వాషింగ్టన్: గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర‍్భంగా సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై వచ్చిన విమర్శలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఫేస్‌బుక్‌పై ట్విట్టర్ వేదికగా ఆరోపణలకు దిగారు. ఫేస్‌బుక్ తనకు వ్యతిరేకంగా పనిచేసిందని ట్వీట్ చేశారు. కొన్ని నెట్‌వర్క్‌లు తనకు ఎపుడూ వ్యతిరేకమేననీ, ఇది కుట్ర్రా? అంటూ ట్రంప్ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2016 అమెరికా ఎన్నికల సందర్బంగా సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్ తనకు వ్యతిరేకంగా పనిచేసిందంటూ ట్రంప్ మండిపడ్డారు. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సహా ఫేస్‌బుక్ ఎపుడూ తనకు వ్యతిరేకంగా పనిచేశాయని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో కమెంట్ పోస్ట్ చేశారు.
అయితే ట్రంప్ ఆరోపణలపై ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఫేస్‌బుక్ తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న ట్రంప్ వాదనను ఆయన కొట్టిపారేశారు. ట్రంప్‌కు మద్దతుగా పనిచేశామని ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తోందన్నారు. ట్రంప్ ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. రెండు పార్టీలు తమకు ఇష్టంలేని ఆలోచనలు, విషయాల గురించి నిరాశ చెందుతున్నాయని వ్యాఖ్యానించారు. కానీ తాము అందరికీ ఉపయోగపడే ఆలోచనలతో ఒక ప్లాట్ ఫాం నడుపుతున్నామని ఫేస్‌బుక్ పోస్ట్‌లో వివరించారు.
కాగా అమెరికా సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ ముందు నవంబరు 1న సాక్ష్యం చెప్పాలని ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ సంస్థలను అమెరికా ప్రభుత్వం కోరింది. అమెరికా ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రష్యాకు సంబంధించిన విచారణలో దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో ఫేస్‌బుక్ 3,000 రాజకీయ ప్రకటనలను దర్యాప్తు ఏజెన్సీ స్పెషల్ కౌన్సిల్ రాబర్ట్ ముల్లెర్‌కు వివరాలను అందచేసింది. ఈ ప్రకటనలను ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత రష్యన్ సంస్థల ద్వారా కొనుగోలు అయినట్టు ఫేస్‌బుక్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
Facebook was always anti-Trump.The Networks were always anti-Trump hence,Fake News, @nytimes(apologized) & @WaPo were anti-Trump. Collusion?
— Donald J. Trump (@realDonaldTrump) September 27, 2017