ప్రపంచంలోనే విచిత్రమైన పెళ్లి!
లాస్ ఏంజిల్స్: వరుడు ఆరన్ చక్కగా బ్లాక్ సూటు, కోటు వేసుకొని పెళ్లికొడుకులా ముస్తాబయ్యాడు. వధువు కూడా చక్కని కవర్‌లో ఒదిగి ఉంది. ఇద్దరు ఎదురెదురుగా ఉండగా పెళ్లి పెద్ద మైఖేల్ కెల్లీ.. ఇద్దరితో ప్రమాణాలు చేయించాడు. ఆరన్ అనబడే నువ్వు ఈ స్మార్ట్‌ఫోన్‌ను చట్టబద్ధంగా వివాహం చేసేందుకు సమ్మతిస్తున్నావా? ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రేమిస్తూ.. గౌరవిస్తూ.. విశ్వసనీయంగా ఉంటూ.. సుఖంగా చూసుకుంటానని దైవసాక్షిగా వాగ్దానం చేస్తున్నావా? అని ఆరన్‌ని అడిగాడు. అందుకు ఆరన్ సమ్మతించడంతో అంగరంగ వైభవంగా స్మార్ట్‌ఫోన్‌తో అతని పెళ్లి జరిగింది.
పోయి, పోయి స్మార్ట్‌ఫోన్‌ను పెళ్లిచేసుకోవడం ఏమిటని విస్తుపోతున్నారా? అవునండి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఆరన్ చెర్వెనార్ ఏరికోరి మరీ తన మొబైల్ ఫోన్‌ను పెళ్లిచేసుకున్నాడు. ఈ పెళ్లి తంతు మధురానుభూతిగా మిగిలిపోవాలని అతడు లాస్ ఏంజిల్స్ నుంచి లాస్ వెగాస్ వచ్చి.. అక్కడ సంప్రదాయబద్ధంగా స్మార్ట్‌ఫోన్‌ను జీవిత భాగస్వామి చేసుకున్నాడు. ఈ విచిత్రమైన పెళ్లి తంతు జరిపించే పెద్దగా మైఖేల్ కెళ్లి వ్యవహరించారు.
లాస్ వెగాస్‌కు పెళ్లి కోసం వచ్చే ఎంతోమంది జంటలను తాను ఏకం చేశానని, తొలిసారిగా ఆరన్-సెల్‌ఫోన్ జంటకు వివాహం చేశానని మైఖేల్ చెప్పారు. మరీ ఆరన్ స్మార్ట్‌ఫోన్‌ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే అందుకు కారణం లేకపోలేదు. మనుష్యులకు ఇప్పుడు సెల్‌ఫోన్‌తో అనుబంధం విపరీతంగా పెరిగిపోయింది. అది లేకుండా నిమిషం కూడా ఉండలేని పరిస్థితి. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకొనే వరకు అస్తమానం సెల్‌ఫోన్ దగ్గరుండాల్సిందే. అలా స్మార్ట్‌ఫోన్‌కు మనుష్యులు బానిసలు అయిపోతున్నారు కనుక తాను దానిని పెళ్లి చేసుకుంటే తప్పేమున్నదని భావనతో ఆరన్ ఇంత పనిచేశాడట.