జెరూసలెం: నలుగురు స్నేహితులు ఒకచోట కలిసారంటే హైఫై ఇచ్చుకోవడాలు, గంటల తరబడి కబుర్లు చెప్పుకోడాలు ఉండేవి. కానీ కరోనా వల్ల ఈ పరిస్థితులు ఇప్పట్లో కనిపించేలా లేవు. దూరం నుంచే నమస్కారాలు, పలకరింపుగా నవ్వినా దాన్ని బయటకు కనిపించనీయకుండా అడ్డుగా ఉండే మాస్కులు. చిన్నా పెద్దా ప్రతి ఒక్కరి జీవనశైలిలో మాస్కు తప్పనిసరిగా మారిపోయింది. అయితే కొన్ని సందర్భాల్లో మాస్కు చికాకు పెట్టిస్తోంది. ముఖ్యంగా తినే సమయంలో మాస్కు ధరించి తినడం అసాధ్యం. కానీ దాన్ని సుసాధ్యమని నిరూపించాడో వ్యక్తి. మాస్కు పెట్టుకునే సుష్టిగా భోజనం చేశాడు. అదెలాగంటారా? మరేం లేదు. అది మామూలు మాస్క్ కాదు.. రిమోట్ కంట్రోల్ మాస్క్. నలుగురి మధ్యలో ఉన్నప్పుడు ఇది పెట్టుకుని భోజనం చేయడం ఎంతో సులువు. (మాస్కు పెట్టుకుంటారా? చీపురు పట్టుకుంటారా?)
దానికి ఉన్న బటన్‌ను నొక్కితే నోటి దగ్గర మాస్కును తెరవచ్చు, మూయవచ్చు. తద్వారా ఎంతో సులువుగా భోజనం ముగించవచ్చు. ఎంతో ముచ్చటగా ఉన్న ఈ కొత్త రకం మాస్కును ఇజ్రాయెల్ ఇన్వెంటర్స్ తయారు చేశారు. దీని గురించి అవ్టీపస్ పేటెంట్స్ అండ్ ఇన్వెన్షన్స్ ఉపాధ్యక్షుడు అసఫ్ గిటెలీస్ మాట్లాడుతూ.. తినే సమయంలో మాస్కు దానంతటదే తెరుచుకుంటుందన్నారు. ఫోర్క్ మాస్క్ దగ్గరకు తేగానే గుర్తించి అది ఓపెన్ అవుతుందని, ఫోర్క్‌ను దూరం పెట్టగానే మళ్లీ మూసుకుపోతుందని తెలిపారు. లేదంటే బటన్ నొక్కి కూడా మాస్కును మూస్తూ తెరవచ్చన్నారు. త్వరలోనే ఈ మాస్కును మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ మాస్క్ ధరించి ఐస్ క్రీమ్ తినడం, జ్యూస్‌లు తాగడం మాత్రం కాస్త కష్టమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి, మున్ముందు దానికి కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా పరిష్కారం కనిపెడతారేమో! (కోవిడ్‌పై పోరులో ఇజ్రాయెల్ ముందంజ! )
Comments
Please login to add a commentAdd a comment