
షాంఘై/బీజింగ్: చైనా ఇంటర్నెట్ దిగ్గజం బైడు సీఈవో రాబిన్ లీకి చేదు అనుభవం ఎదురైంది. బైడు సంస్థ వార్షిక సదస్సులో భాగంగా ఆయన వేదిక మీద మాట్లాడుతుండగా.. ఒక వ్యక్తి ఆకస్మికంగా వేదిక మీదకు వచ్చి.. బాటిల్‌లోని నీళ్లను ఆయన నెత్తిమీద గుమ్మరించాడు. ఈ హఠాత్ పరిణామంతో కంగుతిన్న రాబిన్ లీ.. ‘నీ సమస్య ఏందోయ్’ అంటూ ఆ వ్యక్తి మీద కేకలు వేశారు. ఆ వెంటనే ఈ పరిణామం నుంచి వెంటనే తేరుకున్న రాబిన్ లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. బైడు క్రియేట్ 2019 సదస్సులో భాగంగా బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ సదస్సులో కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఎలా వినియోగించుకోవాలని అంశంపై రాబిన్ లీ ప్రసంగిస్తుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. నెత్తిమీద నీళ్లు గుమ్మరించినా.. ఒకింత అసహనానికి గురికాకుండా రాబిన్ లీ ప్రసంగాన్ని కొనసాగించడంతో.. ఆహూతులు ఆయనను కరతాళ ధ్వనులతో ప్రశంసించారు. రాబిన్ లీపై యువకుడు నీళ్లు గుమ్మరించిన ఘటనపై సోషల్ మీడియాలో సెటైర్లు, జోకులు వ్యక్తమవుతున్నాయి. ‘మీరు రాబిన్ లీని ఎంతైనా ద్వేషించండి. కానీ, ఇలా నీళ్లను వృథా చేయడం మాత్రం బాగలేదు’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.