పేలుడు పదార్థాలను ఒక్కడే సీక్రెట్‌గా కొని..!
మాంచెస్టర్/లండన్: పాప్ స్టార్ అరియానా గ్రాండే మ్యూజిక్ కన్సర్ట్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి కేసులో మాంచెస్టర్ నగర పోలీసులు ఇప్పటికే 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆత్మాహుడి దాడికి పాల్పడిన వ్యక్తిని లిబియా సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు సల్మాన్ అబేదిగా పోలీసులు ఇదివరకే గుర్తించారు. అయితే నిందితుడు బాంబు పేల్చడానికి కావలసిన సామాగ్రిని తానొక్కడే కొనుగోలు చేశాడని నార్త్ వెస్ట్ కౌంటర్ టెర్రరిస్టు విభాగం చీఫ్ రస్ జాక్సన్ మీడియాకు తెలిపారు. వారం రోజుల కిందట మాంచెస్టర్‌లో చోటుచేసుకున్న ఈ మారణకాండలో చిన్నారులు సహా 22 మంది మృతిచెందగా, 116 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
ఈ దాడికి పాల్పడే నాలుగు రోజుల ముందే మాంచెస్టర్‌లో సల్మాన్ అబేది అడుగుపెట్టాడు. ఈ సమయంలో పేలుడు పదార్థాలను పలు ఏరియాలలో తిరిగి ఎవరికీ అనుమానం రాకుండా కొనుగోలు చేసి ప్లాన్ ప్రకారమే మారణహోమం సృష్టించాడని జాక్సన్ వెల్లడించారు. దాడికి ముందు అతడు ఎవరెవరికీ ఫోన్ చేశాడు.. ఏ విషయాలపై చర్చించాడన్న దానిపై బ్రిటన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్లూ సూట్‌కేసులో బాంబుతో సహా మ్యూజిక్ కన్సర్ట్ ప్రాంతానికి వచ్చి పేల్చేసుకున్నాడని చెబుతున్నారు. దాడి జరిగిన మాంచెస్టర్ ఎరీనా హాలు యూరప్‌లోనే అతి పెద్దదని, భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించాలన్న లక్ష్యంతోనే ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు.
గడాఫీ నియంత పాలన నుంచి తప్పించుకునేందుకు అబేది కుటుంబం బ్రిటన్‌కు వలసవచ్చింది. ఉగ్రదాడి కోసం అబేది లండన్ నుంచి మాంచెస్టర్‌కు నాలుగు రోజుల ముందుగానే రైల్లో వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మాంచెస్టర్‌లోని అబేది ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు రస్ జాక్సన్ పేర్కొన్నారు. దాడి చేసిన రోజే ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ప్రకటించగా.. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.