3వేల లాటరీతో.. ఐలండ్ రిసార్ట్ గెలిచాడు!
అదృష్టం అంటే అతడిదే. కేవలం 3వేల రూపాయలు పెట్టి ఓ లాటరీ టికెట్ కొంటే.. ఏకంగా ఓ ఐలండ్ రిసార్ట్ అతడికి బహుమతిగా వచ్చేసింది. అది కూడా అలాంటిది, ఇలాంటిది కాదు.. పగడాల దిబ్బలు, గుహలు, మంచి అడవులు.. ఇవన్నీ ఆ దీవిలో ఉన్నాయి. న్యూ సౌత్ వేల్స్ ప్రాంతానికి చెందిన జోషువా అనే ఆ వ్యక్తి ‘ద కోస్రే నాటిలస్ రిసార్ట్’ను గెలుచుకున్నారు. దాని యజమానులు ఆస్ట్రేలియన్ దంపతులు. వాళ్లకు మనవళ్లు, మనవరాళ్లు పుట్టడంతో.. ద్వీపం వదిలి ఆస్ట్రేలియా వెళ్లిపోదాం అనుకుని ద్వీపాన్ని లాటరీ పెట్టారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ రిసార్టును ఎవరైనా బాగా ప్రకృతి ప్రేమికులకు ఇవ్వాలని వాల్లు అనుకున్నారు. ఏదో డబ్బులు పెట్టి కొనుక్కోవడం కాకుండా.. ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించే వాళ్లయితే మేలని భావించారు.
దీనికి సంబంధించి కథనాన్ని ఓ వెబ్సైట్లో చూసిన జోషువా.. మూడు టికెట్లు కొన్నాడు. అనుకోకుండా అతడికి లాటరీ తగిలేసింది. దాంతో అతడి ఆనందానికి అంతూ పొంతూ లేదు. ఐలండ్ రిసార్టు యజమానులు డౌగ్, సాలీలకు తాను ఎంతో రుణపడి ఉంటానని చెప్పాడు. కాగా, ఈ ఐలండ్ రిసార్ట్ గెలుచుకోడానికి లాటరీ నిర్వహించగా.. మొత్తం 75,485 టికెట్లు అమ్ముడుపోయాయి.150 దేశాలకు చెందినవాళ్లు వీటిని కొన్నారు. ఒకో టికెట్ను రూ. 3వేల చొప్పున అమ్మారు. ఎక్కువ టికెట్లు కొంటే డిస్కౌంటు కూడా ఇచ్చారు. జోషువా కావాలనుకుంటే తనంతట తానే ఈ రిసార్టును నిర్వహించుకోవచ్చు.. లేదా మేనేజర్ను నియమించుకోవచ్చు. దీనిమీద ఎలాంటి అప్పులు లేవు. ఇప్పటికే లాభాల్లో ఉంది, తగినంతమంది సిబ్బంది కూడా ఇందులో ఉన్నారు. మరి ఇది బంపర్ ప్రైజ్ కాక మరేమవుతుంది!!