
భారత్, మయన్మార్‌లలో భారీ భూకంపం
సాక్షి,విశాఖపట్నం/శ్రీకాకుళం/న్యూఢిల్లీ: మయన్మార్‌లో బుధవారం సంభవించిన భూకంపం ఈశాన్య భారతంతో పాటు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఢిల్లీల్లో ప్రభావం చూపింది. రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైన భూకంపం మయన్మార్‌లో రాత్రి 7.25 గంటలకు సంభవించింది. మావ్లాక్‌కు ఆగ్నేయంగా 74 కి.మీ. దూరంలో 134కి.మీ.లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించామని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది. భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు వార్తలందలేదు. మిజోరం, నాగాలాండ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, అస్సాం, ఒడిశాలలోనూ భూమి కంపించింది. ప్రజలు భవంతుల నుంచి బయటకు పరుగులుతీశారు. కోల్‌కతాలో మెట్రో సేవలను కాసేపు నిలిపేశారు. గువాహటిలో కొన్ని భవంతులకు బీటలు పడ్డాయి. మయన్మార్‌లోని యాంగాన్‌లో ఆరంతస్తుల ఆస్పత్రి నిమిషంపాటు కంపించింది. చైనా, భూటాన్, బంగ్లాదేశ్, టిబెట్‌లలో భూకంప ప్రభావం కనిపించింది.
విశాఖలోనూ భూకంప ప్రభావం...
మయన్మార్ భూకంప ప్రభావం విశాఖలోనూ కనిపించింది. మయన్మార్‌లో భూకంపం సంభవించిన కొద్దిసేపటికే విశాఖపట్నంలోనూ, జిల్లాలోనూ స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కొన్ని సెకన్లపాటు భవంతులు, ఇళ్లు ఊగుతున్నట్టు అనిపించడంతో జనం భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. కొన్నిచోట్ల ఇళ్లలో సామగ్రి చెల్లాచెదురుగా పడింది. విశాఖలోని అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, మురళీనగర్, పెదవాల్తేరు, ఎండాడ తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. శ్రీకాకుళంలోనూ స్వల్పంగా భూమి కంపించింది. శ్రీకాకుళం, శ్రీకాకుళం రూరల్‌తోపాటు ఆముదాలవలస, ఇచ్చాపురం, సోంపేట, పలాస మండలాల్లో భూమి కంపించింది.