది. అయినా ఏమాత్రం భయపడకుండా ప్రజల ప్రాణాలు కాపాడగలిగాడు. ఈ సందర్భంగా స్మిత్ మాట్లాడుతూ తనకు బుల్లెట్ తగిలినందుకు ఏమాత్రం బాధలేదని కొంతమందినైనా రక్షించింనందుకు సంతోషంగా ఉందన్నాడు.
మెడలో బుల్లెట్ తగలడంతో స్మిత్ పక్కటెముకలు పాక్షింగా దెబ్బతిన్నాయని, జీవిత కాలం బుల్లెట్ స్మిత్ శరీరంలోనే ఉంటుందని వైద్యులు ప్రకటించారు. తనకు ఎటువంటి ప్రమాదం లేదని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈసంఘటనతో స్మిత్ సోషల్‌మీడియాలో హీరో అయిపోయాడు. గాయాలతో ఉన్న ఫోటో 75వేల సార్లు షేర్ అవగా, లక్షా 77వేల లైకులను సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment